Ayodhya Ram Mandir: 80వ దశకములో రామాయణం ధారావాహికం గుర్తుంది కదా? ఆ రోజుల్లో జాతీయ దూరదర్శన్ ఛానల్ లో ప్రసారమైన ఈ సీరియల్ బహుళ ప్రాచుర్యం పొందింది. 1987- 88 మధ్య ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ గా గుర్తింపు పొందింది. 82% వీక్షకులతో రికార్డ్ సృష్టించింది. ఐదు ఖండాల్లో.. 17 దేశాల్లో.. 20 వేరువేరు ఛానళ్లలో ప్రసారం చేయబడింది. బిబిసి గణాంకాలు ప్రకారం ఈ సీరియల్ ను 650 మిలియన్లకు పైగా ప్రేక్షకులు చూసినట్లు తెలుస్తోంది.
ఈ సీరియల్ నేషనల్ దూరదర్శన్ ఛానల్ కు కాసుల వర్షం కురిపించింది. ప్రతి ఎపిసోడ్ కు రూ. 40 లక్షలు ఆదాయం వచ్చినట్లు బిబిసి నివేదించింది. సాగర్ ఆర్ట్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సీరియల్ ఇప్పటికీ రికార్డ్. రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికాలియా నటించారు. సునీల్ లహరి, అరవింద్ త్రివేది, ధారా సింగ్ లు సైతం తమ నటనతో మెప్పించారు. ఈ సీరియల్ కి డైరెక్టర్ రామానంద్ సాగర్ కాగా.. స్వరకర్తగా రవీంద్ర జైన్.. నిర్మాతలుగా రామానంద సాగర్, ఆనంద సాగర్, మోతి సాగర్ వ్యవహరించారు. రాముడి పాత్రలో అరుణ్ గోవిల్ ఒదిగిపోయారు. అప్పట్లో ఆయన్ను కలియుగ రాముడిగా అభివర్ణించేవారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు.
ఈ సీరియల్ ఈ స్థాయిలో గుర్తింపు పొందిందో ఇప్పటి తరానికి తెలియదు. కానీ తాజాగా అయోధ్య రామ మందిరం ప్రతిష్ట వేడుకలకు ఈ సీరియల్ యూనిట్ సభ్యులకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈనెల 22న బాల రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానించారు. అందులో భాగంగా అలనాటి రామాయణం సీరియల్ యూనిట్ సభ్యులను ఆహ్వానించడం చూస్తుంటే.. వారికి ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో అర్థమవుతుంది.