
CP Sajjanar Transferred: తెలంగాణ పోలీస్ శాఖలో బదిలీల వ్యవహారం చర్చనీయాంశమైంది. సైబరాబాద్ సీపీగా పనిచేస్తున్న సజ్జనార్ ను పోలీస్ శాఖ నుంచి దూరంగా ఆర్టీసీ ఎండీగా పంపడం సంచలనమైంది. తెలంగాణ పోలీస్ కే కాదు.. దేశవ్యాప్తంగా కూడా అసలు సిసలు పోలీస్ గా సీపీ సజ్జనార్ ప్రశంసలు అందుకున్నారు. 1996 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన సజ్జనార్ పలు కీలక కేసులను పరిష్కరించి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు.
వరంగల్ లో అప్పట్లో ఎస్పీగా పనిచేసిన సమయంలో యాసిడ్ దాడి చేసిన నిందితుడిని ఎన్ కౌంటర్ చేసి వార్తల్లో నిలిచాడు. అనంతరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్మసీ డాక్టర్ ‘దిశ’ కేసులో నలుగురిని ఎన్ కౌంటర్ లో లేపేసి దేశవ్యాప్తంగా హీరోగా మారాడు. ఎన్నో మల్టీ టాస్కింగ్ కేసులను సులువుగా పరిష్కరించిన ఘనత సజ్జనార్ సొంతం.. ఏపీలోనూ ఈయన శక్తి సామర్థ్యాలపై మహిళలు, ప్రజల్లో మంచి పేరుంది.
సీపీ సజ్జనార్ సైబారాబాద్ సీపీగా వచ్చి మూడేళ్లు అవుతున్నట్టు తెలిసింది. ఆయనకు అడిషనల్ డీజీగా పదోన్నతి కల్పించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బదిలీ చేసి ఆ స్థాయికి తగిన ఆర్టీసీ ఎండీ పోస్టు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నిన్న ఇంటెలిజెన్స్ చీఫ్ గా అనిల్ కుమార్ ను నియమించిన ప్రభుత్వం మరుసటి రోజే సైబరాబాద్ సీపీని బదిలీ చేయడం గమనార్హం.
కాగా సైబరాబాద్ నూతన సీపీగా స్టీఫెన్ రవీంద్రను ప్రభుత్వం నియమించింది. సజ్జనార్ స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు. పదోన్నతి మూలంగానే సజ్జనార్ బదిలీ జరిగిందని.. అందులో విశేషం ఏమీ లేదని తెలుస్తోంది.