Largest Landowner: వందల ఎకరాల భూమి.. విలువైన ఆస్తులు.. కిలోల కొద్ది బంగారం.. పదులకొద్ది భవనాలు.. వెనుకటి రోజుల్లో ఎవరైనా జమిందార్ గురించో ఊరి పటేల్ గురించో చెబుతున్నప్పుడు పై మాటలను ఉపోద్ఘాతంగా వాడేవారు. ప్రభుత్వం భూ గరిష్ట పరిమితి చట్టం తీసుకు వచ్చిన తర్వాత ఇలా వందల ఎకరాల భూమిని పెద్ద పెద్ద భూస్వాములు తమ బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల చేతుల్లో ఈ తరహాలోనే భూములు ఉన్నాయి. ఆ భూముల వివరాలను పెద్దగా బయటపడనీయరు. ఒకవేళ బయటపడినా పెద్దగా చర్యలు తీసుకోరు. కానీ మనదేశంలో ఒక బోర్డ్ చేతిలో పదిహేడు కోట్ల ఎకరాల భూమి ఉందన్న సంగతి మీకు తెలుసా.. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇటీవల ఈ వివరాలు బయటకు వచ్చాయి. ఆ బోర్డుకు ప్రతి రాష్ట్రంలో భూములు ఉన్నాయి. ఇంతకీ ఏమిటి ఆ బోర్డ్.. ఆ స్థాయిలో భూములు ఎందుకు ఉన్నాయో.. ఈ కథనంలో తెలుసుకుందాం.
వాస్తవానికి మనదేశంలో అత్యంత సంపన్నమైనది వక్ఫ్ బోర్డు అనుకుంటాం. కానీ కాదే కాదు.. ప్రభుత్వం తర్వాత అత్యధిక భూమిని కలిగి ఉన్న బోర్డు కేథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వ భూ విభాగం ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా ఫిబ్రవరి 2021 నాటికి భారత ప్రభుత్వం 15వేల 531 చదరపు కిలోమీటర్ల భూమిని కలిగి ఉంది. ఇందులో మొత్తం 116 ప్రభుత్వరంగ సంస్థలు, 51 మంత్రిత్వ శాఖలు ఆ భూమిని వినియోగించుకుంటున్నాయి. ఇక ఇదే సమయంలో క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఏడు కోట్ల హెక్టార్లు అంటే 17.29 కోట్ల ఎకరాల భూమిని కలిగి ఉంది. భూముల్లో చర్చిలు, కళాశాలలు, పాఠశాలలు, ఆసుపత్రులు, అనేక భవనాలు ఉన్నాయి. వీటి విలువ మొత్తం 20వేల కోట్లుగా ఉంది.
1947కు ముందు భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నది. సుమారు 200 సంవత్సరాలు పాటు “రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం” లాగా వారు మన దేశాన్ని పాలించారు. బ్రిటిష్ పరిపాలన కాలంలో క్యాథలిక్ చర్చి బోర్డు కు ఎక్కువ భూమి కేటాయించారు. బ్రిటిష్ పరిపాలన కాలంలో 1927లో ఇండియన్ చర్చి చట్టాన్ని తీసుకొచ్చారు. ఫలితంగా క్యాథలిక్ చర్చి బోర్డుకు దేశం మొత్తం భూమి కేటాయించారు. ఈ భూములకు సంబంధించి ఇప్పటికీ వివాదాలున్నాయి. బలవంతంగా భూమిని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ భూములకు సంబంధించి పర్యవేక్షణను పోప్ ఫ్రాన్సిస్ చూస్తున్నారు. క్యాథలిక్ చర్చి క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ భూముల నిర్వహణ కొనసాగుతోంది. ఇక ఆ సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం 2012లో భారత దేశంలో 2457 ఆసుపత్రుల డిస్పెన్సరీలు, 240 వైద్య, నర్సింగ్ కాలేజీలు, 28 సాధారణ కాలేజీలు, 5 ఇంజనీరింగ్ కాలేజీలు, 3765 మాధ్యమిక పాఠశాలలో, 7319 ప్రాథమిక పాఠశాలలు, 3187 నర్సరీ స్కూళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కేథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా కింద కొనసాగుతున్నాయి.
బ్రిటిష్ వారు నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత 1965లో భారత ప్రభుత్వం ఒక సర్క్యూలర్ జారీ చేసింది. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం లీజుకి ఇచ్చిన ఏ భూమినీ గుర్తించబోమని ప్రకటించింది. అయినప్పటికీ ఆదేశాలను కేథలిక్ చర్చి బోర్డు పాటించడం లేదు. ఫలితంగా ఈ భూములకు సంబంధించి వివాదాలు పరిష్కారం కావడం లేదు. తమకు మళ్లీ అధికారం ఇస్తే గొప్ప గొప్ప మార్పులు చేపడతామని చెప్పిన నరేంద్ర మోడీ ప్రభుత్వం..మూడో టర్మ్ లోనైనా ఈ భూముల వివాదాలను పరిష్కరిస్తుందో చూడాల్సి ఉంది.