Karnataka Elections 2023 : ” కులం కూడు పెట్టదు. మతం మనుగడనీయదు.” వెనుకటి రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందిన సామెత ఇది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సామెతకు అర్థం మారుతుంది. కులమే అధికారంలోకి రావడానికి కారణం అవుతున్నది. మతమే కొన్ని కొన్నిటికి గీటురాయి అవుతోంది. ఇవాల్టికి ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుంది అంటూ ఉంటాం కానీ.. కులం, మతం అనేవి లేకుంటే భారత్ ఇంకా ఎక్కువ ఎదిగేది. ఇలాంటి కులం కార్డు, మతం కార్డుతో ఈ దేశంలోని పలు రాష్ట్రాల్లో చాలామంది అధికారంలోకి వచ్చారు. ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అవకాశం వస్తే ఈ దేశంలో రాజకీయాలను శాసించేంత ఎత్తుకు ఎదిగారు. అలాంటి వారిలో జెడిఎస్ వ్యవస్థాపకుడు దేవగౌడ ఒకరు. కర్ణాటక ముఖ్యమంత్రిగా, భారత మాజీ ప్రధానిగా ఈయన దేశ, కన్నడ రాజకీయాల్లో సుపరిచితులు. అలాంటి ఈ వ్యక్తి కేవలం ఒక్క కులాన్ని నమ్ముకుని గత మూడు దశాబ్దాలుగా కన్నడ రాజకీయాలను శాసిస్తున్నారు.. కేవలం దక్షిణ కర్ణాటకలో మాత్రమే బలంగా ఉండే జేడీఎస్ అక్కడ 30 సీట్లలోపే సాధిస్తుంది. కానీ రాష్ట్రాన్ని ఏలేలా కింగ్ మేకర్ గా మారి చక్రం తిప్పుతుంది. పోయిన ఎన్నికల్లో ఇలానే కాంగ్రెస్, బీజేపీకి మెజార్టీ రాకుంటే కుమారస్వామి కింగ్ మేకర్ గా కాంగ్రెస్ సపోర్టుతో ఏకంగా సీఎం అయిపోయారు. ఈసారి కూడా హంగ్ అంచనాలతో మరోసారి కుమారస్వామి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈయన సపోర్టుతోనే ఎవరైనా సీఎం కుర్చీలో కూర్చొనే పరిస్థితి ఉంది. కొన్ని దశాబ్ధాల రాజకీయ చాతుర్యం ఉన్న దేవె గౌడ.. ఆయన కుటుంబం ఇప్పటికీ కన్నడ రాజకీయాలను శాసిస్తూనే ఉన్నారు.
కులం అండగా ఉంటున్నది..
దేవ గౌడ కర్ణాటక రాష్ట్రంలో రాజకీయంగా కొనసాగేందుకు సామాజిక వర్గానికి చెందిన వొక్క లిగలు అండగా ఉంటూ వస్తున్నారు. 1994లో దేవ గౌడ కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో వొక్క లిగ సామాజిక వర్గానికి చెందిన వారు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. ఇక అప్పట్లో ఆ రాష్ట్రానికి కెపిసిసి అధ్యక్షుడిగా శివకుమార్ ఎంపికయ్యారంటే అందుకు కారణం కూడా దేవ గౌడ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అప్పట్లో జిడిఎస్ అధికారంలోకి రావడానికి వొక్క లిగలు కీలక పాత్ర పోషించారు. అయితే ఆ పార్టీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి అనివార్యమైంది. దీంతో దేవెగౌడ వొక్క లిగ సామాజిక వర్గానికి చెందిన శివకుమార్ ను కాంగ్రెస్ పార్టీ కెపిసిసి అధ్యక్షుడిని చేసింది. అయినప్పటికీ వొక్క లిగలు దేవె గౌడ పార్టీకే మద్దతు తెలుపుతున్నారు.
చరిత్రలో లిఖించదగిన రోజు
1996 జూన్ 1.. బహుశా ఈ దినాన్ని ఏ వొక్క లిగ కూడా మర్చిపోడు. ఎందుకంటే అప్పటిదాకా కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న దేవే గౌడ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరోజు దేశం యావత్ వొక్క లిగలు సంబరాలు జరుపుకున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు దేశ ప్రధానమంత్రి కావడం పట్ల వొక్క లిగలు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆయన ప్రభుత్వం కూలిపోయినప్పుడు కూడా అదే స్థాయిలో విచారం వ్యక్తం చేశారు. ఇక స్వాతంత్రానంతరం కర్ణాటక రాజకీయాలలో లింగాయత్, వొక్క లిగలు ఆధిపత్యం చెలాస్తున్నారు. వాస్తవానికి వొక్క లిగ అంటే కన్నడలో రైతు అని అర్థం. వీరంతా కూడా పాత మైసూర్ ప్రాంతానికి చెందినవారు. కర్ణాటక రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో వీరి జనాభా అధికంగా ఉంది. రాష్ట్ర రాజకీయాలను శాసించే సత్తా వీరికి ఉంది. రాష్ట్రంలో లింగాయత్ సామాజిక వర్గంతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో వీరు ఉన్నారు.
వొక్క లిగ ల్లో ముఖ్య నాయకుడు కెంపెగౌడ. కర్ణాటక రాష్ట్రంలోని విమానాశ్రయం ఈయన పేరు మీద ఉంది. బ్రిటిష్ వారి పాలనలో వొక్క లిగలు విస్తారంగా వ్యవసాయం చేసేవారు. దీంతో వారిపై అసలైన రైతులు అనే ముద్ర పడింది. స్వాతంత్ర అనంతరం కర్ణాటక రాష్ట్రంలో సామాజిక, రాజకీయ మార్పుల్లో వొక్క లిగలు కీలక పాత్ర పోషించారు. ఈ సామాజిక వర్గంలో అక్షరాస్యత ఎక్కువ. కర్ణాటక రాజకీయాల్లో భాగస్వామి కూడా ఎక్కువే. ఉత్తర కర్ణాటక, పాత మైసూర్ ప్రాంతంలో లింగాయత్ సామాజిక వర్గానిదే పై చేయిగా ఉండేది.
వొక్క లిగలు ఆ సంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశారు. ఏకంగా ఆధిపత్యం ప్రదర్శించే స్థాయికి వచ్చారు. ఇక ప్రస్తుత కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రధాన రాజకీయ పార్టీలు వొక్క లిగలను దృష్టిలో పెట్టుకొని పథకాలు రూపొందించాయంటే అతిశయోక్తి కాక మానదు. అయితే జెడిఎస్ కు అనుకూలంగా ఉంటూ వస్తున్న వీరు.. పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడం మాత్రం విఫలమవుతున్నారు. ఈసారి కూడా ఎగ్జిట్ పోల్ సర్వే కాంగ్రెస్ వైపు ముగ్గు చూపుతున్న నేపథ్యంలో వొక్క లిగలు హస్తం పార్టీకే మద్దతు తెలిపారున్న ప్రచారం జరుగుతున్నది. పూర్తి ఫలితాలు వస్తే తప్ప ఇందులో వాస్తవం ఎంతో తెలుస్తుంది . ఏదేమైనప్పటికీ గత మూడు దశాబ్దాలుగా దేవ గౌడ కుటుంబం వొక్క లిగలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందంటే మామూలు విషయం కాదు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Jds is ruling karnataka politics with caste
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com