Ayodhya Temple: రామ మందిర ప్రతిష్ట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 జనవరి 22న కార్యక్రమం వేడుకగా జరగనుంది. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెయ్యికి పైగా రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మరోవైపు కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావొద్దని రామ మందిరం ట్రస్ట్ వర్గాలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. అయోధ్యకు వచ్చే బదులు భక్తులు తమ సమీపంలోని మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని సూచించాయి.
అయోధ్య వచ్చే భక్తుల కోసం సాధారణ భోజనం, నిద్రించడానికి స్థలం, విడిది కేంద్రాల వంటి కనీస వసతులను అందుబాటులో ఉంచేందుకు యూపీ ప్రభుత్వంతో పాటు రామ మందిరం ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు విగ్రహాల పవిత్ర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తేదీ సమీపిస్తున్న కొలది.. అయోధ్య ప్రధాన పర్యాటక కేంద్రంగా మారుతోంది. అటు నగరంలో ఆస్తుల ధరలు గణనీయంగా పెరిగాయి. వ్యాపారాలు జోరందుకుంటున్నాయి. కొత్తగా వ్యాపార సంస్థలు పెరుగుతున్నాయి.
Also Read: కేసీఆర్ ఆర్థిక అరాచకత్వాన్ని బయటపెట్టిన శ్వేతపత్రం
రామ మందిర ప్రతిష్ట వేడుకలకు దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. దీనిని ముందుగానే గుర్తించిన యూపీ ప్రభుత్వంతో పాటు రామ మందిర ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అయోధ్యకు వెళ్లే రూట్లలో.. ఆలయమార్గాలను సులువుగా తెలుసుకునేందుకు వీలుగా దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో ప్రత్యేక సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ కేంద్రాల వద్ద సైతం ప్రాంతీయ భాషలతో బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు అయోధ్యలోని పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఎక్కడెక్కడ వాహనాల ప్రవేశం నిషేధించినది, అనుమతులు ఉన్నది ఎక్కడికక్కడే బోర్డులు పెడతామని అధికారులు చెబుతున్నారు. గత అనుభవాల దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ ఏర్పాట్లతో అయోధ్యలో దక్షిణాది రాష్ట్రాల భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా దోహదపడే అవకాశం ఉంది.