
దేశ రాజధాని ఢిల్లీ కాల్పులతో దద్దరిల్లింది. సినీఫక్కీలో కాల్పులు చోటుచేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. అచ్చం సినిమాల్లోలాగా ఆగంతకులు కాల్పలకు తెగబడటం విస్మయం కలిగింది. ఇందులో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ జితేందర్ ప్రాణాలు కోల్పోయాడు. రెండు గ్యాంగులు పరస్పరం కాల్పులకు తెగించడంతో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాక పరుగులు పెట్టారు. ఈ ఘటనలో జితేందర్ తరఫు లాయర్ కు సైతం గాయాలు అయినట్లు తెలుస్తోంది.
కోర్టు వద్ద విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో సాధారణ పౌరులు కూడా గాయపడ్డారు. గ్యాంగ్ స్టర్ జితేందర్ పై కాల్పుల సమయంలో పోలీసులు కూడా ప్రతిగా కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మొత్తం నలుగురు మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే సూచనలున్నాయని తెలుస్తోంది. రెండు గ్యాంగ్ ల మధ్య చోటుచేసుకున్న విభేదాల కారణంగానే కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
గ్యాంగ్ స్టర్ జితేందర్ పై గత ఏప్రిల్ లో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ ఎంసీవో సీఏ కింద అరెస్టు చేశారు. హత్యలు, హత్యాయత్నం సహా మొత్తం 19 కేసులు జితేందర్ పై ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కూడా విచారణ చేపట్టారు. నిజానిజాలు వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలోనే కోర్టులో హాజరు పరచగా.. ప్రత్యర్థుల కాల్పుల్లో జితేందర్ హతమయ్యాడు. కాల్పుల ఘటనతో ఉలిక్కిపడిన ఢిల్లీ నగరంలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
భద్రతా లోపాల వల్లే కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు అగంతకులు లోపలికి ఎలా ప్రవేశించారనే దానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాలేదు. రెండు గ్యాంగుల మధ్య కాల్పులు జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా అసలు విషయాలు బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే నిందితులు పక్కా ప్రణాళికతోనే కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. జితేందర్ ను కోర్టుకు తీసుకొస్తున్నారనే పక్కా సమాచారంతోనే దుండగులు ప్లాన్ చేసి హతమార్చినట్లు సమాచారం. ఈ మేరకు ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. నిందితులు లాయర్ వేషధారణలో వచ్చి ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. దాదాపు 40 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆధారాలు ఉన్నాయి. దీంతో గ్యాంగ్ స్టర్ జితేందర్ అక్కడికక్కడే హతమయ్యాడు.