మావోయిస్టులు ఎందుకు కనుమరుగయ్యారు?

మావోయిస్టు ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ప్రభుత్వం  మావోయిజంపై  కొన్నేళ్ల క్రితమే మల్టీ వార్ ఫేర్ వ్యూహాన్ని  (బహుముఖ యుద్ధం).ప్రారంభించాయి. మావోయిజాన్ని అణచివేసేందుకు  ఆర్థికంగా(నిధులు అందకుండా ), భౌతికంగా(ఆయుధంతో అణచివేయడం ), మానసికంగా( క్యాడర్ ను గందరగోళానికి గురిచేయడం ) అనే బహుముఖ యుద్ధ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు విశ్లేషకులు  పేర్కొంటున్నారు.    Also Read: నిరుద్యోగ తెలంగాణ మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిన కొద్ది నెలలకే, వివిధ  […]

Written By: NARESH, Updated On : September 7, 2020 11:44 am

maoists, naxals

Follow us on

మావోయిస్టు ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ప్రభుత్వం  మావోయిజంపై  కొన్నేళ్ల క్రితమే మల్టీ వార్ ఫేర్ వ్యూహాన్ని  (బహుముఖ యుద్ధం).ప్రారంభించాయి. మావోయిజాన్ని అణచివేసేందుకు  ఆర్థికంగా(నిధులు అందకుండా ), భౌతికంగా(ఆయుధంతో అణచివేయడం ), మానసికంగా( క్యాడర్ ను గందరగోళానికి గురిచేయడం ) అనే బహుముఖ యుద్ధ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు విశ్లేషకులు  పేర్కొంటున్నారు. 
 

Also Read: నిరుద్యోగ తెలంగాణ

మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిన కొద్ది నెలలకే, వివిధ  రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న విప్లవ గ్రూపులన్ని నవంబర్ 2004 లో విలీనమై మావోయిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు )గా ఏర్పడి ప్రభుత్వాలకు మింగుడుపడని విధంగా తయారయ్యారు. అప్పటికే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  నక్సల్స్ కార్యకలాపాలు పతాకస్థాయికి చేరాయి. గ్రామాల్లో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొంది. 
 
మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి  2004లో నక్సల్స్ సమస్య పరిష్కారానికి ఎస్ అర్  శంకరన్ (ఐ ఏ ఎస్)ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాంతి చర్చల కమిటీ, నక్సల్స్ తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అనంతరం జరిగిన ఎన్కౌంటర్లలో మావోయిస్టులు భారీఎత్తున క్యాడర్ ను కోల్పోయినా నక్సల్స్ కార్యకలాపాలు  తగ్గకపోగా, మరింతగా విస్తరించాయి.   1997లో గ్రే హౌండ్స్ సృష్టికర్త కె ఎస్ వ్యాస్ (ఐ పి ఎస్)ను, మరో ఐ పి ఎస్ అధికారి ఉమేష్ చంద్ర ను 1999లో హైదరాబాద్ నడిబొడ్డున నక్సల్స్ కాల్చి చంపారు.  1998లో అప్పటి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ శాసనసభాపతి దుద్దిళ్ల శ్రీపాద రావును కిడ్నాప్ చేసి మంథని అడవుల్లో కాల్చి  చంపగా,తెలుగుదేశం ప్రభుత్వం లో హోం మంత్రిగా పనిచేసిన ఎలిమినేటి మాధవరెడ్డిని నడిరోడ్డుపై మందుపాతరతో పేల్చి హత్య చేశారు. తిరుపతిలో అలిపిరి వద్ద నవంబర్ 2003లో డైరెక్షనల్ ల్యాండ్ మైన్ తో అప్పటి సీఎం  నారా చంద్రబాబు నాయుడును చంపేందుకు చేసిన ప్రయత్నం,  ఆంధ్రప్రదేశ్ లో  నక్సల్స్ కార్యకలాపాల స్థాయికి నిదర్శనం. ఒకవిధంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులే నక్సల్స్ సమస్యతో నిర్బంధం లాంటి సమస్యను ఎదుర్కొన్నారు.  శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో మావోయిజం నిర్మూలనకు ఆర్థిక వనరులు అందే మార్గాలపై దెబ్బ కొడుతూనే,  భౌతిక దాడులతో తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తూ…  మావోయిస్టులపై మానసిక యుద్ధ వ్యూహాన్ని అమలు చేసేందుకు పోలీసులకు కావలసిన వరులను ప్రభుత్వాలు సమకూర్చాయి. 
 
మానసిక యుద్ధ వ్యూహంలో ప్రధానంగా… నాయకత్వానికి, క్యాడర్ కు మధ్య ఒకరిపై ఒకరికి అపనమ్మకం కల్గించడం. దళాల్లో డబ్బుకు లొంగిపోయేవారిని, విలాసవంతమైన జీవితం కోరుకునేవారిని గుర్తించి, వారితో కోవర్ట్ ఆపరేషన్ న్లు చేయించడం, లొంగుబాట పడుతున్నారంటూ ప్రచారం చేయడం  ఈ వ్యూహంలో ప్రధాన అంశం. 
 
ప్రస్తుత పెద్దపల్లి జిల్లా  కమాన్ పూర్ మండలం బేగంపేట రామగిరిఖిల  గుట్టపై జరిగిన “ఘటన” ఈ వ్యూహం అమలు చేసిన తర్వాత తెలంగాణలో  జరిగిన మొట్టమొదటి కోవర్ట్ ఆపరేషన్. దళం నిద్రిస్తుండగా సెంట్రీ విధులు నిర్వహిస్తున్న జడల నాగరాజు అనే దళసభ్యుడు దళంపై కాల్పులు జరిపి ఆయుధంతో పోలీసులకు లొంగిపోయాడు. ఈ కాల్పుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి విజయ్ చనిపోయాడు. రెండో ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం శ్రీరాములపల్లిలో జరిగింది. మిరప చేనులో నిద్రిస్తున్న భూపతి దళాన్ని కత్తుల సమ్మయ్య, ఆయన భార్య, మరో సభ్యుడు విజయ్ లు భూపతితోపాటు మరో ఇద్దరు దళ సభ్యులను హతమార్చి పోలీసులకు లొంగిపోయారు. ఆ తర్వాత జరిగిన కోవర్ట్ ఆపరేషన్లతో మావోయిస్టు పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతినగా, పోలీసులు భారీ విజయాలను చవిచూశారు.  అనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కార్యకలాపాలు నామమాత్రపు చర్యలకే ప్రరిమితమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కట్టడికి అనుసరించిన వ్యూహాన్నే ,ఇప్పుడు దండకారణ్యంతో పాటు 19 రాష్ట్రాల్లో విస్తరించిన  మావోయిస్టులపై తెలంగాణ నమూనా (లొంగుబాట) మానసిక యుద్ధాన్ని  అమలు చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు .
 

Also Read: కేసీఆర్ రెవిన్యూ ప్రక్షాళన విప్పిన ఫామ్ హౌస్ గుట్టు..!

ఈ క్రమంలోనే,  దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల పోలీసు, నిఘా వర్గాలు “లొంగు బాట ” వ్యూహాన్ని  అమలుచేస్తున్నాయి . పార్టీ క్యాడర్ ను  గందరగోళానికి గురిచేసి నిజమేదో తెలుసుకునేలోపే టార్గెట్ ను దెబ్బతీసేలా , నిఘా వ్యవస్థలు పనిచేస్తున్నాయి.  అగ్రనాయకులను పసిగట్టి టార్గెట్ చేయడంలో తెలంగాణ పోలీసులది అందెవేసిన చేయి. 
 
90వ దశకంలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ బెంగుళూరు డెన్ కీపర్ గా  గోవిందరెడ్డి వ్యవహరించిన సమయంలో జరిగిన  ఎన్కౌంటర్ లో రాష్ట్ర కమిటీ కార్యదర్శి పులి అంజయ్య దంపతులతో పాటు, కొయ్యూరు ఎన్కౌంటర్ లో నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్ అగ్రనేతలతో పాటు మరో నేత  హతమయ్యారు. బెంగళూరు డెన్ ను పసిగట్టింది హైదరాబాద్ కు చెందిన  ఇంటలిజెన్స్ నిఘా బృందం. ఆనాటి బెంగళూరు సమావేశానికి లేటుగా వచ్చిన కేంద్ర కమిటీ సభ్యుడు,ప్రస్తుతం లొంగుబాట పట్టాడని ప్రచారం జరుగుతున్న  గణపతి  ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నాడని అప్పట్లో  ప్రచారమైంది.ఆనాటి ఎన్కౌంటర్ దేశ వ్యాప్తంగా సంచలమైంది. ఈ ఎన్కౌంటర్ తో నక్సలిజం తగ్గుముఖం పడుతుందని  పోలీసులు భావించారు .కాని, పోలీసులు, ప్రభుత్వం  ఉహించినదానికి వ్యతిరేకంగా  నక్సలిజం ఉవ్వెత్తున ఎగసిపడి ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది.అందుకే,  నక్సలైట్లపై అణచివేతతో పాటు నక్సలిజం నిర్మూలనకు ఇతర మార్గాలను అప్పటినుంచే అన్వేషించడం మొదలుపెట్టారు. అందులో భాగమే  మావోయిస్టు అగ్రశ్రేణి నాయకత్వం పై వివిధ రకాల ప్రచారాన్ని నిర్వహిస్తూ  “లొంగుబాట”పట్టేలా పోలీసు, నిఘా వర్గాలు పనిచేస్తున్నాయి. మావోయిస్టు పార్టీకి అత్యున్నత నిర్ణాయక  వ్యవస్థ ఐన సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో  సభ్యులను “లొంగు బాట ” పట్టించి మావోయిస్టు పార్టీకి భారీగా నష్టం కలిగించాలానేది పోలీసుల వ్యూహంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. రాజ్యం ముందు ఎవరైనా, ఎప్పటికైనా  చివరికి తల వంచాల్ సిందే అనే మెసెజ్ మావోయిజం పట్ల ఆకర్షితులయ్యే వర్గాల్లోకి వెళుతుందనేది పోలీసుల వ్యూహం. అందుకే మావోయిస్టు పార్టీకి ఆయువుపట్టు  లాంటి సెంట్రల్ కమిటీకి చెందిన  గణపతికి వయసు రీత్యా సంక్రమించిన అనారోగ్య సమస్యలను ఆసరా చేసుకొని , మరో నలుగురు ముఖ్య నేతలు లొంగు‘బాట’వ్యూహానికి  తెలంగాణ పోలీసులు చాలా రోజుల క్రితమే స్కెచ్ వేసినట్టు సమాచారం. నక్సల్స్ అణచివేతలో తెలంగాణ పోలీసులది చురుకైన పాత్ర . ఎప్పుడూ ఎన్కౌంటర్లతో దేశవ్యాప్త సంచలనాలకు కారకులయ్యే తెలంగాణా పోలీసులు… ఈసారి “మావోయిస్టు అగ్రనేతల లొంగుబాట “ద్వారా మావోయిస్టు క్యాడర్ తో “మానసిక “యద్ధం చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.ఎందుకంటే,  అగ్రనేతల లొంగుబాటుతో కింది స్థాయి క్యాడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతినడమేకాక, మానసికంగా కుంగుబాటుకు లోనవుతారు.కుటుంబాలను విడిచి ఉద్యమంలో పనిచేస్తున్నవారు పునరాలోచనలో పడతారు.  తద్వారా ఉద్యమమే నీరుగారిపోతుంది. పోలీసులకు కావాల్సిందికూడా ఇదే. దీనిద్వారా, సుమారు 4 దశాబ్దాలుగా పోలీసులకు, ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న నక్సల్స్ సమస్యకు ముగింపు దొరుకుతుందని పోలీసులు, ప్రభుత్వాలు భావిస్తున్నాయి. 
 
గడచిన కొన్ని దశాబ్దాలుగా జరిగిన ఎన్కౌంటర్ల వల్ల మావోయిస్టు ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించిందేతప్ప, తగ్గలేదు. దీన్ని గుర్తించిన పోలీసు మేధావులు … మావోయిస్టులను భౌతికంగా నిర్ములించడంకన్నా, మానసికంగా కుంగదీయడం  ద్వారా ఉద్యమాన్ని నిర్ములించవచ్చనే నిర్ణయానికి పోలీసులు, ప్రభుత్వాలు వచ్చాయి. కొన్ని  సత్ఫలితాలను కూడా సాధించాయి . ఎన్కౌంటర్ లో మావోయిస్టు నేతలను  హతమార్చే అవకాశం ఉన్నా లొంగుబాటు కే ప్రాధాన్యమివ్వాలని పోలీసులు నిర్ణయించుకున్నట్టు సమాచారం.అందుకు,  మావోయిస్టు నేతలను తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురిచేసి లొంగుబాట మినహా మరో గత్యంతరం లేని పరిస్థితిని భద్రతాదళాలు కల్పిస్తున్నాయి.అందుకే,  నెత్తురు చుక్క చిందకుండా  మావోయిస్టులపై యుద్ధంలో విజయం సాధించాలనే వ్యూహాన్ని పోలీసులు, ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. 

దీనిలో భాగంగానే  గత కొంత కాలంగా స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) ఈ అంశంలో చాకచక్యంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం.  మావోయిస్టు పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, ముఖ్య నక్సల్ నేతలను ‘లొంగుబాటు’ దిశగా పయనింపజేయడంలో ఈ విభాగం సఫలీకృతమవుతున్నట్టు తెలుస్తోంది. 1990వ దశకంలో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పులి అంజయ్య దంపతులను, కొయ్యూరు ఎన్కౌంటర్ ద్వారా నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి వంటి అగ్రనేతలను, 2011లో పశ్చిమబెంగాల్ మిడ్నపూర్ అడవుల్లో ఎన్కౌంటరైన పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన సంద రాజమౌళి అలియాస్ ప్రసాద్, కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన బుర్ర చిన్నన్న లను   మట్టుబెట్టిన తరహా సంచలన ఘటనల  విధంగా కాకుండా, మావోయిస్టులను లొంగిపోయేలా చేసి, తెలంగాణా పోలీసు శాఖ తన చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించే పనిలో ఉన్నట్టు నిఘా  వర్గాలనుంచి అందుతున్న సమాచారం  .
అందుకు,  ఈసారి ఎన్కౌంటర్ ఘటన ద్వారా కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే ‘లొంగుబాటు’ ఉదంతం ద్వారా సంచలనం సృష్టించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి లొంగిపోనున్నారనే వార్తలు ఎలక్ట్రానిక్,   సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్నాయి. గణపతి వంటి అగ్రనేత లొంగుబాటు అంశంపై జరుగుతున్న ప్రచారంపై ‘హక్కుల సంఘం’ నేతలు గాని, ఇతరత్రా విప్లవ సానుభూతిపరులుగాని  ప్రకటనలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు.

 

Also Read: రేవంత్ కొత్త రాజకీయ పార్టీ…. కాంగ్రెస్ కు షాక్ తప్పదా….?

సాధారణంగా ఇటువంటి ప్రచార సందర్భాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను సమర్థించే సంస్థల నేతలు వెంటనే స్పందిస్తుంటారు. అంతేగాక ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడా స్పందిస్తుంటారు . పార్టీపై జరిగే ఈ తరహా ప్రచారపు వార్త సంబంధీకులకు చేరడానికి ఇప్పుడు గతంలో మాదిరిగా వ్యవధి కూడా అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా నిమిషాల్లోనే విషయం విశ్వవ్యాప్తమవుతోంది. కానీ గణపతి లొంగుబాటు అంశంలో మావోయిస్టు పార్టీ నాయకులుగాని, దాని అనుబంధ, సానుభూతి సంస్థలకు చెందినవారు గాని ఎటువంటి ప్రకటన చేయడం లేదు. కారణం … మావోయిస్టులకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించే ఒకేఒక వ్యక్తి విప్లవ కవి వరవర రావ్. ఇతనిపై అర్బన్ నక్సల్ ముద్ర వేసి కోరేగావ్ (ప్రధాని ని హత్య చేసేందుకు )కుట్ర కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో తమకూ ఇదే పరిస్థితి ఎదురవుతుందని హక్కుల సంఘాలు కాని, సానుభూతి పరులుకాని స్పందించడంలేదని వివిధ వర్గాలు పేర్కొంటున్నాయి.ఏంజరిగిందో చెప్పేందుకు మావోయిస్టుల తరపున ఎవరూ లేకపోవడంతో  మావోయిస్టులకు సంబందించిన సమాచారం ఏకపక్షంగా ప్రచారమవుతోంది. దీన్తో, దండకారణ్యంలో ఏంజరుగుతోందో, ఏది నిజమో  బయటి ప్రపంచానికి అర్థం కాని పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలోనే తెలంగాణా పోలీసు శాఖ మరో భారీ విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకోబోతున్నదనేది ప్రస్తుత  ప్రచారపు సారాంశం. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతితో పాటు మరో నలుగురు ముఖ్య నేతలు కూడా లొంగుబాటను ఎంచుకున్నారనేది తాజా ప్రకంపనల సారాంశం. వీరిలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన  మల్లొజుల వేణుగోపాల్ అలియాస్ వివేక్,  పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, కడారి సత్యానారాయణ అలియాస్ కోసాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ, గణపతి సహా ఐదుగురు మావోమయిస్టు పార్టీ నేతలు కేంద్ర కమిటీ సభ్యులు కావడం గమనార్హం.ఈ నాయకుల లొంగుబాటుకు చాలా కాలం నుంచే ఎస్ఐబీ విభాగపు పోలీసులు పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తెలంగాణా పోలీసుల కృషి ఫలితంగా మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నేతలు లొంగుబాటను ఎంచుకున్నారనేది తాజా ‘బ్రేకింగ్’ ప్రచారం. ఈ లొంగుబాట్ల అంశంలో ఉత్తర తెలంగాణాకు చెందిన ఒకరిద్దరు ముఖ్య ప్రజాప్రతినిధులు మధ్యవర్తిత్వం జరిపారనేది కూడా మరో ప్రచారం. మరోవైపు నక్సలైట్లు ఎవరు లొంగిపోయినా తాము స్వాగతిస్తామని తెలంగాణా పోలీసు శాఖ వర్గాలు ప్రకటించినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.

గణపతి సహా మావోయిస్టు పార్టీకి చెందిన  కేంద్ర కమిటీ సభ్యులు లొంగుబాటలో పయనిస్తే తెలంగాణాలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలన ఘటనగా నమోదవుతుందనడంలో సందేహం లేదు. రెండు రోజుల్లో గణపతి, మరికొందరు ముఖ్య నేతలు పోలీసులకు లొంగిపోయే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంగా  లొంగుబాట్ల ప్రచారపు అంశం విప్లవోద్యమ చరిత్రలో సంచలన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుందా ?  లేక ఉవ్వెత్తున ఎగసిపడుతుందా ?  కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

 
-శ్రీరాముల కొంరయ్య