Hemant Soren: ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం, విలువైన వనరులను దోచుకోవడం, దాచుకోవడం, ఆపై వ్వవస్థలను వాడుకోవడం చాలా మంది నేతలకు పరిపాటిగా మారింది. పైగా ఇందులో కుటుంబ సభ్యుల జోక్యం పెరిగిపోవడంతో అవినీతి తారస్థాయికి చేరుతోంది. ఇందు గలదు అందు లేదు అని సందేహం లేకుండా.. అన్ని రంగాలను అవినీతి రాచ పుండు లాగా ఇబ్బంది పెడుతూనే ఉంది. సరిగ్గా ఇలాంటి అడ్డగోలు పనులు చేసి.. మనీ లాండరింగ్, బొగ్గు గనుల కేటాయింపులు.. ఇలా ఎన్నో అక్రమాలకు పాల్పడి.. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ పేరుతో రాగానే పరారీ అయ్యాడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్.. మనీ లాండరింగ్, బొగ్గు గనులు కేటాయింపుల పై అక్రమాలకు పాల్పడటం, పైగా కుటుంబ సభ్యులకు భారీగా ప్రయోజనాలు చేకూర్చడం.. వంటి అభియోగాలను జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలకు సంబంధించిన ఆధారాలు కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గర ఉండటంతో వారు సోమవారం ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్ళారు. వివిధ అభియోగాలు ఉన్న నేపథ్యంలో విచారించాల్సి ఉందని వారు సోరెన్ వ్యక్తి గత సిబ్బంది కి తెలిపారు. అయితే వారు చెప్పిన సమాధానానికి వారు అవాక్కయ్యారు. హేమంత్ సోరెన్ ఇంట్లో లేరని.. ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియదని వారు చెప్పడంతో దర్యాప్తు సంస్థల అధికారులు వెనక్కి తిరిగి వచ్చారు.
సోమవారం ఉదయం ఏడు గంటలకు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు ఢిల్లీలోని హేమంత్ సోరెన్ ఇంటికి వెళ్లారు. అనేక అభియోగాలు ఉన్న నేపథ్యంలో విచారించాలని ఆయన వ్యక్తిగత సిబ్బందిని కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు కోరారు. అప్పటికే ఆయన బయటకు వెళ్లిపోయారని వారు చెప్పారు. వారికి మనీ లాండరింగ్ కేసు కు సంబంధించి విచారించాల్సి ఉందని హేమంత్ కు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు జనవరి 27న సమాచారం ఇచ్చారు. అంతకుముందు జనవరి 20న కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు జార్ఖండ్ రాజధాని రాంచీలో హేమంత్ సోరెన్ ను విచారించాయి. మనీలాండరింగ్, బొగ్గు గనుల కేటాయింపులు, ఇతర వ్యవహారాలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రశ్నలు సంధించగా.. వాటికి హేమంత్ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో విసిగి వేసారి పోయిన కేంద్ర దర్యాప్తు సంస్థలు జనవరి 29 లేదా 31 తేదీల్లో విచారణకు అందుబాటులో ఉండాలని వారం క్రితం హేమంత్ సోరెన్ కు సమన్లు జారీ చేశాయి. జనవరి 31న విచారణకు హేమంత్ అందుబాటులో ఉంటారని అతని వర్గాలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు తెలిపాయి. సోరెన్ మాత్రం ఏ తేదీలో విచారణకు హాజరవుతారో, అందుకు ఏ సమయంలో ఆయనకు అనుకూలంగా ఉంటుందో ప్రకటించలేదు. జనవరి 20న విచారణ అనంతరం 27న ఆయన రాంచి నుంచి ఢిల్లీ వెళ్లారు. సోమవారం విచారణ కోసం ఢిల్లీలోని ఆయన ఇంటికి కేంద్ర దర్యాప్తు సంస్థలు వెళ్లగా ఆయన అక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోయారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
జార్ఖండ్ ముఖ్యమంత్రి అనే అధికారాన్ని అడ్డం పెట్టుకొని హేమంత్ సోరెన్ అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అక్రమ మైనింగ్ కార్యకలాపాల ద్వారా వంద కోట్ల ఆదాయ వ్యవహారాలపై కొంతకాలంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. ఇక ఈ కుంభకోణంలో ఆ రాష్ట్రానికి చెందిన సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్, రాంచి డిప్యూటీ కమిషనర్ 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఛవీ రంజన్ తో సహా 14 మందిని ఈడీ ఈ కేసులో అరెస్టు చేసింది. ఒకవేళ హేమంత్ ఈ కేసులో అరెస్టు అయితే ఆయన స్థానంలో అతడి భార్యను ముఖ్యమంత్రిగా నియమించేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ నుంచి ఎదుర్కొనేందుకు హేమంత్ కొంతమంది సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిసినట్లు తెలుస్తోంది. అందువల్లే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది.