Election Votes Counting: ఒకప్పుడు బ్యాలెట్ విధానంలో మనదేశంలో ఎన్నికలు జరిగేవి. బ్యాలెట్ విధానంలో జరిగే ఎన్నికల వల్ల అనేక అవకతవకలు చోటు చేసుకునేవి. కొన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ బూత్ లలో అసాంఘిక శక్తులు బ్యాలెట్ బాక్స్ లలో సిరా పోసేవి. ఈ విధానానికి స్వస్తి పలుకుతూ ఎన్నికల సంఘం ఈవీఎం విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది.. వివి పేట్ ద్వారా ఎవరికి ఓటు వేసామో తెలుసుకునే అవకాశాన్ని కూడా ఓటర్లకు కల్పించింది. ఇక అప్పటినుంచి ఈవీఎం విధానంలో మనదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఎన్నికలు జరగడం ఒక ఎత్తు అయితే.. పోలైన ఓట్లను లెక్కించడం మరొక ఎత్తు. ఓట్ల లెక్కింపునాడు అభ్యర్థులకు చూపిస్తారు. అభ్యర్థుల ఎదుట ఈవీఎం యంత్రాలను ఓపెన్ చేస్తారు. ఈవీఎం యంత్రాలను తెరిచిన తర్వాత కౌంటింగ్ మొదలు పెడతారు. ఈ కౌంటింగ్ ప్రక్రియను రౌండ్ల వారీగా విభజిస్తారు.. రౌండ్లలో అభ్యర్థులు సాధించిన ఓట్లను నమోదు చేస్తారు. ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.. ఓట్ల లెక్కింపు ప్రక్రియను రౌండ్ల వారీగా పేర్కొంటారు.
ఓట్ల కౌంటింగ్ రోజున రౌండ్ అనే పదం తరచూ వినిపిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు x అనే వ్యక్తి మొదటి రౌండ్ లో ముందంజలో ఉన్నారని వింటూ ఉంటాం. ఒక రౌండ్ అంటే 14 ఈవీఎం ఓట్ల లెక్కింపు. ప్రతి ఈవీఎం ఒక బూత్ ను సూచిస్తూ ఉంటుంది.. కాబట్టి ఒక రౌండ్ 14 బూత్ ఓట్ల లెక్కింపు అని కూడా చెప్పొచ్చు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ఒకేసారి 14 టేబుళ్లను అందుబాటులో ఉంచుతుంది. ఒక్కో టేబుల్ పై ఒక ఈవీఎం ఉంటుంది.
అభ్యర్థుల సమక్షంలోనే ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంటుంది. ఇందులో అభ్యర్థులకు ఏమైనా అనుమానాలు ఉంటే మరోసారి ఓట్ల లెక్కింపు జరుపుకుంటారు. అయితే ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా అభ్యర్థులు సాధించిన ఓట్లను.. రౌండ్లను డిజిటల్ స్క్రీన్ ల మీద డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు అభ్యర్థులకు చెప్పడంతో పాటు.. వారి తరఫున వచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు కూడా వివరిస్తుంటారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎం యంత్రాలను అత్యంత పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల సంఘం అధికారులు భద్రపరుస్తుంటారు. భద్రపరిచిన గదులకు సీల్ కూడా వేస్తుంటారు.