NEET Counselling: నీట్ పరీక్ష ముగిసింది. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. నీట్ కు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న తమిళనాడు రాష్ట్రంలో.. ఆ ప్రాంతానికి చెందిన పదిమంది విద్యార్థులు టాప్ టెన్ ర్యాంకులు సాధించారు. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ నీట్ కు సంబంధించి కౌన్సిలింగ్ విషయంలో అటు బిజెపి, ఇటు బీజేపీయేతర రాష్ట్రాలు ఫైట్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదట్లో ఇంజనీరింగ్ తో పాటుగా మెడికల్ కాలేజీలో ప్రవేశాలకు ఎంసెట్ నిర్వహించేవారు..నీట్ వచ్చిన తర్వాత వైద్య విద్యలో ప్రవేశాలకు కేంద్రం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్ కు ఆయా రాష్ట్రాల ఆధ్వర్యంలో ఎంసెట్ జరుగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈనెల రెండు నా జాతీయ వైద్య కమిషన్ సూచనల మేరకు నీట్ కు కామన్ కౌన్సిలింగ్ ను తెరపైకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించి గెజిట్ కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల విడుదలకూ సన్నద్ధమవుతోంది. ఇక ఈ కౌన్సిలింగ్ కు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో నీట్ తలో అర్హత సాధించిన వారికి ఎవరు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అనే దానిపైన మీమాంస నెలకొంది.
ఇప్పుడే ఎందుకు తెచ్చారు?
నీట్ ర్యాంకుల ఆధారంగా వైద్య కళాశాలలో సీట్ల భర్తీకి ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వైద్య విశ్వవిద్యాలయాలు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో వరంగల్ కేంద్రంగా ఉన్న కాలోజీ వైద్య విశ్వ విద్యాలయం, ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ ప్రక్రియ చేపడుతున్నాయి. అయితే ఈ ప్రక్రియ కంటే ముందే కేంద్రం ఆల్ ఇండియా కోటా కింద 15 సీట్లను ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా చేస్తోంది. మిగిలిన 85 సీట్లను రాష్ట్రాలు భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియలో ప్రైవేటు వైద్య కాలేజీలు మోసాలు చేస్తున్నాయని, అడ్డగోలుగా సీట్లను అమ్ముకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నాయని, దీనిని అడ్డుకునేందుకు దేశం మొత్తం ఒకే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇందులో భాగంగానే ఈనెల 2న విడుదల చేసిన గెజిట్ కు సంబంధించి కామన్ కౌన్సిలింగ్ గురించి ప్రస్తావించింది.
వ్యతిరేకిస్తున్నాయి
కేంద్రం తీసుకొచ్చిన ఈ గెజిట్ ను బీజేపీయేతర రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం నిర్ణయం రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉందని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అవసరమైతే నీట్ ను తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేస్తోంది. అయితే దీనిపై స్పందించిన కేంద్రం తమిళనాడు ప్రాంతాన్ని కామన్ కౌన్సిలింగ్ నుంచి మినహాయిస్తామని హామీ ఇచ్చింది. ఇక మిగతా రాష్ట్రాలు కూడా తమకు కూడా అలాంటి అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నాయి. అయితే కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఈసారి కామన్ కౌన్సిలింగ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రిజర్వేషన్లు ఏమవుతాయి?
కేంద్రం దేశం మొత్తం ఒకే కామన్ కౌన్సిలింగ్ రోహిస్తే రాష్ట్రాల స్థాయిలో రిజర్వేషన్ పై ఆ ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. తమ ప్రాంతానికి చెందిన విద్యార్థుల రిజర్వేషన్లకు ఇబ్బంది కలుగుతుందనే అభ్యంతరం తోనే తమిళనాడు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించింది. వేరువేరు రాష్ట్రాల్లో భిన్నంగా ఉన్న రిజర్వేషన్లతో కేంద్రం కౌన్సిలింగ్ నిర్వహించడం దాదాపు అసాధ్యమని అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఉండగా, గత ఏడాది తొలగించింది. తెలంగాణలో మాత్రం వారికి నాలుగు శాతం రిజర్వేషన్ కొనసాగుతోంది. ఒకవేళ కేంద్రం కౌన్సిలింగ్ నిర్వహిస్తే తెలంగాణలోని ముస్లిం రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కర్ణాటకలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వీరు ఓసి కేటగిరి కిందికి వస్తారు.. అలాంటప్పుడు కామన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తే గందరగోళం ఏర్పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య విశ్వవిద్యాలయాల అధికారులు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్, రిజర్వేషన్ల మీద ఉన్న అనుమానాలు నివృతి కావాలని కోరుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇదీ పరిస్థితి
తెలంగాణ విషయానికి వస్తే ఈసారి వైద్య కళాశాలలో, యూజీలో వైద్య విద్య సీట్ల సంఖ్య మరింత పెరిగింది. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 13 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 9 ప్రభుత్వ, నాలుగు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. కరీంనగర్, ఖమ్మం, జనగాం, ఆసిఫాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సిరిసిల్ల, నిర్మల్, భూపాల పల్లి జిల్లాల్లో ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వ వైద్య కాలేజీలు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి వస్తాయి. దేశవ్యాప్తంగా 72 వైద్య కాలేజీల్లో 1, 07, 658 మెడికల్ సీట్లు అందుబాటులో ఉండగా.. తెలంగాణలో 8,340 సీట్లు ఉన్నాయి. గత ఏడాది నీట్ పరీక్షలో జాప్యం ఏర్పడిన నేపథ్యంలో.. కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. ఈసారి మాత్రం అది ఎట్టి పరిస్థితిలో ఆగస్టు 31 లోగా పూర్తి కావాలని కేంద్రం ఆదేశించింది. తర్వాత కౌన్సిలింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం కామన్ కౌన్సిలింగ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. మిగతా రాష్ట్రాలు సమ్మతి తెలుపుతాయా? లేక తమిళనాడు రాష్ట్రం మాదిరిగానే నిరసన వ్యక్తం చేస్తాయా? వీటి నివారణకు కేంద్రం ఏం చేస్తుంది అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.