2025 Year Review: క్యాలెండర్ పేజీల సాక్షిగా 2025 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. కోటి ఆశలతో.. కొత్త ఊసులతో 2026 ప్రవేశించనుంది. సాధారణంగా కొత్త ఏడాది వస్తోంది అంటే కచ్చితంగా పాత ఏడాది గురించి చర్చ ఉంటుంది. పైగా పాత ఏడాదిలో జరిగిన విషయాల గురించి నెమరువేత కూడా ఉంటుంది. 2025 కాలగర్భంలో కలిసిపోతున్న నేపథ్యంలో.. ఆ ఏడాది జరిగిన అద్భుతాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే….
2025లో రిలయన్స్ కంపెనీ కి పట్టిందల్లా బంగారమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 21 లక్షల కోట్లకు చేరుకుంది. తద్వారా కార్పొరేట్ ప్రపంచంలో అతిపెద్ద సంస్థగా రిలయన్స్ ఎదిగింది. రిలయన్స్ తర్వాత 16 లక్షల కోట్లతో హెచ్డిఎఫ్సి, 12 లక్షల కోట్లతో భారతీ ఎయిర్టెల్, 11 లక్షల కోట్లతో టిసిఎస్ తర్వాతి స్థానాలలో ఉన్నాయి.
ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి అన్ని సామాజిక మాధ్యమాలను కలుపుకొని.. అత్యధిక అనుచరులు ఉన్న వ్యక్తిగా ఫుట్ బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రోనాల్డో రికార్డు సృష్టించాడు. ఇతడికి 102 కోట్లమంది ఫాలోవర్స్ ఉన్నారు. మనదేశంలో విరాట్ కోహ్లీ కి 39 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 35 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఈ ఏడాది చాలా సినిమాలు విడుదలైనప్పటికీ.. టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమా మాత్రం బంపర్ విజయాన్ని అందుకుంది. కేవలం ఏడు కోట్లతో నిర్మించిన ఈ సినిమా 92 కోట్ల లాభాలను సాధించింది. ఈ సినిమాకు సున్నితమైన హాస్యాన్ని జోడించారు.. అదే సమయంలో వలస వాసులు పడే ఇబ్బందులను కూడా ప్రధానంగా ప్రస్తావించారు.
ఇక 2025లో మనదేశంలో సగటున ఒక యూజర్ నెలకు 21జిబి డేటాను వాడారు. తద్వారా ప్రపంచంలో అత్యధికంగా మొబైల్ డేటా వినియోగిస్తున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.
ఈ ఏడాది కాలుష్యంపై మన దేశం యుద్ధం మొదలుపెట్టింది. ఇంధనంతో నడిచే వాహనాలను సాధ్యమైనంతవరకు పక్కన పెట్టి.. ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేసింది. అదే కాదు కాలుష్యాన్ని విలువరించే ట్రెడిషనల్ ఫ్యూయల్ వినియోగాన్ని తగ్గించుకుంది. అంతేకాదు పునరుత్పాదక ఇంధనం వైపు అడుగులు వేస్తోంది. ఇక ఈ ఏడాది భారత్ 260 గిగా వాట్ల రెన్యువల్ ఎనర్జీ సాధించింది. ఇందులో సోలార్ పవర్ వాటా 132 గిగావాట్లు.
మనదేశంలో భారతీయ సీఈఓల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అయితే ఈ ఏడాది ఫార్చ్యూన్ 500 జాబితాలో దాదాపు 11 మంది భారతీయ సీఈవోలు స్థానం సంపాదించారు. వీరంతా కూడా 65 లక్షల కోట్ల సంపదను సృష్టించారు.
ప్రపంచ జనాభా 2025వ సంవత్సరంలో 826 కోట్లకు చేరుకుంది.. ఇందులో భారతదేశం జనాభా 146 కోట్లు. ఈ ప్రకారం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరు భారతదేశానికి చెందిన వారే.
ఈ ఏడాది మన దేశంలో అంతర్జాలంలో వ్యాపార లావాదేవీలు చేసిన వారి సంఖ్య 34 కోట్లు. ఈ ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరు అంతర్జాలంలో లావాదేవీలు కొనసాగిస్తున్నట్టు లెక్క.
ఇటీవల గూగుల్ నానో బనానా అనే ఆర్టిఫిషియల్ టూల్ ను తెరపైకి తీసుకొచ్చింది. మనం ఒక ఫోటోను కనుక ఇస్తే దానిని 3d బొమ్మలాగా మార్చేస్తుంది. ఈ టూల్ వాడుకొని దాదాపు నెటిజన్లు 50 కోట్ల దృశ్యాలను రూపొందించారు. తద్వారా గూగుల్ యూజర్ల సంఖ్య ఏకంగా 65 కోట్లకు పెరిగింది.
ఈ ఏడాది మనదేశంలో మహిళా ఉద్యోగులు విపరీతంగా సంపాదించారు. 16 కోట్ల మంది మహిళా ఉద్యోగులు ఏకంగా 31 లక్షల కోట్లను సంపాదించారు. ఇది ఒక రకంగా ప్రపంచ రికార్డు.
మనదేశంలో ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహా కుంభమేళా జరిగింది. 45 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవానికి 66 కోట్ల మంది హాజరయ్యారు. ప్రభుత్వం మూడు వేల ప్రత్యేక రైళ్లను, వేల సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసింది. మూడు లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. కేవలం ఒక రైల్వే శాఖ నే దాదాపు 17వేల కోట్ల రూపాయల ఆదాయం సొంతం చేసుకుంది.,8 లక్షల మందికి తాత్కాలికంగా ఉపాధి లభించింది.