Chandrayaan 3: రోజులు, గంటలు గడిచిన కొద్దీ చంద్రయాన్ -3 ప్రయోగం పై ఉత్కంఠ పెరిగిపోతుంది. ఇప్పటి వరకు చంద్రుడి కక్ష్యలను పూర్తి చేసుకొని జాబిల్లిపై అడుగుపెట్టేందుకు చంద్రయాన్ 3 రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో చివరి వరకు ఏం జరుగుతుందోనని యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. శాస్త్రవేత్తలు తెలపిన ప్రకారం 23 ఆగస్టు సాయంత్రం 6 గంటలకు చంద్రయాన్ 3 మూన్ పై దిగనుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. అయితే అసలు జాబిల్లిపై చంద్రయాన్ 3 దిగిన తరువాత ఏం చేస్తుంది? ఎలాంటి ప్రయోగం చేస్తుంది? అనేది ఆసక్తిగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
చంద్రుడి చుట్టూ ఉన్న కక్ష్యలు పూర్తి చేసుకున్న తరువాత ఇక జాబిల్లిపై దిగేందుకు రోవర్ రెడీ అవుతుంది. అయితే శాస్త్రవేత్తలు ఈ రోవర్ ను దించే 4 గంటల ముందు సిద్ధమవుతారు. ఈ సమయం పూర్తయిన తరువాత నిదానంగా చంద్రుడిపై అడుగు పెడుతుంది. ఈ రోవర్ సెకనుకు సెంటీమీటర్ వేగంతో ముందుకు కదులుతుంది. రోవర్ ఒక లునార్ డే(మన ప్రకారం 14 రోజులు) పనిచేస్తుంది. ఈ సమయంలో తన పేలోడ్ లు ఉపయోగించి ప్రయోగాలు చేస్తుంది. ఈ 14 రోజుల కాలంలో 500 మీటర్లు చంద్రుడిపై ప్రయాణిస్తుంది. చంద్రుడిపై నలుమూలలా ఎలాంటి సమాచారం ఉన్నా మనకు అందిస్తుంది.
చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా శాటిలైట్స్ తీసిన చిత్రాల ప్రకారం దక్షిణ ధ్రువం లో పరిశోధనలు చేయనున్నారు. ఇక్కడ ఖనిజ సంపద తదితర సమాచారాన్ని తీసుకుని ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు అందిస్తుంది. రోవర్ లో ప్రేరిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రో స్కోప్ , అల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ అమర్చబడి ఉంటాయి. ఇవి చంద్రుడి ఉపరితలం రాళ్లు, నేల రసాయన కూర్పును విశ్లేషిస్తుంది. చంద్రుడిపై ఉండే రాళ్లు, నేల స్వభావాన్ని కూడా పరిశీలిస్తుంది.
ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనాలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. ఈ నేపథ్యంలో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టాలని సంకల్పించింది. ఇందులో భాగంగా చంద్రయాన్ 1 తో ఉపగ్రహాన్ని ప్రయోగించి చంద్రుడి చుట్టూ ఉంచింది. ఆ తరువాత చంద్రయాన్ 2 ప్రయోగం తో జాబిల్లిపై అడుగుపెట్టాలని అనుకుంది. కానీ చివరి రెండు నిమిషాల్లో చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్ అందకుండా పోయాయి. దానిని సవాలుగా తీసుకున్న మన శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3ని జూలైలో ప్రయోగించారు. ఈ ప్రయోగం సక్సెస్ కావాలని యావత్ భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.