Ram Mandir: అయోధ్యలో అపూర్వ ఘట్టానికి మరికొన్ని గంటలే ఉంది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నుంచి ఆహ్వానాలు అందుకున్న భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇక సీతాసమేత రాముడు అయోధ్యకు చేరుకునే అపూర్వ ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడలేని వారు. టీవీలు, సిల్వర్ స్క్రీన్లపై చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేశమంతటా పెద్దపెద్ద డిజిటల్ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అతిథులతోపాటు మిగిలిన వారు కూడా ప్రత్యక్షంగా వీక్షించేందుకు కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
మీడియా సెంటర్..
అయోధ్యధామ్‌లో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామ్ కథా సంగ్రహాలయ్ వద్ద మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు దూరదర్శన్(డీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం దూరదర్శన్ అయోధ్యలోని రామ మందిరం చుట్టుపక్కల 40 కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం డీడీ నేషనల్, డీడీ న్యూస్ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
రైల్వే స్టేషన్లలో..
ఇక రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకలను దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో వీక్షించేలా భారతీయ రైల్వే ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఆయా రైల్వే స్టేషన్లలో తొమ్మిది వేల స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ఆ స్క్రీన్లపై అపూర్వ వేడుకను తిలకించే అవకాశం ఉంది.
న్యూయార్క్‌లో..
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రసిద్ధ టైమ్ స్వేర్‌లోనూ అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. వివిధ భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో కూడా ఈ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. 2020, ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసినప్పుడు కూడా టైమ్స్ స్క్వేర్‌లోని డిజిటల్ బోర్డుపై డిస్‌ప్లే చేశారు.
23న కూడా ప్రత్యక్ష ప్రసారం..
జనవరి 23న కూడా దూరదర్శన్‌లో రామ్ లల్లా ప్రత్యేక హారతితోపాటు సాధారణ పౌరుల కోసం ఆలయం తెరవడాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రధాన ఆలయ సముదాయం మాత్రమే కాకుండా సరయూ ఘాట్ సమీపంలోని రామ్‌కి పైడి, కుబేర్, తిల దగ్గర ఉన్న జఠాయువు విగ్రహం, ఇతర ప్రదేశాల నుంచి కూడా దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాలు చేయనుంది.
4కె టెక్నాలజీతో..
దూరదర్శన్‌తోపాటు పలు ప్రైవేటు చానెళ్లు కూడా దూరదర్శన్ నుంచి ఫీడ్‌ను అందుకుంటాయని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. దూరదర్శన్ ఈ కార్యక్రమాలను 4కె టెక్నాలజీ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయనుంది. ఫలితంగా ప్రేక్షకులకు హై క్వాలిటీ పిక్చర్‌ను చూడగలుగుతారు.