ముస్లింలు జరుపుకునే పండుగల్లో బక్రీద్ ఒకటి. త్యాగాల పండుగగా పేరున్న బక్రీద్ రోజు ఉదయమే నిద్రలేచి ప్రత్యేక ప్రార్థనలు చేసి జంతుబలి ఇవ్వడం ఆచారంగా వస్తోంది. ఇందుకు సిద్ధం చేసిన జంతువులను పెంచడంతోపాటు అన్ని ప్రత్యేకతలే కనిపిస్తాయి. పండుగ ప్రారంభమైన నాటినుంచి మూడు రోజుల్లో ఏదో ఒక జంతువును బలివ్వడం ద్వారా చరిత్రలో దైవ ప్రవక్త హజరత్ ఇబ్రహీం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఇస్లాం క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్ హజ్ 10వ తేదీన బక్రీద్ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దైవ ప్రవక్త హజరత్ ఇబ్రహీం అలైహిస్సలామ్ ఆయన కుమారుడు ఇస్మాయిల్ ను దైవాదేశం ప్రకారం బలిచ్చేందుకు సిద్ధం కావడం, చివరి నిమిషంలోఆయన త్యాగనిరతికి మెచ్చి ఇస్మాయిల్ ను ఆ దైవమే కాపాడడం వంటి అంశాలు బక్రీద్ ను త్యాగాల పండుగగా మార్చేశాయి.
ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలామ్ చూపిన మార్గంలో న్యాయం, ధర్మం కోసం తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా విశ్వాసంతో ఆయన కుమారుడు బలిదానానికి సిద్ధమైన సందర్భం ముస్లింలకు జీవితకాలం పాటు మార్గదర్శనం చేస్తుంది. దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇచ్చే జంతుబలిని ముస్లింలు ఖురాన్ ప్రకారం ఖుర్బానీగా పిలుస్తారు. అన్ని ప్రేమల కన్నా దైవ ప్రేమే గొప్పది కాబట్టి దాని కోసం అన్నింటిని త్యాగం చేయాలనేది ఇస్లాం ధర్మం. అందుకే ప్రవక్త ఇబ్రహీంకు లేక లేక కలిగిన కుమారుడు ఇస్మాయిల్ ను బలి ఇవ్వమని దేవుడు ఆదేశిస్తాడు.
ఇందులో భాగంగా ప్రవక్త ఇబ్రహీం ఒక రోజు తన కుమారుడు ఇస్మాయిల్ ను బలిస్తున్నట్లు కలగంటారు. దీన్నే దైవాదేశంగా భావించి ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్ కు చెబుతారు. అప్పుడు కుమారుడు కూడా స్వచ్ఛందంగా బలిదానానికి సిద్ధమవుతారు. అప్పుడు కుమారుడిని బలిచ్చేందుకు ఇబ్రహీం సిద్దం కాగానే కుమారుడి స్థానంలో గొర్రె ప్రత్యక్షమవుతుంది. అప్పుడు దాన్ని బలిస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బక్రీద్ రోజు ఖుర్బానీ పేరుతో గొర్రెల్ని బలివ్వడం ఆచారంగా వస్తోంది.
కాలాలు మారుతున్నా బక్రీద్ సందర్భంగా ఇచ్చే బలిదానాల్లో కానీ,మాంసం దానంలో కానీ ఏ మాత్రం మార్పు రాలేదు. చరిత్రలో ప్రవక్త హజరత్ ఇబ్రహీం త్యాగనిరతిని గుర్తు చేసుకుని ఇప్పటికి ముస్లింలు పండుగ సందర్భంగా బలిదానాలతో పాటు ఇతర ఆచార, సంప్రదాయాలనుకూడా ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా అదే స్థాయిలో పాటిస్తుంటారు. ప్రవక్త త్యాగనిరతిని గుర్తు చేసుకుంటూ జరుపుకునే ఈ పండుగ కాలాలుమారుతున్నా ఇప్పటికీ ఎప్పటికి ఎలాంటి మార్పులకూ గురికాలేదు. అందుకే త్యాగం నిరంతరమైనదని, దైవాన్ని మెప్పించేదని ముస్లింలు నమ్ముతారు.