దేశంలో కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తోంది. మహమ్మారితో యావత్ భారతదేశం వణికిపోతోంది. ఫస్ట్ వేవ్ కన్నా.. సెకండ్ వేవ్ కరోనా జెట్ స్పీడ్‌లా దూసుకెళ్తోంది. లక్ష రెండు లక్షలు దాటి ఇప్పుడు ఏకంగా మూడు లక్షల పాజిటివ్ కేసులకు రీచ్ అయింది. గడిచిన 24 గంటల్లో దేవంలో 2.95 లక్షల కేసులు నమోదయ్యాయి.
కరోనా దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి నమోదైన కేసులు ఇవే అత్యధికం. ఈ కేసులను బట్టి చూస్తుంటే అందరం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే వరుసలో మరణాల పరంపర కొనసాగుతోంది. రోజురోజుకూ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా 2023 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. దేశంలో రోజువారీ మరణాలు కూడా 2 వేలు దాటడం ఇదే మొదటిసారి.
దేశవ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 16,39,357 కోవిడ్ టెస్టులు చేయగా.. 2,95,041 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 1,56,16,130కి చేరింది. ఇదే సమయంలో 2023 మంది మృత్యువాతపడ్డారు. కరోనా దేశంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 1,82,553 మంది వైరస్ బారిన పడి చనిపోయారు.
ఈ 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 519, ఢిల్లీలో 277, ఉత్తరప్రదేశ్‌లో 162 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు.. రికవరీ రేటు కూడా 85.56 శాతంగా నమోదైంది. ప్రస్తుతం దేశంలో 21,57,538 యాక్టివ్ కేసులు ఉండగా.. రేటు 13.26 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది.
మరోవైపు.. దేశంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటకల్లోనే కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నట్లుగా అర్థమవుతోంది. రోజువారీ రికార్డు కేసుల సంఖ్య అక్కడే నమోదవుతోంది. అత్యధికంగా మహారాష్ట్రలో 62,097, యూపీలో 29,754, ఢిల్లీలో 28,395, కర్ణాటకలో 21,794 కేసులు నమోదయ్యాయి. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అలర్ట్‌గా ఉండాలని ఎప్పటికప్పుడు వైద్య శాఖ సూచిస్తోంది.