Republic Day 2024: మొన్నటిదాకా ఆర్టికల్ 370 కొనసాగినప్పుడు జమ్మూ కాశ్మీర్ మనదేశంలో ఉన్నప్పటికీ.. మన దేశ రాజ్యాంగం వర్తించేది కాదు. చివరికి స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాలప్పుడు కూడా మన దేశ జెండా ఎగిరేది కాదు.. అక్కడి నుంచి మన దేశానికి పన్నులు కూడా సరిగ్గా వచ్చేవి కావు. పాకిస్తాన్ తో వైరం వల్ల ఆ ప్రాంతంలో భద్రత కోసం భారీగా నిధులు వెచ్చించాల్సి వచ్చేది. రక్షణ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జరిపే కేటాయింపుల్లో సింహభాగం నిధులు అక్కడే ఖర్చు చేసేవారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ ప్రాంతంలోనూ మన రాజ్యాంగం అమలు కావడం మొదలైంది. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలప్పుడు మన దేశ జెండా ఎగరడం ప్రారంభమైంది.. మొన్నటిదాకా జమ్ము కాశ్మీర్లో భారత రాజ్యాంగం అమలయ్యేది కాదు కదా అని చెప్పుకున్నాం కదా.. ఆర్టికల్ 370 తర్వాత జమ్ము కాశ్మీర్లో పరిస్థితి మారిపోతే.. సరిగ్గా ఒక ప్రాంతం గురించి చర్చ మొదలైంది.
వాస్తవానికి ప్రతి ఏడాది జనవరి 26న మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని గణ తంత్ర దినోత్సవం నిర్వహించుకుంటాం. జాతీయ జెండాను ఎగరవేసి రాజ్యాంగ నిర్మాతల గొప్పతనాన్ని స్మరించుకుంటాం. మన దేశం ఒక ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక దేశంగా మన గలగాలి అంటే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని ప్రతిజ్ఞ చేస్తాం. అయితే ఇలాంటి రాజ్యాంగం వర్తించని ఒక ప్రాంతం మనదేశంలో ఉంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. ఈ గ్రామానికి సొంత రాజ్యాంగం ఉంది. సొంత న్యాయ వ్యవస్థ, శాసనసభ కార్యనిర్వాహక వ్యవస్థలు, సొంత పార్లమెంట్ ఉందంటే అతిశయోక్తి కాక మానదు. ఈ ప్రాంతంలో ఉన్న సొంత పార్లమెంట్లో ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులు ఉంటారు. అయితే ఈ గ్రామం ఎక్కడో దేశ సరిహద్దుల్లో లేదు. అలాగని కేంద్రపాలిత ప్రాంతం కింద కూడా రాదు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉంది? ఆ గ్రామంలో ప్రజల జీవనశైలి ఎలా ఉంది? అక్కడ ఎటువంటి నిబంధనలు అమలు అవుతుంటాయి? అక్కడి ప్రజలకున్న ఆంక్షలు ఏమిటి?
భారతదేశంలోనే ఉంటూ, దేశ రాజ్యాంగం వర్తించని ఓ గ్రామం ఉంది. దాని పేరు మలానా. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ గ్రామానికి సొంత రాజ్యాంగం, పార్లమెంట్ ఉంది. ఇక్కడ భారతీయ చట్టాలు వర్తించవు.. గ్రామ ప్రజలు ఎప్పుడో తాతల కాలం నాటి నుంచి వస్తున్న నియమాలను పాటిస్తారు. వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే సొంత శిక్షలు విధించడానికి కూడా వెనుకాడరు. ఈ గ్రామానికి ఉన్న సొంత పార్లమెంటు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ గ్రామం కులు జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉంటుంది. కులు జిల్లా నుంచి 45 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఈ గ్రామానికి చేరుకోవచ్చు. ఇందు కసోల్, మలానా జల విద్యుత్ ప్లాంట్ మీదుగా మణికరణ్ మార్గంలో ఈ గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రామానికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ రవాణా విభాగానికి చెందిన ఒక బస్సు మాత్రమే వెళుతూ ఉంటుంది. అది కులు నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరుతుంది. సాయంత్రం తిరిగి వస్తుంది.
హిమాచల్ ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతంలో ఉండటంతో ఈ గ్రామంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలు ఉన్నాయి. ఇక్కడికి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులు వచ్చినంతమాత్రాన గ్రామంలో ఉండడానికి అవకాశం లేదు. ఇది ఇక్కడ అమలవుతున్న నిబంధనల్లో ఒకటి. బయట వ్యక్తులు గ్రామంలో ఉండకూడదని.. వారు ఉంటే గ్రామానికి అరిష్టమని గతంలో పార్లమెంటులో ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ ప్రాంతాలను సందర్శించేందుకువచ్చే పర్యాటకులు గ్రామం బయట డేరాలు వేసుకొని ఉంటారు. ఇక గ్రామానికి సంబంధించి శాసనాల గోడ ఉంటుంది. దానిని బయట వ్యక్తులు ఎవరూ తాకడానికి అవకాశం ఉండదు. ఈ గోడను తాగితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ గ్రామం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భాగమైనప్పటికీ సొంత న్యాయవ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ గ్రామానికి సొంత పార్లమెంట్ ఉంటుంది. ఇక్కడ రెండు సభలు ఉంటాయి. ఎగువ సభను జ్యోతంగ్. దిగువసభను కనిష్తాంగ్ అని పిలుస్తారు.జ్యోతంగ్ లో 11 మంది సభ్యులు ఉంటారు. . జూనియర్ హౌస్ లో గ్రామం లోని ప్రతి ఇంటి నుంచి ఒక సభ్యుడు ప్రతినిధిగా ఉంటారు. ఇక్కడ పార్లమెంట్ హౌస్ రూపంలో చౌపాల్ ఉంటుంది. వివాదాలు మొత్తం ఇక్కడే పరిష్కరించుకుంటారు.