https://oktelugu.com/

ISRO: ల్యాండర్, రోవర్ పనిచేయకపోయినా.. ఇస్రో మొక్కవోని ధైర్యం.. తర్వాత ప్రయోగాలు ఇవే..

సూర్యుడు గురించి తెలుసుకునేందుకు ఇప్పటికే ఇస్రో ఆదిత్య అనే ప్రయోగాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఈ ఉపగ్రహం సూర్యుడికి చేరువగా ప్రయాణం చేస్తోంది. దీనివల్ల సూర్యుడికి సంబంధించిన చాలా విషయాలను ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహం కనుక్కుంటుంది.

Written By:
  • Rocky
  • , Updated On : September 28, 2023 / 10:22 AM IST

    ISRO

    Follow us on

    ISRO: చంద్రయాన్_3 విజయవంతమైంది.. ఆదిత్య ప్రయోగం ఫలితం దశలో ఉంది.. దీంతో ఇస్రో తర్వాత చేపట్టబోయే ప్రయోగాలపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఇస్రో పుట్టబోయే ప్రయోగాలకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ చైర్మన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. శుక్ర గ్రహాన్ని అధ్యయనం చేసేందుకు ఒక ప్రయోగం, అంతరిక్ష వాతావరణం, భూమిపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు మరో రెండు ఉపగ్రహాలను సిద్ధం చేసే పనిలో ఇస్రో ఉంది. అలాగే అంగారక గ్రహం పై వకను దింపే ప్రాజెక్టును కూడా రూపొందిస్తోంది. ఇక రాకెట్ల తయారీలో ఉపయోగించే 95% విడిభాగాలను భారత్ నుంచి సేకరిస్తున్నది.

    ఇక సూర్యుడు గురించి తెలుసుకునేందుకు ఇప్పటికే ఇస్రో ఆదిత్య అనే ప్రయోగాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఈ ఉపగ్రహం సూర్యుడికి చేరువగా ప్రయాణం చేస్తోంది. దీనివల్ల సూర్యుడికి సంబంధించిన చాలా విషయాలను ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహం కనుక్కుంటుంది. అంతేకాకుండా సూర్యుడిలో ఉన్న కేంద్రక సంలీనం అనే చర్యను, దాని ద్వారా ఉత్పత్తి అవుతున్న శక్తిని, ఫోటోల ద్వారా వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ ప్రయోగం ఇంకా తుది ఫలితం దశలో ఉన్న నేపథ్యంలో దీని గురించి ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అయి సల్ఫర్ నిల్వలు, హీలియం నిల్వలు నీటి జాడలను కనుగొన్న ల్యాండర్, రోవర్.. చంద్రుడి మీద సూర్యాస్తమయం కావడంతో 14 రోజుల క్రితం స్విచ్ ఆఫ్ అయ్యాయి. చంద్రుడి మీద ప్రస్తుతం సూర్యోదయం అయినప్పటికీ అవి స్విచ్ ఆన్ కావడం లేదు. ఇక్కడ ఉన్న అతి శీతల వాతావరణం వల్ల పరికరాలు అనుసంధానం కావడం లేదని ఇస్రో చెబుతోంది. అయితే చంద్రయాన్_3 ఇచ్చిన ఉత్సాహంతో ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతోంది. అంగారక గ్రహం మీద మార్స్ పేరుతో నాసా గతంలోనే ప్రయోగాలు చేపట్టింది. అయితే దాని ద్వారా వచ్చిన ఫలితాలు అంతంత మాత్రమే. అయితే అమెరికా ప్రయోగాలను బేరీజు వేసుకొని ఇస్రో సరికొత్త ఉపగ్రహాలను అంగారక గ్రహం మీదికి పంపించనున్నట్లు తెలుస్తోంది. అంగారక గ్రహం మీద ఎటువంటి ఖనిజాలు ఉన్నాయి? నీటి జాడలు ఏమైనా ఉన్నాయా? అక్కడ భూమి లాగానే మనుషులు నివసించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా? అక్కడ ఆక్సిజన్ నిల్వల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ విషయాలను ఆ ప్రయోగం ద్వారా ఇస్రో తెలుసుకునే అవకాశం ఉంది.