Delhi Temperature : దేశం మండిపోతోంది. దేశ వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు పెరిగాయి. గరిష్టంగా నమోదవుతున్నాయి. భగభగమంటూ మంటలతో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. పగలూ, రాత్రి అన్న తేడా లేకుండా పోతోంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ వేడి వాతావరణం కొనసాగుతోంది. ప్రజలు అల్లాడిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులు ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. ఉదయం నుంచే తీక్షణమైన ఎండతో భానుడు విరుచుకుపడుతున్నాడు. ఉదయం 9 గంటలకే రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇష్టపడడం లేదు.
దేశ రాజధాని ఢిల్లీ భగభగమంటోంది. ప్రజలు భానుడి ప్రతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణతాపం, వేడిగాలులకు వణికిపోతున్నారు. ఢిల్లీలో ఆదివారం రికార్డు స్థాయిలో 47.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత 62 ఏళ్లలో ఢిల్లీలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే నని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. మరికొద్దిరోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
సందట్లో సడేమియా అన్నట్టు విద్యుత్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కంటిమీద కునుకును దూరం చేస్తున్నాయి. దీంతో ఢిల్లీ వాసుల ఇక్కట్లు రెట్టింపవుతున్నాయి. ఇప్పటికే కాలుష్య కోరల్లో రాజధాని నగరం చిక్కుకుంది. ఢిల్లీయే కాదు. ఉత్తరాధి రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. దీంతో భారత వాతావరణ విభాగం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. జాగ్రత్తలను సూచించింది.