Vande Bharat Express: చుక్ చుక్ రైలు కాదు.. అచ్చంగా “చిప్” ల మీద నడిచే బండి ఇది

వందే భారత్ ఎక్స్ప్రెస్ లో దాదాపు 15 వేల చిప్ లు అమర్చి ఉన్నాయి. పైగా ఈ రైలు 4 ప్రాథమిక యూనిట్లుగా విభజించి ఉంది. 16 కోచ్ లు కూడా కాన్ఫిగరేషన్ తో కూడి ఉంటాయి.

Written By: Bhaskar, Updated On : May 22, 2023 5:53 pm

Vande Bharat Express

Follow us on

Vande Bharat Express: బ్రిటిష్ వారి కాలంలో పురుడు పోసుకున్న మన రైల్వే వ్యవస్థ.. కార్యక్రమంలో చాలా పెద్దదిగా అవతరించింది. శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్నా కొద్దీ కొత్త కొత్త ప్రయాణ సాధనాలు తెర పైకి వచ్చాయి. అయితే ఇంతటి అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ.. చాలా మందికి రైలుతో ఉండే అనుబంధం వేరు. భారత రైల్వే వ్యవస్థ ప్రారంభంలో గూడ్స్, ప్యాసింజర్ బోగిల రూపంలో ఉండేది. తర్వాత రైలు క్రమక్రమంగా తన రూపాన్ని మార్చుకుంది. పొగ గొట్టాల నుంచి అధునాతన ఎలక్ట్రిక్ వ్యవస్థ వైపు మళ్ళింది. అది మరింత అధునాతన క్రమాన్ని సంతరించుకొని ఇప్పుడు ఏకంగా వందే భారత్ రైలు లాగా రూపాంతరం చెందింది. అయితే ఇప్పటివరకు చాలామంది చాలా రకాలుగా వందే భారత్ రైలు గురించి వివరించారు. కానీ కొన్ని కొన్ని విషయాలు మర్చిపోయారు. మేము గుర్తించిన వందే భారత్ రైలు ప్రత్యేకతలు ఏమిటో మీరూ చదివేయండి.

ప్రాక్టికల్ కంప్యూటర్ ఆన్ వీల్స్

వందే భారత్ రైలును స్మార్ట్ రైలు అని పిలవడం సబబు అనుకుంటా. ఎందుకంటే దీనిని ప్రాక్టికల్ కంప్యూటర్ ఆన్ వీల్స్ అని శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన నిపుణులు అభివర్ణిస్తున్నారు కాబట్టి. ప్రొపల్షన్, బ్రేకింగ్, ఆటోమేటిక్ డోర్ ల వరకూ అన్ని రకాల కార్యకలాపాలను నియంత్రించేందుకు దాదాపు 15 వేల ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లేదా చిప్ లను వందే భారత్ రైలులో అమర్చారంటే మామూలు విషయం కాదు. అంతేకాదు భారత రైల్వే వ్యవస్థకు 170 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంతటి ఈ సుదీర్ఘ చరిత్రను వందే భారత్ రైలు పూర్తిగా మార్చి వేసిందంటే ఆర్థిక యోక్తి కాకమానదు. పైగా ఇది స్వీయచోదక సెమీ హై స్పీడ్ రైలు. సాంకేతికత మీద ఎక్కువ ఆధారపడుతుంది. ఒక రకంగా దీనిని “నేల మీద నడిచే విమానం” అని చెప్పవచ్చు. వందే భారత్ రైల్లో వెహికల్ కంట్రోల్ సిస్టం, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ట్రైన్.. ఎగువన ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి దిగువన ఉన్న మోటార్ వరకు ప్రతి విభాగాన్నీ సాప్ట్ వేర్ నియంత్రిస్తుంది. దీనికోసం వందే భారత్ రైలులో వేలకొద్దీ చిప్ లను ఉపయోగిస్తున్నారు.

16 కోచ్ ల కాన్ఫిగరేషన్

వందే భారత్ ఎక్స్ప్రెస్ లో దాదాపు 15 వేల చిప్ లు అమర్చి ఉన్నాయి. పైగా ఈ రైలు 4 ప్రాథమిక యూనిట్లుగా విభజించి ఉంది. 16 కోచ్ లు కూడా కాన్ఫిగరేషన్ తో కూడి ఉంటాయి. పైగా ప్రతి యూనిట్ లో రెండు మోటర్రైజ్డ్ కార్లు, రెండు ట్రైలర్ కార్లు ఉంటాయి. సాధారణ రైలు లోకోమోటివ్ ఇతర ట్రైలింగ్ కోచ్ లను లాగుతుంది. వందే భారత రైలు మాత్రం పూర్తి విభిన్నం. ఇది ట్రాక్షన్ కన్వర్టర్లు, ఆక్సిలరీ కన్వర్టర్, వెహికల్ కంట్రోల్ యూనిట్ వంటి విభిన్నమైన ఎలక్ట్రానిక్ భాగాలను కలిగి ఉంటుంది. 2000 ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల ద్వారా ఈ వ్యవస్థను మొత్తం నడిపిస్తుంది. మిగిలిన కోచ్ లలో ఎల్ఈడీ లు, ఎయిర్ కండిషనర్లతో పాటు పెద్దగా ఎలక్ట్రికల్ కాంపోనెంట్ లేకుండానే ఆ స్థాయి సౌకర్యాలు వందే భారత్ రైలులో రైల్వే శాఖ కల్పించింది.

ప్రమాదాలకు ఆస్కారం ఉండకుండా

పూర్తి ఎలక్ట్రానిక్ వ్యవస్థ మీద ఆధారపడేలా వందే భారత్ రైలు రూపొందించడం వెనుక అసలు కారణం వేరే ఉంది. సంప్రదాయ రైళ్లల్లో ప్రమాదాలు జరిగితే నష్టం తీవ్రత అధికంగా ఉంటుంది. అయితే వాటికి చరమగీతం పాడేందుకు రైల్వే శాఖ ఈ అధునాతన వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చింది. పైగా సంప్రదాయ రైల్వేలలో వాటి నిర్వహణ వ్యయం రైల్వే శాఖకు తడిసి మోపెడవుతుంది. ఈ ఎలక్ట్రానిక్ రైలు వల్ల పెద్దగా నిర్వహణ ఖర్చు ఉండదని రైల్వే శాఖ చెబుతోంది. దీనికి తోడు ప్రయాణికులకు వేగవంతమైన సర్వీస్ అందించేందుకు ఇంతకంటే మెరుగైన మార్గం లేదని చెప్తోంది. ప్రస్తుతం వందే భారత్ రైలు నడిచేందుకు అనుగుణంగా రైల్వే పట్టాల వ్యవస్థ మారింది. అయితే భవిష్యత్తులో రైల్వే శాఖ బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెడుతుందని, ఇందులో భాగంగానే వందే భారత్ రైలును తెరపైకి తీసుకు వచ్చిందని రైల్వే శాఖ మాజీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.