
గతేడాది కరోనా సృష్టించిన అల్లకల్లోలం అంతాఇంతా కాదు. ఎంతో మంది ఉసురు తీయగా.. ఎంతో మంది ఉపాధిని దెబ్బతీసింది. ఇక వలస కార్మికుల కష్టాలైతే అన్నీఇన్నీ కావు. రాష్ట్రాలను వదిలి సొంత రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి. అటు రైళ్లు నడవక.. ఇటు బస్సుల్లేక.. బతుకు జీవుడా అంటూ కాలినడకన ఇంటి బాట పట్టారు. చంకన పాపలు.. నెత్తిన ముల్లేమూటలతో మైళ్ల దూరం నడిచివెళ్లారు. ఈ చేదు ఘటనలు చూసిన ఏడాది గడిచినా.. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. వసల కార్మికుల వెతలు ఇప్పుడు ఢిల్లీలో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం రాత్రి నుంచి ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. మొన్నటివరకు ఢిల్లీలో రాత్రిపూట కరోనా కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్ అమలు చేయగా.. ఢిల్లీలో పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్ తప్పనిసరని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఓ వైపు టెస్టుల సంఖ్య పెంచామని.. ఐసోలేషన్ బెడ్‌లు కూడా సరిపోవడం లేదని.. లాక్‌డౌన్ పెట్టక తప్పడం లేదని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
కేజ్రీవాల్ ప్రకటనతో ఒక్కసారిగా వలస కార్మికుల్లో మరోసారి ఆందోళన మొదలైంది. ఆరు రోజుల లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులు తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్స్, ప్రైవేటు బస్ డిపోలలో పోటెత్తారు. వేలాది మంది ఒక్కసారిగా తరలివచ్చారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్, ఘాజిపూర్, ఘజియాబాద్‌లోని కౌశాంబి వద్ద వలస కార్మికులు ఊర్లకు వెళ్లేందుకు బారులు తీరారు. వలస కార్మికుల కష్టాలను చూస్తుంటే.. గతేడాది చేదు స్మృతులే కనిపిస్తున్నాయి.
లాక్‌డౌన్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ విధించే నిర్ణయం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి అంత సులభం కాదని.. పేద, రోజువారీ కూలీలను ఎక్కువగా బాధిస్తుందని పేర్కొన్నారు. వలస కార్మికులకు తాము భరోసానిస్తామని ఓ వైపు చెబుతున్నా.. కార్మికులు మాత్రం తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. లాక్‌డౌన్, కర్ఫ్యూలు ఎన్ని రోజులు కొనసాగుతాయో తెలియకుండా ఉంది. దీంతో కార్మికుల్లోనూ నమ్మకం సన్నగిల్లింది. ఇక్కడ ఉండి బాధపడడం కంటే స్వస్థలాలకు వెళ్లిపోయింది ఉత్తమం అని డిసైడ్ అయినట్లుగా అర్థమవుతోంది. అందుకే.. ఎన్ని బాధలైన భరించి సొంతింటికి చేరుకోవాలని చూస్తున్నారు. ఏదిఏమైనా 2020లో వలస కూలీల కష్టాలు మళ్లీ 2021లో కూడా రిపీట్ కావడం దురదృష్టకరం.