Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేశారు. అందులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత వంటి వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వేగవంతం చేశారు.. ఇది ఇలా ఉండగానే ఢిల్లీ జలబోర్డ్ లో అక్రమాలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు పంపారు.. గతంలోనూ ఇదే విధంగా చేసినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి విచారణకు హాజరు కాలేదు..ఈ సమన్ల పై ఆప్ స్పందించింది. అలా ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించింది.. కేంద్రంలోని బిజెపి పెద్దలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను వేధిస్తున్నారని ఆరోపించింది. దీనికోసం ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాన్ని వాడుకుంటుందని విమర్శించింది.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అరెస్ట్ కూడా తప్పదని చాలామంది వ్యాఖ్యానించారు. ఈ కేసులో అరవింద్ కు ఢిల్లీ రౌస్ అవన్నీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. దీంతో అతనికి ఉపశమనం లభించినట్టేనని అందరూ భావించారు. కానీ ఈలోపు ఢిల్లీ జలబోర్డ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులకు సమాధానం ఇవ్వనని ఢిల్లీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఢిల్లీ జల బోర్డు మాత్రమే కాకుండా లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ కు 8 సార్లు నోటీసులు జారీ చేశారు. తొమ్మిదవ సారి కూడా నోటీసులు అందించారు. ఈనెల 21న విచారణకు రావాలని అందులో కోరారు. అయితే ఈసారి విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి వెళ్తారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ విచారణకు తన వెళితే అరెస్టు చేసే అవకాశం ఉందని అనుమానంతోనే అరవింద్ మిన్న కుంటున్నారు. తాజాగా ఆయనకు కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఈసారి విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కోర్టు కేవలం బెయిల్ మాత్రమే మంజూరు చేసింది. విచారణకు పిలవద్దని ఎన్ ఫోర్స్ అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో తొమ్మిదో సారి నోటీసులపై అరవింద్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.