11 Parties Neutral : దేశంలో రాజకీయ పునరేకీరణ వేగవంతమైంది. అధికార పక్షాలన్నీ ఎన్డీయేగా, విపక్షాలన్నీ ఇండియా అలియాస్ యూపీఏగా జట్టు కట్టాయి. ఈ రెండు కూటముల్లో ప్రస్తుతం 65 పార్టీలున్నాయి. ఇండియా కూటమిలో 26 పార్టీలున్నాయి. ఎన్డీయేలో 39 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. అయితే 91 మంది ఎంపీలున్న 11 పార్టీలు ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీ, తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితి, ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ ప్రధానమైనవి. ఈ నాలుగు పార్టీలకు 3 రాష్ట్రాల్లో 63 ఎంపీలు ఉన్నారు.
ఏ కూటమిలోనూ లేని పార్టీలు..
వైస్సార్‌సీపీ, బీఆర్‌ఎస్, బిజూ జనతాదళ్, బీఎస్సీ, మజ్లిస్, టీడీపీ, శిరోమణి ఆకాలీదళ్, ఏఐయూడీఎఫ్, జనతాదళ్ (ఎస్), ఆర్‌ఎల్‌పీ, శిరోమణి అకాలీదళ్(మాన్). వీటిలో వైఎస్సార్‌సీపీ, బిజూ జనతాదళ్, టీడీపీలు పార్లమెంట్‌లో అధికార పక్షానికి తరచూ నుకూలంగానే వ్యవహరిస్తుంటాయి.
ఒంటరైన బీఆర్‌ఎస్..
తెలంగాణలోని బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గతేడాది చివరన, ఏడాది ప్రారంభంలో కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా కూటమికి ప్రయత్నించారు. కానీ కేసీఆర్‌ను దేశంలోని ఏ పార్టీ అధినేత విశ్వసించలేదు. చివరకు జేడీయూ కొన్నాళ్లు తోడుగా నిలిచినా.. ఇప్పుడు అదీ దూరమైంది. కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి ప్రాంతీయ పార్టీలు కూడా వెనుకాడుతుండడంతో చివరకు ఆయన తన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ ఇప్పుడ ఆ పార్టీ ఏ కూటమిలో చేరకుండా ఒంటరైంది.
కేంద్రంపై బీజేడీ గుస్సా..
ఇక తమ రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని ఒడిశా ముఖ్యమంత్రి బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఆరోపిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వ్యతిరేక గళమెత్తాలని తమ ఎంపీలకు ఆయన సూచించారు. తమను అంటరాని పార్టీగా చూస్తున్నారని ఆరోపిస్తూ మజ్లిస్ అధినేత ఒవైసీ ఇండియా కూటమికి దూరంగా ఉన్నారు. ఈ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, కర్ణాటకల్లో ప్రభావం చూసే అవకాశముంది.
తటస్థులు కూటమి కడితే..
ప్రస్తుతం ఏ పార్టీలో లేని 11 పార్టీలు ఎన్నికల తర్వాత ఏదో ఒకవైపు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని బీజేపీ, కొన్ని కాంగ్రెస్ కూటమి వైపు వెళ్తాయన్న అభిప్రాయం ఉంది. అధికారం ఎవరికి వస్తే వారికి మద్దతు ఇవ్వాలని మరికొందరు చూస్తున్నారు. ఇలా కాకుండా ఈ తటస్థ పార్టీలు జట్టు కట్టినా.. వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీఏ, ఇండియా పార్టీల్లో ఏదో ఒకదానికి మద్దతు ఇచ్చి అధికారంలోకి తెచ్చే అవకాశం కూడా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.