
Dog Journey In Flight : ఇప్పటి వరకూ కనీసం విమానాన్ని దగ్గరి నుంచి చూడని వారి సంఖ్య మనదేశంలో కోట్లలో ఉంటుంది. ఇక, ఇప్పటి వరకూ విమానం ఎక్కని వారి సంఖ్య 90 కోట్ల పైనే ఉంటుంది. కానీ.. ఓ కుక్క విమానంలో ప్రయాణించింది. అది కూడా సాధారణ ప్యాసింజర్ సీట్లో కాదు.. లగ్జరీ బిజినెస్ క్లాస్ లో! అది కూడా ఒక్క సీటులో కాదు.. బిజినెస్ క్లాస్ క్యాబిన్ మొత్తం ఆ కుక్క కోసమే బుక్ చేశారు.! దీంతో.. ఇప్పుడు ఈ కుక్క ప్రయాణం వార్తయిపోయింది.
ఎయిర్ ఇండియా ఏ320 విమానంలో ఈ కుక్క ప్రయాణించింది. ఇందులో జే క్లాస్ లో జర్నీ చేసింది. ఈ క్లాస్ లో మొత్తం 12 సీట్లు ఉంటాయి. ఇవన్నీ ఈ కుక్కకోసమే బుక్ చేశాడు దాని యజమాని. ముంబై నుంచి చెన్నైకి దీని ప్రయాణం సాగింది. బిజినెస్ క్లాస్ లో ముంబై నుంచి చెన్నైకి ప్రయాణించడానికి ఛార్జీ దాదాపు 20 వేల వరకు ఉంటుంది. ఆ విధంగా.. మొత్తం సీట్లకు కలిపి 2.50 లక్షలు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది.
గతంలోనూ పెంపుడు కుక్కలు విమానంలో ప్రయాణించాయి. ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లేవారు. అయితే.. విమానం చివరలో వీటిని ఉంచడానికి అనుమతించేవారు. అది కూడా ఎయిర్ ఇండియా విమానంలో మాత్రమే పెంపుడు జంతువుల ప్రయాణానికి అనుమతి ఉంది. మిగిలిన సంస్థలు ఇందుకు అనుమతించవు. అయితే.. బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేసుకొని.. ప్రయాణించిన మొదటి కుక్క ఇదే కావడం గమనార్హం.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేవలం 2 గంటలపాటు ఒక కుక్క ప్రయాణించడానికి 2.50 లక్షలు ఖర్చు చేసిన యజమాని వైభోగంపై సెటైర్లు వేస్తున్నారు. డబ్బులు అవసరానికి మించి ఉంటే.. ఏం చేయాలో తెలియదని, అందుకు ఇదే నిదర్శనమని అంటున్నారు నెటిజన్లు.