AP DSC: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. త్వరలో ఆరువేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డీఎస్సీ, టెట్ పరీక్షను వేరువేరుగా నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి టెట్ పరీక్షకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనుంది. దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్ ను నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. టెట్ తో పాటే పది,పదిహేను రోజుల్లో డీఎస్సీ నిర్వహించేందుకు సైతం ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సీ ప్రకటించలేదు. 2018లో చంద్రబాబు సర్కార్ ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మంజూరైన పోస్టులను భర్తీ చేసింది. జగన్ విపక్ష నేతగా ఉండే సమయంలో.. తాము అధికారంలోకి వస్తే భారీ డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా కాలం గడిపేశారు. సరిగ్గా ఎన్నికల ముంగిట డీఎస్సీ అంటూ హడావిడి చేస్తున్నారు. డీఎస్సీలో 6000 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు ఈనెల 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో డిఎస్సి పై ప్రత్యేక ప్రకటన రానుంది. అయితే అంతకంటే ముందే టెట్ నిర్వహించాలని.. వాటి ఫలితాలు ఇచ్చిన తర్వాత డీఎస్సీ పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్, డీఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు.
అయితే టెట్ నిర్వహణలో సైతం మార్పులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎస్జీటీ పోస్టులకు పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్ 2 విడివిడిగా టెట్ నిర్వహిస్తారు. ఎస్జిటి పోస్టులకు డిఈడి లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులు. టెట్ రాసేందుకు ఓసీలకు ఇంటర్లో 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45% మార్కులు ఉండాలి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ,ఎస్టీ, బీసీ,దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ఈ ఒక్కసారికే అనుమతించింది. గత ప్రభుత్వంలో 2018లో చివరిసారిగా డీఎస్సీ నిర్వహించారు. మొత్తం 7902 పోస్టులకు ప్రకటన ఇచ్చారు. ఆరు లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. కానీ జగన్ సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యంగా ఇస్తోంది. ఆపై టెట్, డీఎస్సీ వేర్వేరుగా నిర్వహిస్తోంది. ఈ ఈ రెండింటి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యేసరికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. వీటి పరీక్షల నిర్వహణ కొత్త ప్రభుత్వంలో వస్తుందన్న టాక్ నడుస్తోంది. ఎన్నికల ముంగిట ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అది కూడా జగన్ హామీ ఇచ్చినట్లు భారీ డీఎస్సీ కాకుండా.. 6000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీకి కసరత్తు చేస్తుండడం పై విమర్శలు వస్తున్నాయి.