Railway Information : రైలు ప్రయాణం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. బస్సులు, కార్లలో చేసే ప్రయాణం కన్నా తక్కువ ఖర్చుతో ఎక్కువ సుఖవంతమైన ప్రయాణానికి రైలు చాలా ఉత్తమం. దూర ప్రయాణాలు చేసే చాలా మంది రైళ్లను ఎంచుకుంటారు. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు తరగతుల వారీగా బెర్తులు కూడా ఉండడం రైలు ప్రయాణాన్ని మరింత హాయిగా మారుస్తుంది. అయితే రైలు ప్రయాణిస్తున్నంత సేపు బాగానే ఉంటుంది. కానీ, రైలు స్టేషన్లలో ఆగేది చాలా తక్కువ సమయం. ప్రయాణాన్ని ఎంజాయ్ చేసే ప్రయాణికులు.. తమ గమ్యం రాగానే హడావుడిగా దిగేస్తారు. ఈ క్రమంలో లగేజీ మర్చిపోతుంటారు. విలువైన పత్రాలు, డబ్బులు, నగలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం రైల్వే కొత్త ఏర్పాట్లు చేసింది. లగేజీ మర్చిపోయినా తిరిగి తెచ్చుకునే ఏర్పాటు చేసింది.
వెస్ట్రన్ రైల్వేస్‌లో ప్రారంభం..
రైళ్లలో మర్చిపోయిన బ్యాగులు, విలువైన వస్తువులను తిరిగి ప్రయాణికులకు ఇచ్చేందుకు వెస్ట్రన్ రైల్వేస్ వారు కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చారు. అదే ఆపరేషన్ అమనథ్.. ఈ సర్వీస్‌లో భాగంగా రైళ్లలో మనం మర్చిపోయిన లగేజీని రైలే గమ్యస్థానం చేరాక సేకరిస్తారు. వాటిని భద్రంగా తీసుకెళ్లి సేఫ్‌గా ఉంచుతారు. తర్వాత ఆ సమాచారాన్ని www.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అందులో లగేజీలకు సంబంధించిన ఫొటోలు కూడా ఉంటాయి. ఈ వెబ్‌పైట్ చూసుకోవడం ద్వారా మన లగేజీ అందులో కనిపిస్తే.. దానికి సంబంధించిన ఆధారాలను చూపించి తిరిగి తీసుకోవచ్చు.
అలా కాకుంటే…
ఇక వెబ్‌సైట్‌లో పెట్టే వరకు లగేజీ రైలులో ఉంటుందా అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. అది కూడా నిజమే. ఎందుకంటే.. రైళ్లలో దొంగలు ఎక్కువ. రైలు గమ్యస్థానం చేరేలోగా ఆ లగేజీని ఎవరో ఒకరు కొట్టేసే అవకాశాలు ఉన్నాయి. చివరి వరకు ఉన్నా.. రైలు క్లీన్ చేసే సిబ్బంది దానిని భద్రంగా పోలీసులకు ఇస్తారన్న గ్యారంటీ లేదు. విలువైన వస్తువులు ఉన్నప్పుడు రైలు పక్క స్టేషన్ వెళ్లేలోగా మనం దిగిన స్టేసన్‌లో స్టేషన్ మాస్టర్ వద్దకు వెళ్లి.. తను మర్చిపోయిన బ్యాగు, అందులో ఉన్న విలువైన వస్తువుల వివరాలు చెప్పి తర్వాతి స్టేషన్‌లో రిసీవ్ చేసుకునేలా రిక్వెస్ట్ చేయాలి. ఈమేరు సదరు మాస్టర్.. తర్వాతి స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇస్తారు. అక్కడ మాస్టర్ వెంటనే సిబ్బందిని అలర్ట్ చేసి.. బోగీ, బెర్త్, బాగు గుర్తుల ఆధారంగా రిసీవ్ చేసుకుంటారు. తర్వాత మనం అక్కడకు వెళ్లి రిసీవ్ చేసుకోవచ్చు. అయితే సిబ్బంది స్పందించకపోతే మాత్రం తిరిగి వెబ్ సైట్‌ను ఆశ్రయించాలి.