Ayodhya Temple: ‘వినుడి వినుడి రామాయణ గాధా.. వినుడీ మనసారా.. ఆలపించినా.. ఆలకించినా ఆనందమొలికించే గాధా..’అని రామాయణం గురించి ఎంతో గొప్పగా వర్ణించాడు ఓ సినీ కవి. రామయణం అంత గొప్పగా.. శ్రీరాముని పట్టాభిషేకం అంత వైభవంగా అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 22న రాంలల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈమేరకు అతిథులకు ఆహ్వానం పంపుతోంది తీర్థక్షేత్ర ట్రస్టు. వేడుకలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో రామాలయం విశేషాలపై అందరికీ ఆసక్తి నెలకొంది.
ప్రత్యేకతలివే..
అయోధ్య రామాలయాన్ని 2,500 ఏళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించారు. ఒక్క ఇనుప ముక్క కూడా వాడకుండా ప్రత్యేకంగా శిలలతో అందంగా నిర్మించారు. ప్రపంచలో మూడో అతిపెద్ద హిందూ ఆలయం. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తురూపం.. ఇవన్నీ అయోధ్యలోని భవ్వ రామమందిర వైభవాన్ని చాటిచెప్పే విశిష్టతలు. వీటి కారణంగా ఈ ఆలయ నిర్మాణం, విశేషాలు ప్రతి ఒక్కరిలో ఆసక్తి రేపుతున్నాయి. ప్రపంచంలోని అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా చెప్పుకుంటున్న జగదానంద కారకుడి మందిర విశేషాలు తనివితీరా చూడాల్సిందే. నయనానందం పొందాల్సిందే. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయ విశేషాలు, ప్రత్యేకతలు మీకోసం..
కాలి అడుగులతో కొలిచి డిజైన్..
ప్రస్తుత రామమందిరం డిజైన్ 1989లోనే రూపుదిద్దుకుంది. దేవాలయాల ఆకృతులను రూపొందించడలో నిష్ణాతులైన సోంపుర కుటుంబీకులు ఈ డిజైన్ అందించారు. అప్పటి వీహెచ్‌పీ అధిపతి అశోక్ సింఘాల్ విజ్ఞప్తి మేరకు, ఆయన అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. కానీ, నాడు అక్కడి కట్టుదిట్టమైన భద్రత కారణంగా అది కుదరలేదు. దీంతో ఆయన భక్తుడి వేషధారణలో లోపలికి వెళ్లి కాలి అడుగులతో ప్రాంగణాన్ని కొలిచారు. అనంతరం డిజైన్ రూపొందించారు.
2,500 ఏళ్లు చెక్కు చెదరకుండా..
అయోధ్య రామమందిరం ప్రధాన ఆలయాన్ని ఎల్‌అండ్‌టీ కంపెనీ నిర్మిస్తోంది. ఉప ఆలయాలు, ఇతరత్రా పనులను టాటా కన్సల్టెన్సీ ఇంజినీర్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది. అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది. రిక్టర్ స్కేల్‌పై 10 తీవ్రతతో భూకంపాలు వచ్చినా, మరే విధమైన ప్రకృతి విపత్తులు సంభవించినా.. 2,500 ఏళ్లు ఆలయం చెక్కు చెదరకుండా ఉండేలా డిజైన్ చేసినట్లు ఆర్కిటెక్ ఆశీశ్ సోంపురా తెలిపారు.
నక్షత్ర వాటిక..
ఆయోధ్య రామాలయం ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచికగా 27 మొక్కలను గతంలో నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చుని ధాన్యం చేసుకోవడం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు.
115 దేశాల నుంచి నీళ్లు.. మట్టి
ఆయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని 114 దేశాల నదులు, సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని, 2,587 ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మట్టిని ఉపయోగించారు. వసుధైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింభించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తీర్థక్షేత్ర ట్రస్టు తెలిపింది.
రామయ్యకు దర్జీలు..
అయోధ్యలో ఓ చిన్న టైలర్ దుకాణం(బాబూలాల్ టైలర్స్) నడుపుతున్న సోదరులు భగవత్ ప్రసాద్ పహాడీ, శంకర్‌లాల్ శ్రీవాస్తవ రామయ్యకు లావణ్య వస్త్రాలు తయారు చేస్తున్నారు. 3 దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్‌దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్ ప్రసాద్ తండ్రి బాబూలాల్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు సమకూరుస్తు¯ంది.
రామనవమి రోజు సూర్యకిరణాలు పడేలా..
ఒడిశాలోని కోణార్క్ సూర్యదేవాలయం గర్భగుడిలో మూలవిరాట్‌పై సూర్యకిరణాలు పడినట్లుగా అయోధ్య రామ మందిరంలోని బాల రాముడి విగ్రహంపై శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు.

బాల రాముడు ఎలా ఉంటాడంటే..
అయోధ్య రామాలయం గర్భగుడిలో ప్రతిష్టించే బాల రాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఐదేళ్ల బాలుడి రూపంలో ఉండన్ను రామయ్య విల్లంబులు ధరించి కమలంపై కూర్చుని ఉంటాడని తెలుస్తోంది. ఈ విగ్రహాలను ముగ్గురు శిల్పులు వేర్వేరుగా రూపొందించారు. చివరకు ఇందులో నుంచి ఓ విగ్రహాన్ని ట్రస్ట్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసింది.
మూడో అతిపెద్ద ఆలయం..
అయోధ్య రామ మందిరం ప్రపంచంలో మూడో అతి పెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం అంగ్‌కోర్‌వాట్‌లోని దేవాలయ సముదాయమే ప్రపంచంలో అతిపెద్ద హిందూ ఆలయంగా గుర్తింపు ఉంది. రెండో స్థానంలో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథస్వామి ఆలయం ఉంది. మూడో ఆలయంగా అయోధ్య రామాలయానికి గుర్తింపు దక్కనుంది.
ఇనుము వినియోగించకుండా..
ఇక అయోధ్య ఆలయ నిర్మాణంలో మరో ప్రత్యేకత ఇనుము వాడకపోవడం. మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు.. ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీల్, సిమెంట్, కాంక్రీటు వాడలేదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు. ఆలయానికి సమీపంలోని కరసేవక్‌పురంలో 30 ఏళ్ల కిందనే రాతిని చెక్కే పనులు ప్రారంభించారు. అదే విధంగా 30 ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన 2 లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వినియోగించారు.
రామయ్యకు హైదరాబాద్ తలుపులు
అయోధ్య రామమందిరం ప్రధానాలయం తలుపులతోపాటు ఇతర తలుపులను తయారు చసే బాధ్యతను సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకున్నారు. యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను ఈ కంపెనీ ఎంతో నాణ్యతతో తయారు చేసింది.
రామయ్య పాదుకలు కూడా..
అయోధ్య రాముడి పాదుకలు కూడా హైదరాబాద్‌లోనే తయారు చేశారు. ఓల్డ్ బోయిన్‌పల్లిలోని హష్మత్‌ఏటకు చెందిన లోహశిల్పి పిట్టంపల్లి రామలింగాచారి శ్రీమద్విరాట్ కళాకుటీర్ సంస్థ శ్రీరాముని పాదుకలను తయారు చేసింది. 12.5 ఇంటుల పొడవు. 5.5 ఇంచుల వెడల్పు. ఒక ఇంచు మందంతో వీటిని తయారు చేశారు. ఈ పాదుకల తయారీకి బంగారం, వెండి, రాగి, సత్తు, తగరం వాడారు. 12.6 కిలోల పంచలోహాలను తయారీకి వినియోగించారు. 25 రోజులు శ్రమించి ఈ పాదుకలను రూపొందించారు. పాదాలపై శంకు, చక్రాలు, ఏనుగు, గోమాత, జెండా, ఓం, స్వస్తిక్, సూర్యచంద్రులు, రెండు కల్ప వృక్షాలు, కత్తి, అంకుశం, చేప, కలశం, రెండు పద్మాలు చెక్కారు. రెండు ఆకుపచ్చని రాళ్లను పాదుకలపై అమర్చారు.
అంకెల్లో అయోధ్య రామ మందిరం వివరాలు..
శంకుస్థాపన: 5.08.2020
ప్రాణ ప్రతిష్ఠ: 22.01.2024
మందిరం నిర్మాణం సంపూర్ణమయ్యేది (అంచనా) : 2026
ప్రధాన ఆలయం విస్తీర్ణం : 2.77 ఎకరాలు
నిర్మాణ విస్తీర్ణం : 57,400 చదరపు అడుగులు
ఆలయం పొడవు : 360 అడుగులు
ఆలయం వెడల్పు : 235 అడుగులు
ఆలయ శిఖరం ఎత్తు : 161 అడుగులు
ప్రవేశ ద్వారాలు : 12
గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఎత్తు : 51 అంగుళాలు
భక్తులకు దర్శనం ఇచ్చే దూరం : 35 అడుగులు
రామమందిరం కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం : 110 ఎకరాలు
ఏకకాలంలో కాంప్లెక్స్‌లో ఎంతమంది ఉండొచ్చు : 10 లక్షల మంది వరకు
రామ మందిరానికి అయిన ఖర్చు : 400 కోట్లు
కాంప్లెక్స్ నిర్మాణానికి అయ్యే ఖర్చు అంచనా : 1,800 కోట్లు
జూన్, 2022 నాటికి ట్రస్ట్‌కు వచ్చిన విరాళాలు : 3,400 కోట్లు.