Chinese Loan Apps Scam: ప్రయోజనాల కోసం చైనా ఏమైనా చేస్తుంది. ఆదాయం ఉంటుందంటే చాలు గద్దలా వాలిపోతుంది. ప్రస్తుతం చైనా లోన్ యాప్ ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బెంగళూరులోని ఆరుచోట్ల సోదాలు నిర్వహించి 17 కోట్లు సీజ్ చేసింది. చైనా వ్యక్తుల నియంత్రణలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా అప్పటికప్పుడు ఇస్తున్న చట్ట వ్యతిరేక రుణాలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా పేటీఎం పేమెంట్ సర్వీసెస్, క్యాష్ ప్రీ పేమెంట్స్, రేజర్ పే కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోందని, వివరాలు తర్వాత చెప్తామని అధికారులు అంటున్నారు. అయితే ఆయా సంస్థల బ్యాంకు ఖాతాలు, మర్చంట్ ఐడీల్లో ఉన్న 17 కోట్లను అధికారులు సీజ్ చేశారు. కానీ ఇక్కడే వారికి మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిసాయి.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో…
చైనా ఇన్స్టంట్ లోన్ యాప్ నిర్వాహకులు భారతీయుల పత్రాలను ఫోర్జరీ చేసి, వాటి ద్వారా సంస్థలను ఏర్పాటు చేశారు. కార్యకలాపాలు కూడా సాగిస్తున్నారు. దీంతో డమ్మీ డైరెక్టర్లుగా భారతీయుల పేర్లు ఉంటున్నాయి. ఆ సంస్థలు చేసే నేరాలకు భారతీయులు బాధ్యులవుతున్నారు. కానీ యాప్ ల ద్వారా కార్యకలాపాల నిర్వహణ, నియంత్రణ అన్నీ చైనా వ్యక్తులే చేస్తున్నారు. వివిధ మర్చంట్ ఐడిలు, బ్యాంకు ఖాతాలతో ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారు.
Also Read: America- China: డ్రాగన్ ను మళ్లీ గిల్లుతున్న అమెరికా: ఈసారి తైవాన్ కు 8.7 వేల కోట్ల ఆయుధాల విక్రయం
వెబ్సైట్ రిజిస్ట్రేషన్ కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఇచ్చిన పత్రాల్లో పేర్కొన్న అడ్రస్ లలో చైనా సంస్థలు లేవు. పైగా లోన్ యాప్ లతో రుణాలు పొందిన బాధితుల ఫిర్యాదుల ఆధారంగా బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఈ సంస్థలపై ఇప్పటివరకు 18 కేసులు నమోదు చేశారు. వాటి ఆధారంగా మనీలాండరింగ్ కేసులు కూడా బుక్ చేశారు. ఈ యాప్ ల నిర్వాహకులు చైనాలో ఉండటంతో వారిని ప్రశ్నించేందుకు ఇంటర్పోల్ సహకారం తీసుకోవాలని ఈడి అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకు చైనా దేశం స్పందించలేదు. అయితే యాప్ ల ఖాతాలన్నీ చైనా దేశానికి చెందినవి కావడంతో, ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు మొత్తం ఆ దేశానికే పంపించినట్టు తెలుస్తోంది. అయితే మరింత లోతుగా విచారిస్తానే అసలు విషయాలు వెలుగు చూస్తాయని ఈడి అధికారులు అంటున్నారు. దేశంలో ఈడి అధికారులు సోదాలు చేస్తున్న తీరుతో విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు.. దీనిపై కూడా రాద్ధాంతం చేస్తాయేమోనని బిజెపి నాయకులు వ్యంగ్యంగా అంటున్నారు. చైనాకు అనుకూలంగా రాహుల్ గాంధీ స్పందించాలని చలోక్తులు విసురుతున్నారు.

చైనా సెల్ఫోన్ కంపెనీలపై నిఘా
వివో, ఒప్పో, శావొమీ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా తమ దేశానికి డబ్బులు మళ్ళించాయనే ఆరోపణలతో ఐటీ శాఖ ఇటీవల దాడులు నిర్వహించింది. భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకుంది. భారత చట్టాలను కాలరాస్తూ, ఆదాయపు పన్ను శాఖ నిబంధనలకు విరుద్ధంగా నగదును తమ దేశానికి మళ్లించాయని ఐటి శాఖ గుర్తించింది. ఇప్పటికీ వాటి కార్యకలాపాలపై ఒక నిఘా వేసింది. ఇప్పటికిప్పుడు ఆ కంపెనీలపై వేటు వేస్తే చైనా తో జరిగే ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయని భావించి, వాటిపై నిదానంగా చర్యలు తీసుకుంటోంది.
Also Read:Hotel Secrets: రాత్రిపూట ఈ హోటల్లో జరిగే 5 వింత రహస్యాలు తెలిస్తే షాక్ అవుతారు..