HomeజాతీయంManipur : రెండు తెగల మధ్య కొట్లాట.. చివరికి ఇంత దాకా తీసుకొచ్చింది

Manipur : రెండు తెగల మధ్య కొట్లాట.. చివరికి ఇంత దాకా తీసుకొచ్చింది

Manipur : ఆవులు కొట్లాడుకుంటే దూడల కాళ్లు విరిగినట్టు.. మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరుగుతున్న రిజర్వేషన్ల వివాదం ఏకంగా మతం రంగు పులుముకుంది. అంతే కాదు ఏకంగా విధ్వంసానికి దారి తీసింది. ఇప్పట్లో ఈ మంటలు చల్లారే పరిస్థితి కన్పించడం లేదు. ఇద్దరు కుకీ మహిళలను వివస్త్రలను చేసి ఊరేగింగిచన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తుండగా.. అంతకు మించిన ఘటనలు జరిగాయని అక్కడి గిరిజనులు చెబుతున్నారు. వాస్తవానికి ఆ ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన మే లో జరిగింది. అయితే మణిపూర్‌ ప్రాంతంలో ఇంటర్‌నెట్‌ సేవలను ప్రభుత్వం నిలిపేయడంతో అది వెలుగులోకి రాలేదు. ఇన్నాళ్లకు బయటి ప్రపంచానికి తెలిసిన తర్వాత కలకలం చెలరేగుతోంది.

దాడులు తీవ్రమయ్యాయి

మణిపూర్‌లో గిరిజన తెగ కుకీలు.. మైదాన ప్రాంతానికి చెందిన మైతేయిలకు మధ్య జరుగుతున్న వివాదం చర్చిల విధ్వంసానికి దారి తీస్తోంది. మే 3న ఇరువర్గాల మధ్య దాడులు తీవ్రమయ్యాయి. అప్పటి నుంచి మైతేయిల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోని చర్చిలపై దాడులు కొనసాగుతున్నాయి. అల్లర్ల పేరుతో దుండగులు ఇప్పటి వరకు 289 చర్చిలకు నిప్పు పెట్టారు. క్రిస్టియన్‌ సంఘాలు, మత పెద్దలు ముందు నుంచి చర్చిల విధ్వంసంపై ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కా వ్యూహంతోనే మణిపూర్‌లో చర్చిలపై దాడులు జరుగుతున్నాయని ఇంఫాల్‌ ఆర్చిబిషప్‌ డోమ్నిక్‌ లుమోన్‌ గతనెలలో ఆరోపించారు. ‘‘గడిచిన 36 గంటల్లో(జూన్‌ 19కి ముందు) 249 చర్చిలకు నిప్పుపెట్టారు. చర్చిల ఆస్తులను ధ్వంసం చేశారు. మైతేయిలు పక్కా వ్యూహంతో ఈ ఘాతుకాలకు పాల్పడ్డారు. మైతేయిల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లోని చర్చిలనే ధ్వంసం చేశారు. అల్లర్లను అణచివేయడంలో రాజ్యాంగ వ్యవస్థలు విఫలమయ్యాయి’’ అని ఆయన ఆరోపించారు. అల్లర్లకు చరమగీతం పాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

ఆర్చిబిషప్‌ కార్డినల్‌ నివేదిక

మణిపూర్‌లో చర్చిలపై దాడులకు సంబంధించి బాంబే ఆర్చిబిషప్‌ కార్డినల్‌ ఒస్వాల్డ్‌ గ్రేసియస్‌ ఈ నెల 9న ఓ నివేదికను విడుదల చేశారు. దాని ప్రకారం 357 చర్చిలు, వాటి అనుబంధ ఆస్తులకు నిప్పుపెట్టారు. వాటిల్లో చర్చిల సంఖ్య 289. అటు ఎయిడ్‌ టు చర్చి ఇన్‌ నీడ్‌(ఏసీఎన్‌) కూడా మణిపూర్‌లో పరిస్థితిని సమీక్షిస్తోంది. గత నెలాఖరు వరకు పదుల సంఖ్యలో క్యాథలిక్‌, ప్రొటెస్టంట్‌ చర్చిలపై దాడులు జరిగాయని, వాటిని తగులబెట్టారని పేర్కొంది. 100 మంది దాకా కుకీ(క్రిస్టియన్‌)లు హత్యకు గురైనట్లు వెల్లడించింది. మరోవైపు యునైటెడ్‌ క్రిస్టియన్‌ ఫోరం(యూసీఎఫ్‌) కూడా మణిపూర్‌లో చర్చిలపై దాడులను ఖండిస్తోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో దేశంలో క్రిస్టియన్లు, చర్చిలకు వ్యతిరేకంగా 400 దాకా దాడు లు జరిగినట్లు పేర్కొంది. ఏప్రిల్‌ 13న ఈ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మణిపూర్‌ ఘర్షణలు ప్రారంభమయ్యాక.. తాజా నివేదికలతో ఈ నెల 10న స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌) ఏర్పాటుకు మధ్యంతర ఆదేశాలివ్వాలని ధర్మాసనాన్ని కోరింది.

బీజేపీ అధ్యక్షుడేం అన్నారంటే

చర్చిలపై దాడులను నిరసిస్తూ బీజేపీ మణిపూర్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.వన్రమ్‌చువాంగ ఈ నెల 14న తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం..! ఆయన తన నిర్ణయానికి కారణాలను రాజీనామా లేఖలో ప్రస్తావించారు. ‘‘ఇరువర్గాల మధ్య పోరు కాస్తా మతాల మధ్య పోరుగా మారుతోంది. 357 చర్చిలు, వాటి అనుబంధ ఆస్తులను ధ్వంసం, దహనం చేయడం దారుణం’’ అని ఆ లేఖలో ఆక్రోశం వ్యక్తం చేశారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular