Budget 2024: రేపు కేంద్ర మధ్యంతర బడ్జెట్.. ఈ అంశాలే కీలకం

రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం రావణ కాష్టం లాగా రగులుతూనే ఉంది. దీనికి తోడు ఇటీవల గాజాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచమనేది ఒక కు గ్రామంగా మారిపోయిన నేపథ్యంలో.. ఎక్కడ ఏం జరిగినా కూడా దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : January 31, 2024 1:58 pm
Follow us on

Budget 2024: అమెరికా వృద్ధి రేటు నేలచూపులు చూస్తోంది. చైనా నిర్మాణరంగం ఊగిసలాటలో ఉంది. రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. ఇరాన్, ఇరాక్, పాక్, పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. సో.. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒకచోట ఏదో ఒక ఆందోళన.. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అంటే ఎటు చూసుకున్నా వృద్ధిరేటు అనేది ఆశాజనకంగా లేదు. వీటన్నింటి మధ్య భారత్ కోవిడ్ లాంటి పరిణామాలు ఎదుర్కొన్నప్పటికీ త్వరగానే కోలుకుంది. మెరుగైన వృద్ధిరేటు నమోదు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం అంటే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంతకీ ఈ బడ్జెట్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి అంశాలకు పెద్ద పీట వేస్తే దేశంలో మెరుగైన వృద్ధి రేటు నమోదవుతుంది? నిర్మల బడ్జెట్లో ఎలాంటి అంశాలు రూపొందించారు? వీటిపై ప్రత్యేక కథనం.

వృద్ధిరేటు పర్వాలేదు

రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం రావణ కాష్టం లాగా రగులుతూనే ఉంది. దీనికి తోడు ఇటీవల గాజాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచమనేది ఒక కు గ్రామంగా మారిపోయిన నేపథ్యంలో.. ఎక్కడ ఏం జరిగినా కూడా దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం కూడా భారత్ మీద తీవ్ర ప్రభావమే చూపించింది. గాజాలో నెలకొన్న పరిస్థితులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయినప్పటికీ భారత వృద్ధిరేటు అంచనాలు ఆశా జనకంగానే ఉన్నాయి.. 2023_24 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 7 నుంచి 7.3% వరకు ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని, 2025 కల్లా ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మన దేశం భావిస్తోంది.. ఇవి నెరవేరాలంటే ప్రైవేటు పెట్టబడును ప్రోత్సహించాలి. మేక్ ఇన్ ఇండియాను మరింత బలోపేతం చేయాలి. వ్యాపార నిర్వహణను అత్యంత సులభతరం చేయాలి.. వృద్ధిరేటుకు ప్రతి బంధకంగా ఉండే రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే చర్యలు తీసుకోవాలి. గత ఏడాది డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా 5.7% గా నమోదయింది.

మినహాయింపు ఇస్తారా

దేశవృద్దిలో ఉద్యోగుల పాత్ర వెలకట్టలేనిది. అయితే వీరు ఎప్పటినుంచో కోరుకున్నది ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు. ఎప్పటికప్పుడు ఉద్యోగులు కోరుకోవడం.. కేంద్రం తోసిపుచ్చడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్లోనూ ఆదాయపు పన్ను స్లాబులలో పెద్దగా మార్పులు ఉండవని తెలుస్తోంది. అయితే అల్ప, మధ్య ఆదాయ వేతన జీవులకు ఊరట కలిగించే విధంగా ప్రామాణిక తగ్గింపు పరిమితిని లక్షకు పెంచవచ్చు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిమితి గత ఐదు సంవత్సరాలుగా 50,000 గానే ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ కేంద్రం దానిని సవరించలేదు.

కొనుగోలు శక్తి పెంచితేనే..

దేశ అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలు. పట్టణీకరణ పెరుగుతున్నప్పటికీ నేటికీ గ్రామీణ ప్రాంతాలే దేశ వృద్ధిరేటులో కీలక పాత్ర పోషిస్తున్నాయి.. ప్రస్తుతం దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి నేల చూపులు చూస్తోంది. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడమే ప్రధాన కారణం. పైగా డిమాండ్ కూడా అంతగా నమోదు కావడం లేదు. ఏడాది క్రితంతో పోలిస్తే 2023 నవంబర్ లో గ్రామీణ ప్రాంతాలలో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విక్రయాలు 9.8% తగ్గాయి. గ్రామీణుల ఆదాయం తగ్గిపోవడం, అది కొనుగోలు శక్తి మీద ప్రభావం చూపించడం, రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడం.. వంటి కారణాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఈ బడ్జెట్లో కేంద్రం గ్రామీణ ప్రాంతం పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. గ్రామీణుల కొనుగోలు శక్తి పెంచే విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వ్యవసాయేతర ఆదాయాన్ని పెంచుకునే విధంగా గ్రామీణులకు కేంద్రం తోడ్పాటు ఇవ్వాలి. చిన్న, సన్న కారు రైతులకు ప్రోత్సాహకాలు అందించాలి. విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు పెరగాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాలకు ఈ దఫా బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం మరిన్ని పథకాలు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అన్నదాతలకు తోడ్పాటు ఉండాల్సిందే

దేశవ్యాప్తంగా వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వర్షాభావం, అతివృష్టి వంటి సమస్యలు రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అయితే రైతులను ఆదుకునేందుకు కేంద్రం ఈ బడ్జెట్ లో ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద కేంద్రం మూడు దఫాలుగా 6000 రూపాయలను పెట్టుబడి సాయం కింద అందజేస్తుంది. అయితే ఈ మొత్తాన్ని ఈసారి 9,000 కు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళా రైతులకు పెట్టుబడి సహాయాన్ని రెట్టింపు చేసే అవకాశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల మహిళా రైతు ఓటర్లు తమ వైపు మళ్లిపోతారని కేంద్రం భావిస్తోంది. ఎరువుల రాయితీలు, పంట బీమా లకు సంబంధించి కేంద్రం సరికొత్త విధానాలను ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ రంగాలపై పెట్టుబడులు పెట్టాలి

దేశ ఆర్థిక రంగానికి ఊపు తీసుకు రాగల సమర్థత ఉన్న రంగాల్లో పునరుత్పాదక ఇంధనాలు, ఫిన్ టెక్, ఆరోగ్య సేవలు_ బీమా, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటికి ఈ బడ్జెట్లో కేటాయింపులు పెంచితే బాగుంటుంది అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ రంగాలలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. ఇక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తే ప్రయోజనాలు ఉంటాయి. దేశం నుంచి ఇతర ప్రాంతాలకు అయ్యే ఎగుమతులలో 40 శాతం వాటా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలదే.

మూలధన వ్యయాన్ని పెంచే అవకాశం

గత ఐదు సంవత్సరాలుగా దేశంలో మూలధన వ్యయం పెరుగుతోంది. ఈ మూలధనాన్ని ఖర్చు చేసి కేంద్రం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. ప్రధానమంత్రి గతి శక్తి పథకం ద్వారా రోడ్ల నిర్మాణం. రైలు నెట్వర్క్ కూడా బాగా పెరిగింది. మూలధనం వ్యయం వల్ల జిడిపి పెరుగుతుంది. కొత్త ఉద్యోగాల కల్పన కూడా పెరుగుతుంది. ప్రస్తుతం మన దేశంలో జిడిపిలో ద్రవ్యలోటు 5.9 శాతం గా ఉంది. 2025_26 కల్లా దీనిని 4.5% తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. 2023_24 లో ప్రత్యక్ష పన్నుల వసూలులో కేంద్రం అనుకున్న లక్ష్యాలను సాధించడం విశేషం. 2018_19 లో 3.7 లక్షల కోట్లు, 2019_20 లో 3.36 లక్షల కోట్లు, 2020_21 లో 4.26 లక్షల కోట్లు, 2021_22 లో 5.93 లక్షల కోట్లు, 2022_23 లో 7.28 లక్షల కోట్ల మూలధనాన్ని కేంద్రం కట్ చేసింది
2023_24 లో 10.1 లక్షల కోట్ల మూలధనాన్ని ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.