Oppotion Parties Meet : కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అంతర్థానమైంది. దాని స్థానంలో ‘ఇండియా’ పురుడుబోసుకుంది. బెంగళూరులో గత రెండురోజులుగా సమావేశమైన బీజేపీయేతర విపక్షాలు తమ కూటమికి భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (ఇండియా)గా పేరును ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్.. యూపీఏ కనుమరుగైనట్టే. 2004లో అప్పటి వాజ్ పేయ్ సర్కారును గద్దె దించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న కూటమి ఇది. ఎన్డీఏ హవాకు బ్రేక్ చేస్తూ పురుడుబోసుకున్న ఈ కూటమి 2004 నుంచి 2014 వరకూ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. అయితే 2014 లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావడంతో పతనం అంచున నిలబడింది.
యూపీఏ కు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ బలహీనం కావడంతో ఉనికిని కోల్పోయింది. గత పదేళ్లలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఒక్కో రాష్ట్రంలో అధికారానికి దూరమవుతూ వచ్చింది. సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన పార్టీ.. ప్రాంతీయ పార్టీలకు ఉప పార్టీగా మిగిలిపోయింది. దీంతో విపక్ష కూటమికి కాంగ్రెస్ నాయకత్వంపై భిన్న స్వరాలు వినిపించాయి. కానీ కర్నాటక ఎన్నికల్లో అనూహ్య విజయంతో కాంగ్రెస్ లేని విపక్ష కూటమి సాధ్యం కాదని సంకేతాలు వచ్చాయి. అందుకే విపక్ష కూటమిలో కాంగ్రెస్ క్రియాశీలక పాత్ర అప్పగించాల్సిన అనివార్య పరిస్థితి. అయితే బలీయమైన ఎన్డీఏను ఢీకొట్టాలంటే కూటమి పేరు మార్పు తప్పదు అని విపక్షాలు భావించాయి. అందుకే ఏకాభిప్రాయంతో తమ కూటమికి భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (ఇండియా)గా పేరును ఆమోదించాయి.
కూటమికి ఫ్రంట్ అన్న పేరు ఉండకూదన్నదే మెజార్టీ నేతల అభిప్రాయం. అయితే తొలుత ఈ పేరును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపాదించినట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. తొలిరోజు కీలక అంశాలపై చర్చించిన విపక్ష కూటమి.. రెండో రోజు కనీస ఉమ్మడి కార్యాచరణపై చర్చించింది. కూటమిలోని పక్షాలు ఇచ్చుపుచ్చుకునే సాయం, సమాచారంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. విస్తృత చర్చల అనంతరం కూటమి పేరును ఖరారు చేశారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం తెలపడం విశేషం.
రెండో రోజు సమావేశానికి కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పశ్చిమబెంగాల్, బిహార్, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు మమతాబెనర్జి, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, స్టాలిన్, హేమంత్ సొరెన్, మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, మెహబూబా ముఫ్తీ, ఫరుక్ అబ్దుల్లాతో పాటు వామపక్షాల అగ్రనాయకులు సీతారాం ఏచూరి, డి.రాజా తదితరులు హాజరయ్యారు. నేతలంతా ఐక్యతా రాగం ప్రకటించడం విశేషం. ఎన్నికల ముందు 20 లక్షల మందితో భారీ కవాతు నిర్వహించి ప్రధాని మోదీకి భయం పుట్టించాలని డిసైడయ్యారు. అయితే అది ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.