Bihar Election Result 2025: బీహార్ రాష్ట్రంలో పోటీ హోరాహోరీగా సాగింది. రాజకీయ నాయకులు నువ్వా నేనా అన్నట్టుగా విమర్శలు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి, ఎం జి టి పోటీలు పడి ఓటర్లకు తాయిలాలు ప్రకటించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయి.. వాస్తవానికి ఎన్నికల ముందు కాంగ్రెస్ చేసిన ప్రచారం బీహార్ లో ఈసారి ఎలాగైనా ప్రభుత్వం మారుతుందని సంకేతాలు ఇచ్చాయి. దీనికి తోడు పోలింగ్ శాతం కూడా పెరగడంతో చాలామంది విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మెజారిటీ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కాకపోతే డబుల్ సెంచరీ దిశగా ఎన్డీఏ కూటమి సీట్లు సాధిస్తుందని అంచనా వేయలేకపోయాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే బీహార్ రాష్ట్రంలో ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే గతానికంటే గొప్పగా.. తిరుగులేని స్థాయిలో ఎన్డీఏ కూటమి డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతోంది. చివరికి లాలు ప్రసాద్ యాదవ్ కుమారులు వెనుకబడి ఉన్నారంటే అక్కడి ఓటర్లలో ఏ స్థాయిలో ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్జేడి నిర్వహించిన సమావేశాలకు భారీగానే జనం వచ్చినప్పటికీ.. ఓటు మాత్రం వారు ఎన్డీఏ కూటమికే వేశారు. ప్రస్తుతం జరుగుతున్న లెక్కింపులో అన్ని రీజియన్లలో ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతోంది.. బీహార్ రాష్ట్రంలో ఆరు రీజియన్లను అత్యంత ప్రముఖంగా రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. బీహార్ చరిత్రలో కొన్ని సందర్భాల్లో మినహా మిగతా సార్లు ఏ రాజకీయ పార్టీ కూడా ఆరు రీజియన్లలో అద్భుతమైన విజయాన్ని సాధించలేదు. అయితే ఈసారి గత చరిత్రను ఎన్డీఏ కూటమి తిరగరాస్తోంది. సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది.
బీహార్ రాష్ట్రంలో మొత్తం ఆరు రీజియన్లు ఉన్నాయి. ఇందులో అంగ ప్రదేశ్ లో 27 స్థానాలు ఉన్నాయి. ఇందులో 23 స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. పూర్తిస్థాయి ఫలితాలు వస్తే ఇంకా కొన్ని స్థానాలు ఎన్డీఏ కూటమికి పెరుగుతాయి.
బోజ్ పూర్ ప్రాంతంలో 46 సీట్లు ఉన్నాయి. ఇందులో 32 సీట్లలో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. ఇంకా తుది ఫలితం గనుక వెళ్లడైతే ఈ సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మగధ ప్రాంతంలో 47 సీట్లు ఉన్నాయి. ఇక్కడ 35 స్థానాలలో ఎన్డీఏ కూటమి దాదాపు పాగా వేసినట్టే. మిగతా స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమి నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతోంది. ఈ లెక్కన చూసుకుంటే ఇంకా కొన్ని స్థానాలు ఎన్డీఏ ఖాతాలో జమ అవుతాయి.
మిధిలాంచల్ ప్రాంతంలో మొత్తం 50 సీట్లు ఉన్నాయి.. ఇందులో 40 స్థానాలను ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. ఇక్కడ ఎం జి టి నుంచి కాస్త పోటీ ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ అభ్యర్థుల ముందు వారు నిల్వలేక పోతున్నారు.
సీమాంచల్ ప్రాంతంలో 24 సీట్లు ఉన్నాయి. ఇందులో 20 సీట్లను ఎన్డీఏ కూటమి అభ్యర్థులు దక్కించుకున్నారు. మిగతా నాలుగు స్థానాల్లో కూడా తీవ్రమైన పోటీ ఇస్తున్నారు. ఇంకా కొన్ని రౌండ్లు లెక్కించాల్సి ఉన్న నేపథ్యంలో.. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఉంది.
తిరుహుత్ ప్రాంతంలో 49 సీట్లు ఉన్నాయి. ఇందులో 41 స్థానాలను బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. మిగతా 8 స్థానాలలో ఎం జి టి అప్పర్ హ్యాండ్ లో ఉంది. అయితే ఈ ట్రెండ్ గనుక ఇలానే కొనసాగితే ఈ ఎనిమిది స్థానాలు మాత్రమే ఎం జి టి కి దక్కుతాయి. ఒకవేళ తదుపరి రౌండ్లలో పరిస్థితి మారితే ఇవి కూడా ఎన్డీఏ ఖాతాలోకి చేరిపోతాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 191 స్థానాలను ఎన్డీఏ కూటమి గెలిచినట్టే. 48 స్థానాలలో ఎం జి టి ముందు వరుసలో ఉంది. నాలుగు స్థానాలలో ఇతరులు ముందు వరుసలో ఉన్నారు.