విశ్వనగరంగా పేరున్న భాగ్యనగరాన్ని మహిళలే ఏలనున్నారు. ఇప్పటికే మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రేటర్ ను ఏలేది ‘రాణి’(మహిళ)నే అని స్పష్టమవుతోంది. ఈసారి కార్పొరేటర్ స్థానాలను పురుషుల కంటే అధికంగా మహిళలే గెలుచుకొని సత్తా చాటడం విశేషం.
Also Read: టీఆర్‌ఎస్‌కు ఎదురు గాలి
గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. స్థానిక సంస్థల రిజర్వేషన్ ప్రకారం 50శాతం మహిళలకు సీట్లు కేటాయించారు. అంటే పురుషులకు 75సీట్లు.. మహిళలకు 75సీట్లు రావాల్సి ఉంది. అయితే మహిళలు తమ రిజర్వేషన్ కంటే ఐదు సీట్లను ఎక్కువగా గెలుచుకున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో మొత్తంగా 80మంది మహిళలు కార్పొరేటర్లుగా ఎంపికయ్యారు. మహిళా రిజర్వేషన్ లేనిచోట సైతం ఐదుగురు మహిళలు పోటీచేసి గెలుపొందారు. మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో ఈ సీటుపై కన్నేసిన రాజకీయ ప్రముఖులు తమ కుటుంబ సభ్యులను ఎన్నికల బరిలో నిలిపారు. దీంతో రిజర్వేషన్ స్థానాల కంటే మరో ఐదుగురు మహిళలు కార్పొరేటర్లుగా ఎంపికైనట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ నుంచి అత్యధికంగా 30మంది మహిళా కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి 28మంది.. మజ్లీస్ నుంచి 20మంది.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు మహిళలు కార్పొరేటర్లుగా గెలుపొందారు. తెలంగాణకు ఆదాయానికి ఆయువుపట్టుగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఈసారి మహిళల మణులే ఏలేందుకు నడుంబిగించారు.
Also Read: కాంగ్రెస్‌ను ఖాళీ చేస్తున్న బీజేపీ
మేయర్ రేసులో ప్రధానంగా భారతీనగర్ కార్పొరేటర్ సింధురెడ్డి.. చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి.. వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి.. బంజరా హిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి.. అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి.. సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ.. ఖైరాతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ లో లాబీయింగ్ మొదలైంది. దీంతో ఎవరు మేయర్ అవుతారా? అనేది ఆసక్తి నెలకొంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్