Manipur : మణిపూర్‌ను అమిత్ షా సందర్శించిన తర్వాతే ఆ ఈశాన్య రాష్ట్రం లో హింసా కాండ మరింత తీవ్రతరమైంది. ఆయనకు అనేక బాధ్యతలున్నాయి. దేశంలో శాంతి భద్రతల పరిస్థితిని అరికట్టడం అనేది ఆయనకు అందులో ఒక బాధ్యత మాత్రమే. దేశంలో రాజకీయాలు చేయడం, భారతీయ జనతా పార్టీని వివిధ రాష్ట్రాల్లో గెలిపించడం. ప్రతిపక్ష నేతలను బలహీనపరచడం మొదలైన అనేక బాధ్యతలు ఉన్నాయి. మణిపూర్‌లో హింసాకాండ జరుగుతున్న సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచా రంలో తలమునకలై ఉన్నారు. కర్ణాటకలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత ముఖ్యమో చెబుతూ వీదీ వీది వారు తిరిగారు. ఆ ఎన్నికల ఘట్టం పూర్తయిన తర్వాత కానీ అమిత్ షా మణిపూర్ సందర్శించలేదు.
పెదవి విప్పలేదు
ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ అయితే మణిపూర్ గురించి మొన్నటి వరకూ పెదవి విప్పనేలేదు. కనీసం శాంతియుతంగా ఉండాలని ప్రజలకు పిలుపు కూడా ఇవ్వ లేదు. దమన కాండ, దారుణాలు జరిగినప్పుడు మౌనంగా ఉండడం, అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉపన్యాసాలు చేశారు. తన సొంత రాష్ట్ర గుజరాత్‌తో పా టు తన హయాంలో ఎక్కడ అల్లర్లు జరిగినా ఆయన మాట్లాడలేదు. మహిళా మల్లయోధులు తమపై లైంగిక అత్యాచారాలు జరిగాయని రెండు నెలలుగా ఘోషిస్తున్నా ఆయన స్పందించలేదు. ఇలాంటి ఘటనలపై ఆయన ’మన్ కీ బాత్‘ మనకు వినపడదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పట్లో ఒక ఆదివారం తన ’మన్ కీ బాత్‘ ప్రసంగంలో మణిపూర్ గురించి ప్రస్తావించనందుకు అక్కడి ప్రజలు ఆగ్రహోదగ్రులై రేడియోలను విధ్వంసం చేశారు. ’మణిపూర్ కీ బాత్‘ వినాలని వారు డిమాండ్ చేశారు.
మణిపూర్ తగలబడుతుంటే..
మణిపూర్ తగులబడుతుండగానే ప్రధానమంత్రి తన అమెరికాలో పర్యటించారు. వచ్చే ఏడాది సార్వత్రక ఎన్నికలున్న రీత్యా మోదీకి అమెరికా మద్దతు ఎంతో అవస రంగా ఆయన భావించారు. ఎప్పటి మాదిరే ప్రవాస భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. అమెరికా విదేశాంగ ప్రయోజనాలను కాపాడడంతో పాటు అక్కడి పారిశ్రామికవేత్తలు, సీఈవోలను ఆయన ఎంత సంతృప్తిపరిచారనే వాదనలూ ఉన్నాయి. ఈశాన్య భారత రాష్ట్రాల గురించి సాధారణంగా జాతీయ మీడియాలో చర్చ జరగదు. అక్కడ ప్రజల ఈతి బాధలగురించి ఎవరూ పెద్దగా ప్రస్తావించరు. ఈశాన్యాన్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చామని బీజేపీ చెప్పిన కబుర్లు ఎలాంటివో మణిపూర్ హింసాకాండను బట్టి అర్థం చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా తెలిసింది
మణిపూర్‌లో హింసాకాండ పెచ్చరిల్లిన తర్వాతే ఆ రాష్ట్రం గురించి దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసింది. దేశంలో అన్ని సమస్యలూ మెజారిటీ వాదం ద్వారా పరిష్కారం కావు. మెజారిటీ వర్గాల రాజకీయాన్ని మణిపూర్‌లో అవలంబించాలనుకుంటే భీకర దుష్పరిణామాలు ఉంటాయి. దేశంలో వివిధ వర్గాలను రాజకీయాలకు ఉపయోగించుకున్నట్లే, కుకీలు, మెయిటీలను కూడా రాజకీయాలకు ఉపయోగించుకుని పబ్బం గడుపుకోవాలని బీజేపీ నేతలు ప్రయత్నించినందుకే ఈ సమస్య తీవ్రతరమైందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.