Mudragada Padmanabham : కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పయనమెటు? ఆయన్ను తిహార్ జైలులో పెట్టించేందుకు ప్రయత్నించిందెవరు? కాపు ఉద్యమం జోకర్ కారులా మారిందని చేసిన కామెంట్స్ దేనికి సంకేతం? పొలిటికల్ రీఎంట్రీ ఏ పార్టీ ద్వారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశమైంది. తుని రైలు విధ్వంస ఘటనలో విజయవాడ రైల్వేకోర్టు ముద్రగడతో పాటు మరికొందరికి క్లీన్ చీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారం రోజులతరువాత దీనిపై స్పందిస్తూ ముద్రగడ రాష్ట్ర ప్రజలకు సంచలన లేఖ రాశారు. తుని రైలు దహనం కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాను నిర్దోషిగా బయటపడ్డానని చెప్పారు. త్వరలో పొలిటికల్ రీఎంట్రీ ఇస్తానని కూడా ప్రకటించారు.
సంచలన ఆరోపణలే..
అయితే ఇప్పుడు ముద్రగడ లేవనెత్తిన కొన్ని అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఏపీలో తనను ఉండకుండ చేయాలని కుట్ర చేశారని గుర్తుచేశారు. ఏకంగా తీహార్ జైలుకు తరలించేందుకు ఏర్పాటుచేశారని కూడా ఆరోపించారు. బెయిల్ తెచ్చుకోవాలని, అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాలని సలహా సైతం ఇచ్చినట్టు తెలిపారు. అయితే నాడు అదే చేసి ఉంటే కులంతో పాటు తాను ఉద్యమం కూడా పలుచన అయ్యేదని చెప్పారు. అయితే ఇవన్నీ చేసిందెవరు? అన్నదానిపై మాత్రం ముద్రగడ స్పష్టతనివ్వలేదు. నాడు ఈ ఘటనలు జరిగినప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అన్న వాతావరణం ఉంది. తుని రైలు కేసుపై స్పందించి మాట్లాడుతుండడంతో ఇది కచ్చితంగా టీడీపీపైనే వ్యాఖ్యలు చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రెండు దశాబ్దాలుగా పదవులకు దూరం..
ముద్రగడ పొలిటికల్ ఎంట్రీ గురించి చాన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 1994 వరకూ మాత్రమే ఆయన పదవుల్లో ఉన్నారు. అక్కడ నుంచి వరుస ఓటములు పలుకరించాయి. దీనింతటికి చంద్రబాబే కారణమన్న కోపం, పగ ముద్రగడలో ఉండేది. మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ ఓడిపోయారు. రాజకీయ నిర్వేదానికి లోనై, జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీచేయనని ప్రకటించారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనను పిలిచి ప్రత్తిపాడు నుంచి పోటీచేయాలని అడిగారు, కానీ ఆయన ప్రత్తిపాడు నుంచి గాక కాపు ఓటర్లు అధికంగా గల పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్తిపాడుే నుంచి పోటీ చేశారు. మళ్ళీ ఓడిపోయారు. 2019లో మాత్రం అస్సలు పోటీచేయలేదు. కాపు రిజర్వేషన్ ఉద్యమం ద్వారా టీడీపీని దెబ్బకొట్టి జగన్ కు పరోక్షంగా సాయమందించారన్న అపవాదు ముద్రగడపై ఉంది.
ఆ అపవాదుతో..
గత ఎన్నికల తరువాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఉన్నపళంగా మూసివేస్తున్నట్టు ముద్రగడ ప్రకటించారు. చంద్రబాబు ఇచ్చిన ఈబీసీ కోటా రిజర్వేషన్లను జగన్ తగ్గించినా ఏనాడు స్పందించిన దాఖలాలు లేవు. గతంలో జరిగిన ఉద్యమంలో నమోదైన కేసులు ఎత్తివేస్తున్న క్రమంలో మాత్రం సీఎం జగన్ కు బహిరంగంగా లేఖ రాసి అభినందనలు తెలిపేవారు. జగన్ కోసమే నాడు ఉద్యమం నడిపారని.. ఎప్పుడైతే జగన్ గెలిచారో అప్పుడు ఉద్యమం అవసరం లేదన్నట్టు భావించి మూసివేశారని ముద్రగడపై ఆరోపణ ఉంది. అయితే ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారా? అన్నదానిపై స్పష్టత లేదు. కానీ ఆయన వైసీపీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఫైనల్ గా వైసీపీ వైపే?
టీడీపీలో చేరతారునుకుంటే.. గతంలో తన విషయంలో టీడీపీ చేసిన తప్పిదాలనే ముద్రగడ ప్రస్తావిస్తున్నారు. దీంతో టీడీపీలో చేరేందుకు అవకాశం లేదు. అయితే వైసీపీ లేకపోతే బీజేపీ అనే అంటున్నారు. మరి ఈ రెండింటిలో ఏది చేరాలనుకున్నా బాబు నీడ పడకూడదు అన్నదే ముద్రగడ ఆలోచన. బీజేపీ తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకోకపోతే మాత్రం కమలం వైపు చూస్తే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలా జరగకపోతే ఆయన జగన్ కే మద్దతు ఇస్తారని తెలుస్తోంది.ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబులు పొత్తులకు సిద్ధమని సంకేతాలు పంపుతున్న నేపథ్యంలో బలమైన కాపు నాయకుడ్ని చేర్చుకోవాలని వైసీపీ వ్యూహం పన్నుతోంది. అదే కానీ నిజమైతే రాజకీయ ప్రకంపనలు చెలరేగే అవకాశముంది. ముఖ్యంగా వైసీపీకి గతంలో ముద్రగడ లబ్ధి చేకూర్చారన్న అపవాదు నిజమవుతోంది. దీనిపై కొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Mudragada padmanabham eye on that party
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com