Ballari Fake Lakshmi Pooja Case:5.6 అడుగుల ఎత్తున్న అమ్మాయిలు మాత్రమే కావాలి. వారి వంటి మీద పుట్టుమచ్చలు ఉండకూడదు. ఎటువంటి గుర్తులు ఉండకూడదు. అందంగా ఉండాలి. శరీర సౌష్టవం చూడగానే కైపు కలిగించే విధంగా ఉండాలి. ఇటువంటి అమ్మాయిలు కోసం వారు వేట సాగించారు. దీనికోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. చివరికి వారు అనుకున్న పని చేశారు. కానీ ఆ తర్వాత అసలు కథ బయటపడింది.
కర్ణాటకలోని బళ్లారిలో ఒక నేర వ్యవహారం వెలుగు చూసింది. ఇది సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. లక్ష్మి పూజ చేస్తే ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుందని నమ్మించింది ఒక ముఠా. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న యువతలను లక్ష్యంగా చేసుకుంది. చివరికి పూజ పేరుతో వారిని లైంగికంగా వేధింపులకు గురిచేసింది. బ్లాక్ మెయిల్ చేస్తూ ఒక రొంపిలోకి నెట్టింది. ఈ వ్యవహారంలో బళ్లారి పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. నలుగురు అమ్మాయిలను రక్షించారు. మహిళా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దాదాపు రెండు నెలలపాటు అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్ చేపట్టింది.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పెళ్లికాని మహిళలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంది. ప్రత్యేకమైన లక్ష్మీ పూజ చేస్తే భారీగా డబ్బులు వస్తాయని నమ్మించింది. పూజ ద్వారా వచ్చే డబ్బులతో సదరు మహిళలకు వాటా.. పూజ నిర్వహించే స్వామీజీలకు వాటా.. యువతులను తీసుకొచ్చిన ఏజెంట్లకు వాటా ఇస్తామని ఈ ముఠా సభ్యులు ఆశపెట్టేవారు.. ముఖ్యంగా పెళ్లికాని మహిళలనే వారు లక్ష్యంగా చేసుకునేవారు. సుమారు 5.6 అడుగుల ఎత్తు ఉండాలని కోరేవారు. శరీరం మీద ఎటువంటి మచ్చలు.. గుర్తులు ఉండకూడదని చెప్పేవారు. యువతుల ఫోటోలను సేకరించేవారు. వ్యక్తిగత వివరాలను కనుక్కునేవారు. ముఖ్యంగా కుడి చేయి.. కుడికాలు ఫోటోలను ప్రత్యేకంగా పంపించాలని అడిగేవారు.
మహిళలను ఎంపిక చేసిన తర్వాత అసలు వ్యవహారాన్ని మొదలుపెట్టేవారు. పూజలో భాగంగా వారి దేహం మీద ఉన్న దుస్తులు తొలగించేవారు. చాటుమాటుగా ఫోటోలు.. వీడియో తీసేవారు. ఆ తర్వాత వాటిని బయటపెడతామని బెదిరించేవారు. ఆ మహిళలను దారుణంగా వేధించేవారు. చెప్పుకోలేని పని చేయాలని బలవంతంగా అందులోకి నెట్టేవారు. కొంతమంది మహిళలను ఇతర ప్రాంతాలకు కూడా పంపించారు. అయితే ఈ వ్యవహారంలో కొంతమంది బాలికల ఫోటోలు కూడా లభించడంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇముట కార్యకలాపాలపై సమాచారం లభించడంతో బళ్లారి పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మహిళ పోలీసులతో కూడిన అక్క పాడే బృందం రంగంలోకి దిగింది. ఈ బృందంలో ఉన్న మహిళా పోలీసులు సాధారణ మహిళ మాదిరిగా మారువేశాలు ధరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిగా నటించారు. ముఠా సభ్యులను సంప్రదించారు. దాదాపు 45 రోజులపాటు రహస్యంగా సమాచారాన్ని సేకరించారు. మొత్తం మీద రెండు నెలల తీవ్రమైన నిఘా తర్వాత ముఠా కార్యకలాపాలను గుర్తించి వారి గుట్టు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు మహిళలను రక్షించారు. అయితే ఈ కేసు కేవలం బళ్లారికి మాత్రమే పరిమితం కాలేదు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ముఠాకు బళ్ళారి.. మైసూరు.. చిక్క మంగళూరు. విజయపుర.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం ప్రాంతాలలో సంబంధాలు ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలను ఇతర ప్రాంతాలకు కూడా ఈ ముఠా సభ్యులు తరలించారు. ముఠా సభ్యులు తమ మధ్య జరిగే సంభాషణలలో మీడియా.. పేపర్.. డిఆర్ వంటి కోడు పదాలను ఉపయోగించేవారు.
అయితే ఈ ముఠా వెనక గోవిందమ్మ అనే మహిళతోపాటు మరికొందరు ఉండాలని తెలుస్తోంది. మొత్తంగా 16 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. 11 మందిని అరెస్ట్ చేశారు. డిఆర్ అనే కోడ్ ఉపయోగించిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. ఈ ముఠా సాగించిన వ్యవహారాల వెనుక ఉన్న స్వామీజీ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు.