ఏ నేత అయినా ప్రజలకు అందుబాటులో ప్రజాక్షేత్రంలో పోరాడుతాడు. కానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో సాగుతున్న బీజేపీ వెంట పడడు. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ తీరు ఇందుకు భిన్నంగా ఉంది. ఆయన విశాఖ స్టీల్ తో రణరంగంగా మారిన విశాఖపట్నంను వదిలి ఢిల్లీలో ఎందుకు పర్యటిస్తున్నాడన్నది ఇప్పుడు అంతుచిక్కని విధంగా ఉంది. “నేలా విడిచి సాము చేయా కూడదు” అని తెలిసినా కూడా పవన్ కళ్యాణ్ రియాలిటీని విస్మరిస్తూ ఢిల్లీ నేతల వెంటపడుతున్నాడు. ఏదైనా సమస్యపై క్షేత్రస్థాయిలో పోరాడడం లేదు. జనసేన పార్టీ చీఫ్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పనితీరు ఇప్పుడు జనసైనికులను కూడా ఆశ్చర్యపరుస్తోందని నేతలు అంటున్నారు..
స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా గ్రామాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ కీలక సమయంలో జనసేన నేతలను ప్రిపేర్ చేయిస్తూ ఎన్నికలను ఎదుర్కోవాలి. పంచాయతీల్లో గెలుపు వ్యూహాలు రచించాలి. కానీ ఈ కీలక సమయంలో పవన్‌కళ్యాణ్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ హైకమాండ్ నేతలను కలవడానికి ప్రాధాన్యం ఇస్తుండడం చూసి అందరూ విస్తుపోతున్నారు. ఈ విషయంలో జనసేన చీఫ్ పవన్.. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు. వృద్ధాప్యం దరిచేరినా.. గత అసెంబ్లీ ఎన్నికలలో అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ, చంద్రబాబు ఇప్పటికీ తన పోరాటాన్ని వదలకపోవడం విశేషం.
ఈ పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని తెలిసి కూడా 71 సంవత్సరాల వయసులో టిడిపి చీఫ్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా గట్టి పోరాటం చేస్తుండడం నిజంగానే అభినందించాల్సిన విషయం. తన పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందా లేదా ఓడిపోతుందా అన్న దానితో సంబంధం లేకుండా చంద్రబాబు గ్రామస్థాయి పర్యటిస్తున్నాడు. విలేకరుల సమావేశాలను నిర్వహిస్తూ నేతలకు మద్దతుగా నిలుస్తున్నాడు. కోర్టులకు వెళ్లి ఎన్నికల అధికారులపై వ్యవహారశైలిపై ఫిర్యాదు చేస్తున్నాడు. పంచాయతీ ఫలితంతో సంబంధం లేకుండా పంచాయితీ యుద్ధంలో పోరాడుతూ నిజమైన నాయకుడి గా నిలుస్తున్నాడు.
చంద్రబాబు కథ ఇలా ఉంటే.. మరి పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నాడు? ఏమి చేయడం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఆయన పార్టీ ఎక్కడా కనిపించడం లేదు. అతని స్నేహపూర్వక పార్టీ బిజెపి కూడా ఎటువంటి పోరాటం ఇవ్వడం లేదు.. ప్రకటనలు చేయడం మినహా, సోము వీరరాజు నేతృత్వంలోని బిజెపి నాయకులు స్థానిక ఎన్నికలలో పోరాటం చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. అమిత్ షా మరియు ఇతరులను కలవడానికి పవన్ కళ్యాణ్ తాజాగా నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఢిల్లీ వెళ్ళారు. అతను ఏమి సాధించాడంటే ఏం చెప్పలేని పరిస్థితి నెలకొంది.
తిరుపతి పార్లమెంటరీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలలో పోటీ చేసే అవకాశం జనసేనకు లభించినా, పవన్ పెద్దగా పట్టు సాధించేలా కనిపించడం లేదు. ఎందుకంటే అతను ప్రజలతో సంబంధాన్ని పూర్తిగా కోల్పోతున్నాడు.. పవన్ ప్రజాక్షేత్రంలోకే దిగడం లేదు. ప్రజలతో కనెక్ట్ అవ్వడం లేదు.. వారి సమస్యల గురించి మాట్లాడటం లేదు. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతి ఎన్నికలలో పోరాటం చేసే సమయం ఇది. లేకపోతే పవన్ కళ్యాణ్ తోపాటు ఆయన పార్టీ కేవలం కాగితంపై మాత్రమే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.