KTR Delhi Tour : ఎదురుచూపులో ఎంత బాధ ఉంటుందో.. కేటీఆర్ కు ఇప్పుడర్థమైంది అనుకుంటా? 

ఈ అపాయింట్మెంట్ రద్దు కేటీఆర్ లో ఉన్న అసలు స్వభావాన్ని నేలకు దించిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఒకటేనని, జనం దృష్టి మరల్చేందుకే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Written By: K.R, Updated On : June 25, 2023 7:24 pm
Follow us on

KTR Delhi Tour : కేటీఆర్ గత మూడు రోజులు ఢిల్లీలో పర్యటించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం అంటూ పైకి చెప్పి ప్రత్యేక విమానంలో హస్తిన వెళ్లారు. సాధారణంగా ఏదైనా పర్యటనకు వెళ్తే కేటీఆర్ వెంట ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ఉంటారు. కానీ ఈసారి ఆయన వెంట ఎవరూ లేరు.. తెలంగాణ ప్రయోజనాలు అని చెప్పి కొంతమంది అధికారులను ఇక్కడ నుంచి తీసుకెళ్లారు.. కేంద్ర మంత్రులను కలిశారు. తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించి తెలంగాణకు కేంద్రం ఏమీ చేయడం లేదని విమర్శలు చేశారు. కేటీఆర్ సహజగుణం ఇలాంటిదే అయినప్పటికీ.. దాన్ని ఢిల్లీలో కూడా మరొకసారి ప్రూఫ్ చేసుకున్నారు.
అర్థమైంది అనుకుంటా
ఇక కేంద్ర మంత్రుల తో భేటీ అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో శనివారం రాత్రి 10 గంటలకు తనకు అపాయింట్మెంట్ ఓకే అయ్యిందని కేటీఆర్ మీడియా సమావేశంలో చెప్పారు. కానీ చివరి నిమిషంలో అది రద్దయింది. ఆ సమయంలో తెలంగాణ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ వంటి వారితో అమిత్ షా భేటీ నిర్వహించారు. తెలంగాణ రాజకీయాల సంబంధించి సుదీర్ఘమైన కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ అపాయింట్మెంట్ అమిత్ రద్దు చేశారు. ఇదే విషయాన్ని కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడికి అమిత్ షా క్యాంప్ వర్గాలు తెలియజేశాయి. దీనిని చిలువలు వలువలుగా నమస్తే తెలంగాణ రాసుకు వచ్చింది. ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిందని పెడబొబ్బలు పెట్టింది. కానీ ఇదే సమయంలో కేటీఆర్ ప్రతిపక్షాలకు ఎలాంటి గౌరవం ఇస్తారో దాటవేసింది. తెలంగాణ వాదాన్ని నాలుగు దశాబ్దాల క్రితమే సినిమా రూపంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చూపించిన నర్సింగరావు అనే దర్శకుడు అపాయింట్మెంట్ కోరితే కేటీఆర్ ఎలా వ్యవహరించారో తెలంగాణ సమాజానికి తెలియనిది కాదు. సాక్షాత్తు నర్సింగరావు ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బయటకు వెల్లడించారు.. ఇక తాజాగా అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు చేయడంతో ఆ సంఘటనను దీనితో బేరీజు వేసుకొని తెలంగాణ సమాజం చూస్తోంది.
ఇక కేటీఆర్ కేవలం సెలబ్రిటీలకు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తారని అపవాదు ఉంది. ఆయన సామాన్య ప్రజలను కలవరని,  కలిసేందుకు ఏమాత్రం ఇష్టపడరని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతూ ఉంటుంది. సమాజంలో ఒక హోదా ఉన్నవారు, లేదా ఏదైనా పోటీల్లో తెలంగాణకు పతకాలు సాధించిన వారికి మాత్రమే కేటీఆర్ క్యాంపు నుంచి ఫోన్లు వెళ్తాయని.. వారిని మాత్రమే ఆయన కలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు చేయడంతో కేటీఆర్ చిన్నబుచ్చుకున్నారని.. ఆ అపరాధ భావంతోనే తిరుగు ప్రయాణం అయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.. అపాయింట్మెంట్ ఇచ్చి చివరి నిమిషంలో రద్దు చేయడం వెనుక ఈటల రాజేందర్ మంత్రాంగం నడిపారనే చర్చ కూడా జరుగుతోంది. ఢిల్లీలో అమిత్ షా తో భేటీ అయ్యే ముందు రాజేందర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కేటీఆర్ కు అపాయింట్మెంట్ ఇచ్చి, మమ్మల్ని ఎదురుచూసేలా చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది జాతీయ మీడియాలో ప్రముఖంగా రావడంతో అమిత్ షా క్యాంప్ వర్గాలు అప్రమత్తమయ్యాయని, అందుకే చివరి నిమిషంలో కేటీఆర్ కు అపాయింట్మెంట్ రద్దు చేశాయని తెలుస్తోంది. మరోవైపు ఈ అపాయింట్మెంట్ రద్దు కేటీఆర్ లో ఉన్న అసలు స్వభావాన్ని నేలకు దించిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఒకటేనని, జనం దృష్టి మరల్చేందుకే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు చేయడం అటు తెలంగాణలోనే కాదు ఇటు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.