BJP Operation Lotus: పార్టీని స్థాపించిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ నేడు లేరు. పార్టీని మొదటిసారి అధికారంలోకి తీసుకొచ్చిన అటల్ బిహారీ వాజ్ పేయి కానరాని లోకాలకు వెళ్లిపోయారు. రథసారథిలా వ్యవహరించిన ఎల్కే అద్వానీ చరమాంకంలో ఉన్నారు. అంటే పునాదులు తీసి, బలమైన నిర్మాణంగా రూపొందించినవారు దాదాపు కనుమరుగైపోయారు. అందుకే నాటి విలువలు వారితో పాటే కొడి గట్టి పోయాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నది మోడీ సారథ్యంలో బిజెపి అధికార అశ్వమేధ యాగం. ఈ యాగంలో పావులైన రాష్ట్రాలు ఎన్నో. పదవులు కోల్పోయి బజారున పడ్డ నాయకులు ఎందరో. మొన్నటికి మొన్న భారత్ జోడో పేరుతో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీకి బిజెపి గోవా రూపంలో షాక్ ఇచ్చింది. ఈ షాక్ మొదటిది కాదు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ దాకా ఇచ్చుకుంటూనే వస్తుంది. కాంగ్రెస్ పడుకుంటూనే పోతుంది.

అధికారమే శాశ్వతం
పదవి సత్యం. పార్టీ మిథ్య. తక్కిన అధికారం శాశ్వతం. ఎన్నికల సమయంలో ఓటర్లకు ఇచ్చిన హామీలు అబద్ధం. అంటే మొన్న బిజెపిలో కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సిద్ధాంతం ఇదే కావచ్చు. కొన్ని సంవత్సరాలుగా ఆ రాష్ట్ర ప్రతి అసెంబ్లీ కాలవ్యవధిలోనూ ఫిరాయింపులు అనేవి ఒక తంతుగా వస్తున్నాయి. 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల అధికార బిజెపిలో చేరడం నిజంగా ఆశ్చర్యమే. గోవా ఒక్కటే కాదు అనేక రాష్ట్రాల్లో కమలనాధులు సాగిస్తున్న అధికార అశ్వమేధ యాగం లో ఇది ఒక అంకం మాత్రమే. ప్రతిపక్షాలకు చెందిన నాయకులను తమలో కలిపేసుకుని కాషాయ జెండా కప్పడం 8 ఏళ్లు గా ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. అలాగని బిజెపి ఒక్కటే ద్రోహి కాదు.. వివిధ రాష్ట్రాల్లో అధికారాన్ని చెలాయిస్తున్నా ప్రాంతీయ పార్టీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. తెలంగాణలో ఏకంగా టిడిపి లెజిస్లేచర్ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేయడం పడిపోతున్న విలువలకు పరాకాష్ట. 2018లో అరుణాచల్ ప్రదేశ్, 2019లో కర్ణాటక, 2020లో మధ్యప్రదేశ్.. ఇలా ప్రతిచోట అనర్హత వేటుకు దొరకకుండా సాగుతున్న ఈ రాజకీయ ప్రహసనం పార్టీ ఫిరాయింపుల చట్టానికి పెద్ద వెక్కిరింత. రాజకీయ వ్యవస్థలోని లోపానికి, ముందే తెలిసిన తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని ప్రతిపక్షాల అసమర్ధకు పరాకాష్ట. గోవాలో ఒక పార్టీకి, సిద్ధాంతానికి కట్టుబడి ఉండే రాజకీయ పాతివ్రత్యం పట్ల ప్రజాప్రతినిధులకు పెద్దగా నమ్మకం ఉండదు. కొద్ది వేల ఓట్లను చేతుల్లో పెట్టుకొన్న నేతల చుట్టూనే ఆ రాష్ట్ర రాజకీయాలు నడుస్తుంటాయి. పైగా ఎన్నిసార్లు పార్టీ రంగులు మారుస్తున్నా ఓటర్లు చీ కొడతారనే భయం వారికి లేకపోవడం గమనార్హం. ఇక ఆరు నూరైనా అధికారంలో ఉండాల్సిందేనన్నా బిజెపి అజెండా పుణ్యమా అని ఆయారాం గయారాం అనే సంస్కృతి ఇటీవల ప్రబలింది. ఎన్నికలకు ముందు అంటే ఫిబ్రవరిలో ఆలయాల్లో, దర్గాల్లో, చర్చిల్లో పార్టీ ఫిరాయించబోమంటూ ఇదే ఎమ్మెల్యేలు చేసిన ప్రమాణాలు ఇప్పుడు ఏమైనట్టు? అదేమంటే గుడికి వెళ్లి దైవాజ్ఞ మేరకే పార్టీ మారాను అంటూ హస్తం గుర్తుపై గెలిచిన దిగంబర్ కామత్ లాంటివాళ్ళు ఈ అనైతికమైన తప్పును సమర్ధించుకోవడం పడిపోతున్న విలువలకు సంకేతం.
ప్రతిపక్షం ఉండకూడదనేనా
ప్యాకేజీలతోనూ, పదవులతోనూ, మాట వినకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతోనూ.. ఎలాగైనా ప్రతిపక్ష పార్టీల నాయకులను తమ వైపు వచ్చేలా చేసుకునే కళలో కొన్నాళ్లుగా బిజెపి ఆరితేరింది. గతంలో ఈ విధానానికి కాంగ్రెస్ ఆజ్యం పోస్తే.. ఇప్పుడు బిజెపి అందులో నెయ్యి వేసి మహోగ్ర జ్వాలగా మార్చింది. బిజెపి, దాని పెద్దలు అదేపనిగా ఇస్తున్న పిలుపు కాంగ్రెస్ ముక్త్ భారత్. కానీ గత ఎనిమిదేళ్లలో అనేక రాష్ట్రాల్లో వరుసగా సాగుతున్న ఆపరేషన్ కమలం చూస్తుంటే ఎక్కడా ఏ ప్రతిపక్షము లేని ప్రతిపక్ష ముక్త్ భారత్ అనేది కాషాయ పార్టీ మనుసులో కోరిక అని స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నికల్లో ఒక పార్టీని ఓడించి, మరో పార్టీ గెలవాలనుకోవడం వేరు. కానీ అసలు ప్రశ్నించే గొంతు, ప్రతిపక్షమే లేకుండా అంతా తామై ఏ క పక్షంగా రాజ్యం ఏలాలి అనుకోవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ వ్యవహారంలో బిజెపితో పాటు ప్రతిపక్షాల తప్పు లేకపోలేదు.

కమలనాథుల అధికారపు ఆకలి తెలిసి తమ వర్గం వారిని ఒక కట్టుగా ఉంచుకోలేకపోవడం పూర్తిగా ప్రతిపక్షాల వైఫల్యమే. ఉదాహరణకి గోవానే తీసుకుంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు ముగ్గురు అంటే ముగ్గురే ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా ఎన్నాళ్లు ఉంటారో చెప్పలేం. మాజీ ముఖ్యమంత్రి కామత్, ప్రస్తుత ప్రతిపక్ష నేత మైకేల్ లోబో బిజెపిలోకి వెళ్లిపోవడంతో కాంగ్రెస్ కు ఇప్పుడు అక్కడ నాయకత్వం లేకుండా పోయింది. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టి వారం తిరగకముందే గోవా లాంటి ఘటన ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ. ఆ యాత్ర మరిన్ని రాష్ట్రాల మీదుగా సాగుతుంది కాబట్టి.. ఇంకొన్ని దెబ్బలను కాంగ్రెస్ కాచుకోవాల్సి ఉంటుంది. అయితే గత నెలలో జార్ఖండ్లో ఆఖరి నిమిషంలో ఆగిన ఫిరాయింపులపై బిజెపి ఈసారి మరింత ఎక్కువ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. పార్టీ మారే నాయకులను రీకాల్ చేసే అవకాశం ఓటర్లకు లేనందువల్ల, తదనంతర ఎన్నికల్లో వారిని ఓడించి బుద్ధి చెప్పాలన్న చైతన్యం ఓటర్లలో రావాలి. అలా కాక సరసంలో, రాజకీయ సమరంలో అంత సమంజసమే అనుకుంటేనే కష్టం.. ఏ పార్టీ మీద గెలిచాము అన్నది ముఖ్యం కాదు.. అధికారంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం అన్న తీరుగా రాజకీయాలు తయారైతే.. ఎన్నికల ప్రజాస్వామ్యంలో అంతకుమించిన దరిద్రం ఇంకొకటి లేదు.