AP Deputy Speaker Kona Raghupathi: ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అమరావతి రాజధానికి మద్దతుగా రైతుల మహా పాదయాత్ర 2.0 జరుగుతున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాము అమరావతి ఏకైక రాజధాని నిర్మించలేమని జగన్ సర్కారు తేల్చిచెప్పింది. మూడు ప్రాంతాల అభివృద్ధే తమ ధ్యేయని చెప్పింది. అటు విపక్షాలు కూడా అంతే దీటుగా స్పందించాయి. ప్రభుత్వ వైఫల్యంగా ఆరోపించాయి. దీంతో అసెంబ్లీ సమావేశాలు హీటెక్కాయి. అంతటా చర్చనీయాంశంగా మారాయి. అయితే అధికార, విపక్ష నాయకుల మధ్య మాటలు తూటాలు పేలాయి. టీడీపీ సభ్యులను ఒక రోజుపాటు స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం అటు అధికార పక్షం సభను నడిపించింది. సీఎం కీలక ప్రసంగం చేశారు. అయితే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు రాజీనామా సమర్పించారు. వెనువెంటనే రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. శాసనసభ సమావేశాలు ఐదు రోజుల పాటు జరగనున్నందున కొత్తగా డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకునే అవకాశం ఉంది.
మంత్రివర్గ విస్తరణలో కొందరికే చాన్స్..
కొద్దినెలల కిందట మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. చాలా మందికి కొత్తవారికి మంత్రి పదవులు కేటాయించిన సంగతి విదితమే. అయితే అప్పట్లో సామాజిక సమీకరణల్లో భాగంగా కొన్నివర్గాల వారికి మంత్రి పదవులు దక్కలేదు. దీంతో వారికి ప్రభుత్వ నామినెట్ పదవుల్లో భర్తీ చేయవలసి వచ్చింది. ప్రధానంగా బ్రహ్మణ, వైశ్యులకు మంత్రి పదవులు దక్కలేదు. ఆయా వర్గాలను చల్లబర్చడానికి డిప్యూటీ స్పీకర్, చీప్ వీప్ వంటి పదవులను ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవిని వైశ్య సామాజికవర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామికి అప్పగించారు. అటు చీప్ వీప్ పదవిని గడికోట శ్రీకాంత్ రెడ్డిని తప్పించి ప్రసాదరాజును నియమించారు. అయితే ఇది జరిగి నాలుగు నెలలవుతున్నా డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి రఘుపతిని తప్పించలేదు. దీంతో సీఎం జగన్ స్వయంగా ఆదేశించడంతో రఘుపతి తప్పుకున్నారు. కోలగట్ల వీరభద్రస్వామిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఆ రెండు వర్గాలు దూరం కాకుండా…
ఎన్నికలకు దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో తనకు అండగా నిలబడిన వర్గాలు దూరం కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. గత ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజికవర్గం అండగా నిలిచింది. కానీ రెండు కేబినెట్లలో ఆ వర్గానికి మొండిచేయి చూపారు. అటు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేసినా గత ప్రభుత్వం మాదిరిగా కేటాయింపులు చేయడం లేదు. దీంతో ఆ వర్గంలో అసంతృప్తి నెలకొంది. అందుకే బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన మల్లాది విష్ణుకు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా నియమించారు. అలాగే తొలి కేబినెట్ లో వైశ్య సామాజికవర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాసరావుకు అవకాశమిచ్చారు. మలి విస్తరణలో మాత్రం తొలగించారు. అలాగని కొత్తవారికి అవకాశమివ్వలేదు. అందుకే ఆ వర్గాన్ని సముదాయించేందుకు విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వజూపారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో కోన రఘుపతి రాజీనామాతో కోలగట్లకు లైన్ క్లీయర్ అయ్యింది.