Lifestyle: కార్లు, బంగ్లాలు.. ప్రజల అవసరాలు మారుతున్నాయి!

ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కార్ల వినియోగం కూడా ద్విచక్ర వాహనాలు మాదిరిగానే మారిపోయింది. ముఖ్యంగా గత తొమ్మిది సంవత్సరాలలో కార్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 19, 2023 6:05 pm

Lifestyle

Follow us on

Lifestyle: వెనకటి రోజుల్లో సైకిల్ మీద తిరిగితే గొప్ప అని భావించే వాళ్ళు. అప్పట్లో సైకిల్ ఉండటాన్ని తమ హోదాకు చిహ్నం అని భావించేవారు. సైకిల్ తర్వాత మోటార్ సైకిళ్ళు వచ్చాయి. ప్రభుత్వాలు లైసెన్స్ విషయంలో విధించిన నిబంధన వల్ల కంపెనీలు ఆశించినంత స్థాయిలో మోటార్ సైకిళ్ళను ఉత్పత్తి చేయలేకపోయేవి.. కొంతకాలానికి ప్రభుత్వాలు నిబంధనలు సడలించిన తర్వాత మోటార్ సైకిళ్ళ ఉత్పత్తి జోరందుకుంది. తర్వాత వాటి వినియోగం పెరిగింది. ధరలు కూడా తగ్గడంతో చాలామంది కొనుగోలు చేసేందుకు మక్కువ చూపించడం ప్రారంభించారు. ఫలితంగా బహుళ జాతి కంపెనీలు కూడా మన దేశంలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. ఇక ఆ తర్వాత బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడంతో ద్విచక్ర వాహనాల కొనుగోళ్ళు ఊపందుకున్నాయి.

ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కార్ల వినియోగం కూడా ద్విచక్ర వాహనాలు మాదిరిగానే మారిపోయింది. ముఖ్యంగా గత తొమ్మిది సంవత్సరాలలో కార్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు విలాసవంతమైన వస్తువు కేటగిరిలో ఉండే కారు ఇప్పుడు నిత్యావసరం అయిపోయింది. ఫలితంగా కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మందగమనం ఉన్నప్పటికీ.. మన దేశంలో మాత్రం కార్ల వినియోగం అంతకంతకు పెరిగిపోతుండడం విశేషం.. ఈ త్రైమాసికంలో ( జూలై ఆగస్టు) కార్ల వినియోగం, అమ్మకాలు గరిష్ట స్థాయిలో పెరిగాయి. దీనివల్ల కంపెనీలు మెరుగైన లాభాలను నమోదు చేశాయి. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి మొత్తం తిరోగమనంలో ఉంటే..ఒక్క భారత్ లో మాత్రమే పురోగమనంలో ఉంది. అక్కడిదాకా ఎందుకు ప్రపంచ ఆటోమొబైల్ రాజధాని అయిన జర్మనీలో కూడా చాలావరకు ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులను పూర్తిగా తగ్గించాయి.

వాహనాలు మాత్రమే కాకుండా ఖరీదైన ఇళ్ల నిర్మాణంలోనూ భారతీయులు వెనుకడుగు వేయడం లేదు. దీని కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. బ్యాంకులు కూడా తక్కువ వడ్డీ రేటుకి రుణాలు ఇవ్వడంతో చాలామంది లగ్జరీ ఇల్లు నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. అయితే అసో చామ్ నివేదిక ప్రకారం గత 9 సంవత్సరాల నుంచి దేశంలో ఆర్థికపరంగా చాలా మార్పులు వచ్చాయి. ప్రజల ఆర్థిక స్థిరత్వం పెరిగింది. ఫలితంగా వారు తమ కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచుకున్నారు. దీంతో మెరుగైన వృద్ధిరేటు నమోదు అవుతోంది. ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, గృహ తయారీ పరిశ్రమలు లాభాలను కళ్ళజూస్తున్నాయంటే కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్లే అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజల ఆర్థిక స్థిరత్వం పెరగడం వల్ల మధ్యతరగతి నిర్వచనం పూర్తిగా మారిపోయింది. అయితే ఇదే సమయంలో ఆర్థిక అంతరాలు పెరిగిపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. శివాజీ సినిమాలో చెప్పినట్టు పేదవాడు పేదవాడి తీరుగానే, డబ్బున్న వాడు డబ్బున్న వాడు తీరుగానే ఉంటున్నాడు. కానీ మధ్యతరగతి వారే తమ ఆర్థిక స్థిరత్వాన్ని కొంతలో కొంత నయం చేసుకున్నారు. మరి ఆ పేదరికాన్ని నిర్మూలించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.