Ayodhya Ram Mandir: రామ్‌లల్లా ఇక ‘బాలక్‌ రామ్‌’..!

బాల రాముడి దివ్య దర్శనానికి మంగళవారం నుంచి సామాన్యులను కూడా అనుమతిస్తున్నారు. ఆలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట పూర్తికావడంతో హారతి వేళలు, పూజా కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేశారు.

Written By: Raj Shekar, Updated On : January 24, 2024 8:57 am
Follow us on

Ayodhya Ram Mandir: అయోధ్య వాసుల ఐదు శతాబ్దాల కల, కోట్లాది మంది రామ భక్తుల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. అయోధ్యలో రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో జనవరి 22న బాల రాముడిని ప్రాణ ప్రతిష్ట చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా గర్భగుడిలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ వేడుక అనంతరం బాల రాముడి దివ్య రూపాన్ని దర్శించుకుని యావత్‌ దేశం పులకించింది. అయితే ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన రామ్‌లల్లాను ఇకపై ‘బాలక్‌ రామ్‌’గా పిలవనున్నారు. ఈమేరకు ట్రస్టీ పూజారి అరుణ్‌ దీక్షిత్‌ వెల్లడించారు. మందిరంలో రాముడు పసి బాలుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. అందుకే రామచంద్రమూర్తి పేరును బాలక్‌ రామ్‌గా పిలవాలని నిర్ణయించినట్లు తెలిపారు.

రోజుకు ఆరుసార్లు హారతి..
ఇక బాల రాముడి దివ్య దర్శనానికి మంగళవారం నుంచి సామాన్యులను కూడా అనుమతిస్తున్నారు. ఆలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట పూర్తికావడంతో హారతి వేళలు, పూజా కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేశారు. రోజుకు ఆరుసార్లు రామచంద్రమూర్తికి హారతి ఇవ్వాలని నిర్ణయించినట్లు ట్రస్టుకు చెందిన ఆచార్య మిథిలేశ్‌నందిని శరణ్‌ తెలిపారు. ప్రతిరోజూ మంగళ(నిద్ర లేపేందుకు), శ్రింగార (అలంకరణ సేవలో), భోగ (నైవేద్య సమర్పణ వేళ), ఉతపన్‌(దిష్టి తగలకుండా), సంధ్యా (సాయంత్రం వేళ), శయన హారతి (స్వామి వారిని నిద్ర పుచ్చేందుకు) హారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

నైవేద్యం ఇలా..
బాల రాముడికి నిత్యం సమర్పించే నైవేద్యాలను కూడా ట్రస్టు నిర్ణయించింది. పూరి, కూరతోపాటు రబీ–ఖీర్, పాలు, పండ్లు, పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించనున్నారు. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వస్త్రాల్లో ‘బాలక్‌ రామ్‌’ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.