Pakistan- Masood Azhar: కాకి పిల్ల కాకికి ముద్దు. నల్లగా ఉందని లోకమంతా ఈసడించుకున్నా తల్లి కాకి లెక్క చేయదు. అలాగే ఉగ్రవాది కూడా ఉగ్రవాద దేశాలకే ముద్దు. బయట ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా పెద్దగా లెక్కచేయవు. అందుకే కదా పాకిస్తాన్లో దాక్కున్న ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా సీక్రెట్ ఆపరేషన్ తో మట్టు పెట్టింది. ఆల్ ఖయిదా చీఫ్ ఆల్ జవహరినీ హతమార్చింది. అయినప్పటికీ పాకిస్తాన్ తన తీరు మార్చుకోదు. పాకిస్తాన్ కంటే రెండు ఆకులు ఎక్కువే చదివిన ఆఫ్ఘనిస్తాన్ మాత్రం సుద్ధ పూసలాగా ఎందుకుంటుంది? తాను కూడా జైష్ – ఏ – మహమూద్ చీఫ్ మౌలానా మసూద్ కు స్థావరం ఇవ్వలేదని,అతడు తమ వద్ద లేడని చెబుతున్నది. పైగా తాలిబన్ల అధికార ప్రతినిధి జబీయుల్లా ముజాహిద్ ఆఫ్ఘనిస్తాన్ భూమిని ఇతర దేశాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇవ్వమని స్పష్టం చేస్తున్నాడు. ఒక అడుగు ముందుకేసి తప్పుడు ప్రకటనలు చేయవద్దని పాకిస్తాన్ ను హెచ్చరించాడు. అంతేకాకుండా అమెరికా వేసే ఎంగిలి మెతుకుల కోసం తాము ఆశపడబోమని పరోక్షంగా హెచ్చరికలు పంపాడు. కానీ అంతకుముందే మసూద్ ను అరెస్టు చేయాలని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోని తాళిబన్లకు లేఖ రాసింది. ఆఫ్ఘనిస్తాన్లోని నంగ్ రహార్ – కునార్ ప్రావిన్స్ లో మసూద్ ఉన్నాడని పాకిస్తాన్ సమాచారం కూడా ఇచ్చింది. వాస్తవానికి ఇక్కడ పాకిస్తాన్ శాంతి వచనాలు ఎందుకు వల్లిస్తోంది అంటే.. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందించడాన్ని ఆపకపోతే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ ను ప్రస్తుతం ఉన్న గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్టులోకి మార్చే అవకాశం ఉంటుంది. అప్పటి నుంచి పాకిస్తాన్ ఈ కొత్త నాటకానికి తెరదీసింది.
పాకిస్తాన్ పై ఓ కన్ను వేసి ఉంచుతోంది.
పారిస్ లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇది పాకిస్తాన్ పై చాలాకాలంగా కన్నేసి ఉంచుతోంది. అయితే పాకిస్తాన్లో భారీగా పెట్టుబడులు పెట్టిన చైనా.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ చర్యలకు అడుగడుగునా అడ్డుపడుతోంది. ఆఫ్ఘనిస్తాన్లోని నంగ్ రహార్ _ కునార్ ప్రావిన్స్ లో మసూద్ ఉన్నాడని పాకిస్తాన్ చెబుతున్నా.. ఆ దేశానికి చెందిన సోషల్ మీడియాలో అతడి పేరిట కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల మాదిరిగానే సాయుధ పోరు కొనసాగించి ప్రపంచాన్ని జయించాలని మసూద్ ముస్లింలకు పిలుపునిస్తున్నాడు. పైగా బాంబులు ఎలా తయారు చేయాలి, మనుషులను ఎలా చంపాలో వివరిస్తున్నాడు. అయితే మసూద్ ఆధ్వర్యంలో నడిచే ఉగ్రవాద, మత సంస్థలకు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయని పాకిస్తాన్లో ఇటీవల ఐదు రోజులపాటు పర్యటించిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించింది. వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేందుకే ఆఫ్ఘనిస్తాన్ కు లేఖ రాసింది. అసలు మసూద్ అనే వాడు పాకిస్తాన్లో లేడని, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాడని కొత్త నాటకానికి తెరతీస్తోంది. కానీ తాలిబన్లు మాత్రం మసూద్ తమ వద్ద లేడని చెబుతున్నారు.
పాకిస్తాన్ మామూలుది కాదు
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ను గతంలోనూ పాకిస్తాన్ బురిడీ కొట్టించింది. లష్కర్ ఏ తోయిబా కమాండర్ సాజిద్ మిర్ కు శిక్ష పడేలా చేసింది. నవంబర్ 26న ముంబైలో జరిగిన దాడుల్లో సాజిద్ మిర్ ను ద్రోహిగా పాకిస్తాన్ తేల్చేసింది. అయితే ఈ ఘటనపై భారత్ పలుమార్లు పాకిస్తాన్ కు లేఖలు రాసినా ఆ దేశం పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగిందో.. అప్పుడే తన పల్లవిని మార్చింది. కాశ్మీర్ సరిహద్దుల్లో నిత్యం రక్తాన్ని పారించే ఆ దేశం.. శాంతి సూత్రాలు వల్లించింది. ఇందులో భాగంగానే సాజిద్ ను ద్రోహిగా ప్రకటించి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సును బురిడీ కొట్టించింది. అయితే ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సును కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు పాకిస్తాన్ కొత్త నాటకం ఆడుతోందని భారత్ ఆరోపిస్తోంది.
ఇంతకీ ఎవరు ఈ మసూద్
మసూద్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 1994లో ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ అన్సార్ తో సంబంధాలు పెట్టుకుని మౌలానాగా మారాడు. తర్వాత శిక్షణ కేంద్రాల్లో పని చేశాడు. 1994 లోనే ఫేక్ గుర్తింపు కార్డుతో ప్రయాణిస్తూ జమ్ములోని శ్రీనగర్లో అరెస్టు అయ్యాడు. 1999లో నేపాల్ నుంచి న్యూఢిల్లీ కి వెళ్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని ఖాట్మండులో హైజాక్ చేసిన ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్కు తరలించారు. అనంతరం భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి మసూద్ ను, మరో ఇద్దరు ఉగ్రవాదులను విడిపించుకున్నారు. నేరుగా పాకిస్తాన్ వెళ్లిన మసూద్ కరాచీలో 10,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాడు. అంతేకాకుండా కాశ్మీర్ కు స్వాతంత్రం సంపాదించే దాకా ముస్లింలు నిద్రపోవద్దని, తుపాకులు చేత పట్టి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చాడు. 2000 సంవత్సరంలో జైష్ ఏ మహమ్మద్ సంస్థను ఏర్పాటు చేశాడు. 2001లో భారత పార్లమెంటుపై దాడిలో మాస్టర్ మైండ్ గా వ్యవహరించాడు. 2002లో పాకిస్తాన్లో డేనియల్ పెర్ల్ అనే పాత్రికేయుడిని చేశాడు. దీంతో మసూద్ ను అమెరికా బ్లాక్లిస్టులో పెట్టింది. 2019లో పుల్వామాలో భారత జవాన్లపై దాడి చేసిన కేసుకు సంబంధించి మసూద్ కీలక సూత్రధారి. నాటి ఘటనలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు. భారత్లో జరిగిన అనేక దాడులకు మసూద్ కీలక సూత్రధారిగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం భారత్ పై రగిలిపోతున్న పాకిస్తాన్ మసూద్ ను ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాడంటూ నాటకాలు ఆడుతోంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తనను బ్లాక్ లిస్టులో పెట్టకుండా ఉండేందుకు ఆఫ్గనిస్తాన్ కు లేఖ రాసింది. వేల ఇదే నిజం అనుకొని యాక్షన్ టాస్క్ ఫోర్స్ నమ్మితే.. మళ్లీ మసూద్ ను వెలుగులోకి తీసుకొచ్చి భారత్ లో దాడులకు ప్రణాళిక రూపొందిస్తుంది. అయితే గతంలో పాకిస్తాన్ తో ఒకసారి భంగపడ్డ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్.. ఈసారి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.