Munugode Bypoll: మునుగోడు ప్రజలపై కనక వర్షం కురుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక అనివార్యం కావడం, పైగా మరో పదహారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. బిజెపి అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖరారయినప్పటికీ.. టిఆర్ఎస్, కాంగ్రెస్ ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని అన్ని పార్టీలు ఊవ్విళ్ళురూతున్నాయి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు ఓటరు మహాశయుడిని ప్రసన్నం చేసుకుంటే చాలు అన్నట్టుగా పార్టీలు క్షేత్రస్థాయిలో బలగాలను మోహరించాయి. స్థానికంగా ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి తీసుకునేందుకు కొనుగోళ్ళ ప్రక్రియను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పైగా సభలు, సమావేశాలు, ఏర్పాట్లు, అక్కడికి జనం తరలింపు ఇలా ప్రతీ పనికి వెలకట్టి మరీ చెల్లింపులు జరిగితేనే పనులు సాగుతున్నాయి. మొత్తంగా ఈ ఉపఎన్నిక కోసం ఇంకా నోటిఫికేషనే విడుదల కాలేదు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి నుంచి పోటీ అనే మాట అటు ఉంచితే.. సొంత పార్టీలో అసమ్మతి గుప్పుమంటే అది మొదటికే మోసం వస్తుంది అనే ఉద్దేశంతో ఆ వ్యవహారాన్ని చక్కబట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. టికెట్ ఆశావహులు పక్కకు తప్పుకునేందుకు బరిలో ఉండాలనుకునే నేత 50 లక్షల నుంచి కోటి దాకా ముట్ట చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. మునుగోడు నియోజకవర్గంలో బడా నేతలకు భారీ ధర పలుకుతోంది.
వారి స్థాయిని బట్టి పార్టీలు 10 నుంచి 20 లక్షల దాకా చెల్లిస్తున్నాయి. ఇక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న పార్టీలు ఆ దిశగా ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. పార్టీలోకి రావాలని ప్రత్యర్థి పార్టీ నేతలకు ఆఫర్ ఇచ్చినా వారు కాదనేసరికి కొత్త ప్రతిపాదన వారి ముందు పెడుతున్నారు. ” అన్నా! మీరు మా పార్టీలోకి రాకూడదు. అది మీ ఇష్టం. కానీ ఎన్నికల్లో మీ అభ్యర్థి తరపున ప్రచారం చేయకూడదు. ఇందు కోసం మీరు కోరినంత డబ్బు ఇస్తాం. డబ్బు వద్దనుకుంటే ఖరీదైన బహుమతులు పంపుతాం” అంటూ రాయ”బేరా”లు నడిపిస్తున్నారు. ప్రధానంగా మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో ఈ తరహా ఆఫర్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. అయితే ఇక్కడి నేతలు ప్రచారంలో కనిపించకపోవడంతో పలువురిలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వీరంతా కూడా ఇతర పార్టీల ప్రలోభాల్లో చిక్కుకున్నారని తెలిసింది. డబ్బు, బహుమతులకు లొంగిపోవడంతో ఇతర ప్రదేశాలకు యాత్రలకు వెళ్లారని సమాచారం. ఈ ఖర్చు మొత్తం కూడా అధికార పార్టీ నేతలు చూసుకుంటున్నారని తెలిసింది. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా గుర్తింపు రాకపోవడంతో కొంతమంది నాయకులు అధికార పార్టీతో ఒప్పందాలు చేసుకున్నారని సమాచారం.
గులాబీ పార్టీ హవా
ఇటీవల కెసిఆర్ స్థానిక నాయకులకు క్లాస్ పీకడంతో.. ఇతర పార్టీ నాయకుల కొనుగోళ్ళను టిఆర్ఎస్ వేగిరం చేసింది. కేవలం 12 రోజుల్లోనే కాంగ్రెస్ కు చెందిన 11 మంది సర్పంచులు, ఏడుగురు ఎంపీటీసీలను తమ పార్టీలోకి చేర్చుకుంది. ఒక్కో ప్రజాప్రతినిధికి పది లక్షలు, ఎస్సీ సర్పంచి కైతే పది లక్షలతో పాటు రెండు దళిత బంధు యూనిట్లను అందించేందుకు కీలక నేతల నుంచి హామీ లభించింది. అధికార పార్టీని నిలువరించేందుకు బిజెపి కూడా ప్రజా ప్రతినిధుల కొనుగోళ్లకు సిద్ధమైంది. గులాబీ పార్టీలో అసంతృప్తితో ఉన్న పదిమంది ప్రజా ప్రతినిధులను గుర్తించి ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కాషాయం కండువా కప్పుకున్న మరు క్షణమే డబ్బు అప్పజెప్పేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.
ఖరీదైన కార్ల రాక
నిన్న మొన్నటి వరకు మునుగోడు నియోజకవర్గంలో పరిస్థితి స్తబ్ధంగా ఉండేది. కానీ ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారో అప్పుడే పరిస్థితి మారిపోయింది. ఎన్నికల ప్రచారం కోసం అన్ని పార్టీలకు చెందిన నాయకులు మునుగోడు బాట పట్టారు. ఖరీదైన కార్లల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో నిత్యం ఏదో ఒక పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. శనివారం కేసీఆర్ సభ ముగిసింది. ఆదివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్ర నాయకుల సమావేశాలు ఉండటంతో అన్ని మండలాలు మూడు పార్టీలకు చెందిన జెండాలతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా మద్యమైతే ఏరులై పారుతుంది. జూలై మాసంలో వైన్ షాప్ లలో రోజుకు 2.5 లక్షల చొప్పున అమ్మకాలు జరిగితే, ఈ పది రోజుల్లో అది మూడు లక్షలకు పెరిగింది. బార్లల్లో గతంలో రోజుకు లక్ష చొప్పున వ్యాపారం జరిగితే.. ఇప్పుడు అది రెండింతలైంది. మాంసం విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్, హోంశాఖ మంత్రి అమిత్ సభలకు వచ్చే వారికి 500, క్వార్టర్ మందు, బిర్యానీ పొట్లం, అదే మహిళలకు అయితే 500, ఒక కూల్ డ్రింక్ బాటిల్, చీరలు అందజేస్తున్నారు. ఇక పలుకుబడి ఉన్న వ్యక్తులకైతే ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం జరిగే కెసిఆర్ సభకు లక్ష మంది దాకా వస్తారని టిఆర్ఎస్ నాయకులు అంచనా వేయగా 60 వేల మంది వచ్చారు. ఇక ఆదివారం జరిగే అమిత్ షా సభకు మూడు లక్షల దాకా జనాన్ని సమీకరించాలని బిజెపి నాయకులు టార్గెట్ గా పెట్టుకున్నారు. కాగా ఇన్ని రోజులు తమ నియోజకవర్గాన్ని పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు వేగంగా అభివృద్ధి పనులు చేస్తున్న తీరు చూసి ఆ ప్రాంత ప్రజలు సంబరపడుతున్నారు. ఇక కాంగ్రెస్ కూడా దూకుడు పెంచడంతో మునుగోడులో ముక్కోణపు పోటీ ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Munugode another huzurabad all parties are working on winning the by elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com