Sajjala Ramakrishna: జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణంలో అంతగా ఆసక్తి చూపించలేదు. పైగా ఆయన దక్షిణాఫ్రికా మోడల్ ను తెర పైకి తీసుకొచ్చారు. మూడు రాజధానులను నిర్మిస్తామని ప్రకటించారు. కానీ ఆ తర్వాత మూడు రాజధానుల నిర్మాణ విషయంలో జగన్ అంతగా చొరవ చూపిన దాఖలాలు లేవు. మూడు రాజధానుల నిర్మాణ విషయాన్ని అప్పట్లో వైసీపీ నేతలు తెగ ప్రచారం చేశారు. వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన సాగిస్తామని వైసిపి నేతలు చెప్పారు. రుషికొండ లో ఆధునిక భవంతుల సముదాయం కేంద్రంగా ముఖ్యమంత్రి నివాసం ఉంటారని.. అక్కడి నుంచి పరిపాలన సాగిస్తారని వెల్లడించారు.
వైసీపీ నేతలు అనుకున్నట్టుగా రెండోసారి అధికారం దక్కలేదు. కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణంలో కదలిక వచ్చింది. జంగిల్ కటింగ్ పూర్తయింది. భవనాల నిర్మాణం మళ్లీ ప్రారంభమైంది. దీనికి తోడు కేంద్రంలో కూటమికి విపరీతమైన ప్రాధాన్యం లభిస్తూ ఉండడంతో రాజధాని నిర్మాణానికి భారీగా నిధులు వస్తున్నాయి. ఈ నిధులతో అద్భుతమైన భవనాలు నిర్మించడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో పెడుతున్న భారీ ఖర్చును వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీలో కీలకంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వ వ్యవహారాన్ని ఎండగడుతున్నారు.
” అమరావతి లో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే సరిపోతుంది. అంతేగాని కోట్లకు కోట్లు పునాదుల్లోనే ఖర్చు చేస్తే ఉపయోగం ఉండదు. దీనివల్ల రాజధాని నిర్మాణం బారమవుతుంది. అమరావతి పూర్తిస్థాయిలో నిర్మాణం కావాలంటే 20 సంవత్సరాల వరకు పడుతుంది. అప్పటివరకు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు మొత్తం దీనికి ఖర్చు చేస్తామంటే ఎలా? అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తే సహకరిస్తాం. నిర్మాణ విషయంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే వ్యతిరేకిస్తాం. అప్పుడు రాజధాని నిర్మాణాల్లో పునరేకీకరణ అంశాన్ని పరిశీలిస్తాం. ఒకవేళ మేము అధికారంలోకి వస్తే అమరావతి కేంద్రంగానే పరిపాలన సాగిస్తాం. మూడు రాజధానుల అంశాన్ని పరిశీలనలోకి తీసుకోబోమని” సజ్జల పేర్కొన్నారు.
సజ్జల చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో మంటలు పుట్టించాయి.. టిడిపి నేతలు సజ్జల వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.”అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన సాగిస్తామన్నారు. అమరావతిని పడుకోబెట్టారు. మిగతా ప్రాంతాలలో పెద్దగా భవనాలు నిర్మించలేదు. ప్రభుత్వపరంగా కార్యక్రమాలను వేగవంతం చేయలేదు. చివరికి ఇప్పుడేమో అమరావతి కేంద్రంగానే పరిపాలన సాగిస్తాం అని చెబుతున్నారు. మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గారు. అప్పట్లో విపరీతంగా ఖర్చు పెట్టారు. వైసిపి నిర్లక్ష్యం వల్ల అమరావతి ప్రాంతంలో జంగిల్ విపరీతంగా పెరిగింది. దానిని నిర్మూలించడానికి చాలావరకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఒకవేళ నాటి ప్రభుత్వం గనుక పకడ్బందీగా వ్యవహరించి ఉంటే ఇక్కడదాకా వచ్చి ఉండేది కాదు కదా అని” టిడిపి నేతలు అంటున్నారు. మొత్తానికి వైసీపీ నేతలకు జ్ఞానోదయం అయ్యిందని చెబుతున్నారు.