
ఏపీలో అమరావతి భూకుంభకోణం హీట్ పుట్టిస్తోంది. ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్న ఏపీ ఏసీబీ ఈ కేసులో చాలా పెద్ద తలకాయలను పట్టుకున్న సంగతి తెలిసిందే. గత చంద్రబాబు ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసు హైకోర్టులో స్టే ఇచ్చి గాగ్ ఆర్డర్ కూడా ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో కొందరు న్యాయమూర్తుల కూతుళ్ల పేర్లు కూడా మీడియాలో ప్రచారం వచ్చాయి.
ఈ క్రమంలోనే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్న సీఎం జగన్ ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏపీ సీఎం జగన్ ఉన్నఫళంగా షెడ్యూల్ మార్చుకొని ఢిల్లీకి బయలుదేరడం సంచలనమైంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ అపాయింట్ మెంట్ ఖరారు అయ్యింది. దీంతో సాయంత్రం నాలుగు గంటలకే జగన్ ఢిల్లీకి వెళ్లిపోయారు. హడావుడిగా సాగిన ఈ పర్యటన ఆద్యంతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ఎన్నోసార్లు సీఎం జగన్ ప్రయత్నించినా ఇవ్వలేదు. ఆయన కరోనా బారినపడడంతో ఎవ్వరినీ కలవలేదు. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెస్ట్ తీసుకుంటున్న అమిత్ షా సడన్ గా జగన్ ను పిలవడం.. హుటాహుటిన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని జగన్ వెళ్లడం సంచలనమైంది.
ఈ నేపథ్యంలో ఏపీలో అనూహ్యంగా చోటుచేసుకున్న అమరావతి భూకుంభకోణం.. హైకోర్టు తీర్పులు.. ఢిల్లీకి మూలాల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. అమరావతి కుంభకోణంపై ఇప్పటికే సీబీఐ విచారణకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది.
ఈ టూర్ లోనే మోడీ, షాలను జగన్ కలుస్తారని.. అమరావతి భూకుంభకోణం సహా ఇటీవల హైకోర్టు తీర్పులు, సీబీఐ విచారణ నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ టూర్ చేస్తున్నట్టు సమాచారం. అమిత్ షాతో భేటి నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు చెలరేగడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది.