TVK Vijay Rally Stampede: అయితే డిఎంకె.. లేకుంటే అన్నా డిఎంకె.. దశాబ్దాల పాటుగా తమిళనాడు రాజకీయాలు ఈ రెండు పార్టీల చుట్టే తిరుగుతున్నాయి. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో అన్నా డీఎంకే అధికారానికి దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు డీఎంకే అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా స్టాలిన్ కొనసాగుతున్నారు. డీఎంకేలో వారసత్వ పోరు.. అన్నాడీఎంకెలో పదవుల పోరు నిత్యం కొనసాగుతున్నదే. కాకపోతే ప్రజలకు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి.. జాతీయ పార్టీలను తమిళనాడులో దేకే పరిస్థితి లేదు కాబట్టి.. అక్కడి ప్రజలకు తప్పడం లేదు.
ఇలాంటి స్థితిలో తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇదయ దళపతి విజయ్. తన మార్క్ రాజకీయంతో తమిళనాడులో సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఏకంగా టీవీకే పార్టీని ఏర్పాటు చేసి తమిళనాడు రాజకీయాలలో పెను మార్పులకు కారణమవుతున్నాడు. అతని పెడుతున్న ర్యాలీలకు.. నిర్వహిస్తున్న సభలకు లక్షలాదిమంది జనం వస్తున్నారు. ఇటీవల కాలంలో మధురై ప్రాంతంలో మానాడు కార్యక్రమం నిర్వహిస్తే ఏకంగా 10 లక్షల వరకు జనం వచ్చారు. ఇది తమిళనాడు మాత్రమే కాదు, దేశ రాజకీయాలలోనే సంచలనం సృష్టించింది. ఇక పార్టీ పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు జనం విపరీతంగా వస్తున్నారు. వచ్చిన జనం మొత్తం నాయకత్వ మార్పును కోరుకుంటున్నారు.
ఇలాంటి మార్పును తమిళనాడులో తీసుకురావడానికి తాను నూటికి నూరు శాతం కృషి చేస్తానని విజయ్ ప్రజలకు మాటిస్తున్నాడు. వ్యక్తిగత విమర్శ చేయకుండా.. విధానాల పరంగానే విమర్శలు చేస్తూ.. తమిళనాడు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని చెబుతున్నాడు విజయ్. మానాడు సభలలో తన వైఖరి మొత్తాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కరూర్ ప్రాంతంలో శనివారం నిర్వహించిన ర్యాలీ విషాదానికి దారి తీసింది. జనం విపరీతంగా రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 31 మంది చనిపోయారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటన టీవీకే పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. విజయ్ ఈ ఘటన గురించి తెలుసుకొని నిర్వేదం వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వపరంగా సహాయం అందుతోంది. ఇప్పటికే ప్రభుత్వం చనిపోయిన వారికి పది లక్షలు, గాయపడిన వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. తమిళనాడు రాజకీయాలలో ఆశా కిరణం లాగా కనిపించిన విజయ్ పార్టీకి ఇలా ఆదిలోనే ఎదురు దెబ్బ తగలడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. సోషల్ మీడియాలో విజయ్ ని ఉద్దేశించి డీఎంకే పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పోలీసులతో సమన్వయం చేసుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్లే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.