kartika gopasthami : హిందూ సంస్కృతిలో కార్తీక మాసానికి ప్రత్యేకత ఉంటుంది. ఇది పూజల కాలం. ఈ నెలలో చాలా మంది ఉపవాసాలు చేస్తారు. దీపాలు వెలిగిస్తారు. దీంతో దేవుడి కృప సాధించుకోవాలని తాపత్రయపడుతుంటారు. ఇందులో భాగంగా కార్తీక మాసం శుక్ల పంక్షంలో ఎనిమిదో రోజున గోపాష్టమి వస్తుంది. ఇదినేడు రావడంతో అందరు గోవులను పూజించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ రోజు గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని చెబుతున్నారు. దీంతో గోవులను పూజించి వాటికి ఆహారం తినిపించి తమకు మోక్షం కలగాలని భావిస్తున్నారు. కార్తీక మాసంలో మహిళలు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుతున్నారు.

శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలు మీద ఎత్తిన రోజునే గోపాష్టమిగా చెబుతారు. భక్తులు కృష్ణుడితో పాటు గోవులను పూజించడం ఆనవాయితీ. ఈ రోజు తిరుమలలో పుష్పయాగ మహోత్సవం చేస్తారు. ఇంకా దుర్గాష్టమి వ్రతాన్ని కూడా నిర్వహిస్తుంటారు. గోపాష్టమి గురించి పురాణాలు ఇంకా ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. గోవులను పూజిస్తే ఇంద్రున్ని పూజించిన దానికంటే పుణ్యం ఎక్కువగా వస్తుందని చెప్పడంతో అందరు ఇంద్రునికి బదులుగా గోవులను పూజించారట. దీంతో ఇంద్రుడు కోపోద్రిక్తుడై వారం రోజుల పాటు ప్రళయం సృష్టించాడని చెబుతారు.
ఇంద్రుడి కోపం నుంచి గోవులను, గోపాలురను రక్షించే బాధ్యత తీసుకున్న కృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్థన గిరి ఎత్తి వారం రోజుల పాటు గోవులు, గోపాలురను రక్షించాడు. దీంతో ఇంద్రుడు శ్రీకృష్ణుడి మహిమలు తెలుసుకుని భగవంతుడి స్వరూపంగా భావించి శాంతిస్తాడు. అందుకే ఈ రోజును గోపాష్టమిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు గోవులను పూజిస్తే ఆయురారోగ్యాలు, కీర్తి, ధనం అన్ని కలుగుతాయని విశ్వసిస్తారు. గోవు లక్ష్మిదేవి స్వరూపం కాడంతో పూజ చేస్తే ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు.
ఈ రోజు గోవులను భక్తులు విశిష్టంగా పూజిస్తారు. గోశాలలను సందర్శించి వాటిని శుభ్రం చేస్తారు. ఆవులను చక్కగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు వాటికి ఆహారం తినిపిస్తారు సకల పాపాలు తొలగుతాయని చెబుతారు. గోపాష్టమి సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు గోవులను పూజించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. గోశాలలకు వెళ్లి గోవులను అలంకరించి పూజించి తమకు మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోపూజ చేసి తమ పాపాలను దూరం చేసుకోవాలని చూస్తున్నారు.