Gautam Adani:వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడైనా సరే దండిగా ముక్కలు పడతాయి. ఈ సామెతను మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు. పైవాడు మనవాడు అయితే.. ఎలాగైనా ఎగరొచ్చు.. ఇంకెలాగైనా దూకొచ్చు. ఆధునిక కాలంలో ఈ సామెతను నిజం చేసి చూపిస్తున్నారు ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదాని. ఇప్పటికే ఈ కంపెనీకి సంబంధించి అనేక రకాల అభియోగాలు.. ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ సంస్థకు సంబంధించి మరొక వివాదం వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయం బయటపడింది.
అదాని గ్రీన్ ఎనర్జీ సంస్థ 5675 కోట్ల ఖర్చుతో మహారాష్ట్రలో ఒక ప్రాజెక్టును దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అక్కడి అభయారణ్యంలో పులుల సంరక్షణ కోసం నాలుగు శాతం చెల్లించాల్సి వచ్చింది. దీంతో ఆదాని సంస్థ ప్రాజెక్టు విలువను పూర్తిగా వంద వంతుకు తగ్గించి చూపించింది. ఈ విషయాన్ని జాతీయ మీడియా పసిగట్టింది. తన ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ద్వారా మొత్తాన్ని బయటపెట్టింది.
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో తారాళి డ్యాం రిజర్వాయర్ మీద 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును నిర్మించేందుకు అదాని సంస్థ ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చాయి. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చే క్రమంలో గత ఏడాది ఫిబ్రవరి 11న ఒక లేఖ రాసింది. అందులో ప్రాజెక్టు ఖర్చును 5,675 కోట్లు అని స్పష్టంగా పేర్కొంది. మహారాష్ట్ర పర్యావరణ శాఖ అనుమతులకు సంబంధించి అదాని సంస్థకు 15 షరతులు విధించింది. ఈ షరతులలో భాగంగా అదాని సంస్థ వన్యప్రాణి సంరక్షణ కోసం దాదాపు నాలుగు శాతం నిధులను ప్రాజెక్టు వ్యయం లో ఖర్చు పెట్టాలి. అంటే 227 కోట్లను సహ్యాద్రి టైగర్ రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. దీనికి సంబంధించి మార్చిలో మహారాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం శ్రీనివాస్ రెడ్డి అదానీ సంస్థకు సూచించారు. అయితే ఆయన విజ్ఞప్తికి ఈ ఏడాది సెప్టెంబర్ 8న ఆదాని గ్రీన్ ఎనర్జీ ఒక నోటరీ సమర్పించింది. దాని ప్రకారం ప్రాజెక్టు ఖర్చును అనలాగ్ ఎస్టిమేషన్ విధానంలో వేశామని, వాస్తవానికి ప్రాజెక్టు ఖర్చు కేవలం 56.75 కోట్లు మాత్రమేనని అందులో స్పష్టం చేసింది.
వాస్తవానికి అనలాగ్ ఎస్టిమేషన్ అనేది గతంలో ఒక ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారో దాని ఆధారంగా వేసే ఒక లెక్క ఆదాని సంస్థ దాఖలు చేసిన కొత్త అఫిడవిట్ ను అక్టోబర్ 12న శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ప్రాజెక్టు ఖర్చు 56.75 కోట్లలో నాలుగు శాతం అంటే 2.27 కోట్లు మాత్రమేనని, అందులో నాలుగోవంతు అంటే 56.75 లక్షలు వెంటనే సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఖాతాలో డిపాజిట్ చేయాలని సూచించారు. మిగతా మొత్తాన్ని నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ నుంచి ఈ ప్రాజెక్టుకు అనుమతి లభించిన తర్వాత చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అదానీ సంస్థ నాలుగో వంతు సొమ్మును ఖాతాలో జమ చేసింది. అయితే ప్రాజెక్టు విలువను తప్పుగా చూపించారని సతారా జిల్లాకు చెందిన హానరర్ వైల్డ్ లైఫ్ వార్డెన్ రోహన్ దాటే ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కొయినా వైల్డ్ లైఫ్ డిప్యూటీ డైరెక్టర్ కు నవంబర్ 5న ఆదేశాలు వచ్చాయి. నవంబర్ 6న కేంద్ర పర్యావరణ శాఖ కూడా దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ అభియోగాల మీద అదానీ గ్రూప్ స్పందించింది. ఇదంతా తప్పు అని ప్రకటించింది.