Bengaluru Water Crisis: సీఎం ఇంట్లోనూ నీటి కరువే.. దానికోసం నీళ్లు వాడితే.. ఐదు వేలు కట్టాల్సిందే..

తుంగభద్ర, నారాయణ పూర్, ఆల్మట్టి, కావేరి వంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కర్ణాటక రాష్ట్రం తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బెంగళూరు ప్రాంతం కనివిని ఎరుగని స్థాయిలో నీటి కరువును చవిచూస్తోంది.

Written By: Velishala Suresh, Updated On : March 9, 2024 8:34 am

Bengaluru Water Crisis

Follow us on

Bengaluru Water Crisis: అది 2019.. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్ల ద్వారా ఆ ప్రాంతానికి నీటిని పంపించింది. అలా నీటిని పంపే క్రమంలో ఆ రైల్లో ప్రత్యేక పోలీసులను నియమించింది. Water is precious అని గోడల మీద రాసి ఉంటే చదువుతుంటాం కదా.. ఆ నీరు ఎంత విలువైందో ఆ ఏడాది లాతూర్ వాసులకు అర్థమైంది. ఇక అప్పట్నుంచి ఇప్పటిదాకా వారు తాగునీటిని అత్యంత జాగ్రత్తగా వాడుతున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన అంటే.. దేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరులో దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది కాబట్టి. తన ఇంట్లో బోరు కూడా ఎండిపోయిందని, నీటి కోసం తాము కూడా ఇబ్బంది పడుతున్నామని ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు అంటే.. అక్కడ నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో అవగతం చేసుకోవచ్చు.

వర్షాలు కురవకపోవడంతో..

తుంగభద్ర, నారాయణ పూర్, ఆల్మట్టి, కావేరి వంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కర్ణాటక రాష్ట్రం తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బెంగళూరు ప్రాంతం కనివిని ఎరుగని స్థాయిలో నీటి కరువును చవిచూస్తోంది. గత ఏడాది వర్షాలు సరిగా కురువకపోవడం.. ఉన్న చెరువులు కబ్జాకు గురి కావడంతో బెంగళూరు ప్రాంతం నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతోంది. ఐటీ రాజధానిగా పేరుపొందిన ఆ ప్రాంతంలో నీళ్ల కోసం అక్కడి ప్రజలు పానీ పట్టు యుద్ధాలు చేస్తున్నారు. ఈ తరుణంలో అక్కడి ప్రభుత్వం నీటి సంక్షోభ నివారణకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బెంగళూరు నగరంలో కారు వాషింగ్, ఉద్యాన నిర్వహణ, భవన నిర్మాణ పనులు, వాటర్ ఫౌంటెన్ లకు తాగునీటిని వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పై పనులకు తాగునీరు ఉపయోగించకుండా నిషేధం విధించింది.

ఐదువేల అపరాధ రుసుం

ఒకవేళ ఎవరైనా ప్రభుత్వం విధించిన నిబంధన ఉల్లంఘిస్తే 5000 ఫైన్ వసూలు చేస్తామని కర్ణాటక నీటి సరఫరా, మురుగునీటి బోర్డు సంస్థ ప్రకటించింది. బెంగళూరు ప్రాంతంలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. వేలాది బోర్లు ఎండిపోయాయి. గత ఏడాది సరిగ్గా వర్షాలు కురవకపోవడంతో కర్ణాటక రాజధాని లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు నగరంలోని కుమార్ కృపా రోడ్డులో నివాసం ఉంటారు. ఆయన నివాసం ఉన్న భవనంలోనూ వాటర్ ట్యాంకులు కనిపిస్తున్నాయి. అంటే దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏ స్థాయిలో నీటి ఎద్దడి ఉందో..