క్యాష్‌ దొరకలేదు కానీ.. కీలక పత్రాలు స్వాధీనం

తమిళ నాట మరో మూడు రోజుల్లోనే అసెంబ్లీ పోలింగ్‌ జరగబోతోంది. ఈ నేపథ్యంలో అక్కడి డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ ఇంట్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తుండడం కలకలం రేపింది. ఓ వైపు ప్రచారంలో ఉన్న స్టాలిన్‌కు ఈ తనిఖీలు పెద్ద తలనొప్పిలా మారాయి. మరోవైపు.. తమను రాకీయంగా ఎదుర్కోలేకనే కేంద్రం ఇలా ప్రేరేపిత ఐటీ దాడికి పాల్పడుతోందంటూ డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్టాలిన్‌ ఏకైక కూతురు సెంతమారి స్టాలిన్‌ ఇంట్లో సోదాలు […]

Written By: Srinivas, Updated On : April 3, 2021 11:48 am
Follow us on


తమిళ నాట మరో మూడు రోజుల్లోనే అసెంబ్లీ పోలింగ్‌ జరగబోతోంది. ఈ నేపథ్యంలో అక్కడి డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ ఇంట్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తుండడం కలకలం రేపింది. ఓ వైపు ప్రచారంలో ఉన్న స్టాలిన్‌కు ఈ తనిఖీలు పెద్ద తలనొప్పిలా మారాయి. మరోవైపు.. తమను రాకీయంగా ఎదుర్కోలేకనే కేంద్రం ఇలా ప్రేరేపిత ఐటీ దాడికి పాల్పడుతోందంటూ డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్టాలిన్‌ ఏకైక కూతురు సెంతమారి స్టాలిన్‌ ఇంట్లో సోదాలు నిర్వహించగా.. పలు కీలక పత్రాలు లభించాయని, వాటిలో నేరాలకు సంబంధించిన ఆధారాలున్నాయని ఐటీ అధికారులు ప్రకటించారు.

సెంతమారి భర్త, స్టాలిన్‌ అల్లుడు శబరీషన్‌తోపాటు డీఎంకేతో సంబంధాలు కొనసాగిస్తున్న.. వివిధ వ్యాపారాలు నిర్వహించే పలువురిపై నిన్న ఐటీ శాఖ దాడులు చేసింది. చెన్నై సహా వివిధ నగరాల్లో సోదాలు జరిగాయి. అన్నానగర్ డీఎంకే అభ్యర్థి మోహన్ కొడుకు కార్తీక్, జీస్క్కేర్ బాలా, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీతోపాటు ఆయన సోదరుడు, తిరువణ్నామలై ఎంపీ అన్నాదురై, తంజావూరు డీఎంకే నేత మురసొలి తదితరుల ఇళ్లపై 25కుపైగా ఐటీ బృందాలు సోదాలు చేశాయి. వీటికి సంబంధించి ఐటీ శాఖ ఒక అధికారిక ప్రకటన చేసింది.

స్టాలిన్‌ కూతురు ఇంట్లో సోదాలు నిర్వహించగా.. అక్కడ ఎలాంటి నగదు దొరకలేదని వెల్లడించింది. కానీ.. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని నిర్ధారించే కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయని ఐటీ శాఖ పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు పంచుతోందని, మద్యం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న కొందరు వ్యక్తులు, సంస్థల నుంచి భారీ ఎత్తున వసూళ్లు చేసి, ఎన్నికల్లో అక్రమంగా ఖర్చుపెడుతున్నారని, ఈ వ్యవహారం మొత్తాన్ని స్టాలిన్ అల్లుడు శబరీషన్, ఇంకొందరు కీలక నేతలు పర్యవేక్షిస్తున్నారన్న సమాచారం మేరకు ఐటీ శాఖ దాడులు చేసింది.

డబ్బుల పంపిణీకి సంబంధించిన కీలక పత్రాలు దొరకినట్లు ఐటీ శాఖ ప్రకటించడం గమనార్హం. తన కుమార్తె, అల్లుడుతోపాటు పార్టీకి చెందిన కీలక నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరగడంపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఘాటుగా స్పందించారు. తిరుచ్చిలో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో ఉన్న సమయంలో దాడుల గురించి తెలుసుకున్న ఆయన బీజేపీపై మండిపడ్డారు. కేంద్ర సంస్థలను ఉపయోగించుని దాడులతో డీఎంకేను భయపెట్టలేరంటూ ఎదురుదాడి చేశారు. ‘ఐటీ దాడులతో బెంబేలెత్తిపోవడానికి మేమేమీ అన్నాడీఎంకే పార్టీ వాళ్లం కాదు. నా పేరు స్టాలిన్.. నేను డీఎంకే నేతను. గతంలో మీసా లాంటి కఠిన చట్టాలను, ఎమర్జెన్సీ విపత్తును సైతం తట్టుకుని నిలబడ్డాం. ఇప్పుడు బీజేపీకి భయపడతామా? నెవర్’ అని స్టాలిన్ అన్నారు.